50 శాతం చాలు
గురుకుల’ నియామకాల అర్హతలను సవరించిన సర్కారు
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ నియామకాల నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం సవరిం చింది. డిగ్రీ, పీజీల్లో 50 శాతం మార్కులు ఉంటే చాలని స్పష్టం చేసింది. పీజీటీ అభ్యర్థులకు మూడేళ్ల బోధన అనుభవం లేకున్నా అవకాశమివ్వాలని నిర్ణ యించింది. మొత్తంగా జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ) మార్గదర్శకాలను అమలు చేస్తామని ప్రకటించింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పరీక్షను మాత్రం ఇంగ్లిష్ మీడియంలోనే రాయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని గురుకులాల్లో 7,306 బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిన విషయం తెలిసిందే.
అయితే ఇందులో ట్రెయినీ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టు లకు డిగ్రీలో 60 శాతం మార్కులు, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులకు డిగ్రీ, పీజీల్లో 60 శాతం మార్కులతోపాటు మూడేళ్ల బోధన అనుభవం ఉండాలంటూ సంక్షేమ శాఖలు నిబంధనలు విధించాయి. దీనిపై ఉపాధ్యాయ అభ్యర్థులు, నిరుద్యోగుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. డిగ్రీ, పీజీల్లో 50 శాతం మార్కులుంటే చాలన్న ఎన్‌సీటీఈ నిబంధనలను ఉటంకిస్తూ ‘సాక్షి’ గురువారం ప్రత్యేక కథనాన్ని కూడా వెలువరించింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్పందించారు. ఎక్కువమంది నిరుద్యోగులకు అవకాశం కల్పించేందుకు వెంటనే కొత్త మార్గదర్శకాలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) నిబంధనలను, గతంలో అనుసరించిన విధా నాలు, న్యాయస్థానాల తీర్పులను పాటించా లని సూచించారు.
గురుకుల విద్యా సంస్థల్లో అత్యుత్తమ బోధన జరగడంతో పాటు నిరుద్యోగ యువకులకు ఉద్యోగావకాశాలు రావడమే లక్ష్యంగా నియామకాలు ఉండాలని స్పష్టం చేశారు. ఎన్‌సీటీఈ మార్గదర్శకాల ప్రకారం డిగ్రీలో 50 శాతం మార్కులు వచ్చిన వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిం చాలని, 60 శాతం మార్కులుండాలనే నిబం ధన తొలగించాలని ఆదేశించారు. మూడేళ్ల బోధన అనుభవం ఉండాలనే నిబంధన కూడా తొలగించాలని సూచించారు. డిగ్రీ, బీఎడ్, టెట్ అర్హత ఉన్న వారందరికీ ఎలాంటి బోధన అనుభవం లేకపోయినా అవకాశం ఇవ్వాలన్నారు. ఇక తెలుగు మీడియంలో పరీక్ష నిర్వహించాలనే విజ్ఞప్తినీ సీఎం పరిగణన లోకి తీసుకున్నారు.
ఇందుకోసం ఎన్‌సీటీఈ మార్గదర్శకాలు, గతంలో న్యాయస్థానాల తీర్పులను పరిశీలించారు. అయితే ఏ మీడియం విద్యార్థులకు, ఏ మీడియంలో బోధించేందుకు నియామకాలు జరుగు తున్నాయో అదే భాషలో పరీక్ష నిర్వహిం చాలని గతంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది. దీంతో గురుకుల నియామకాలకు తెలుగు మీడియంలో పరీక్ష రాసే అవకాశం లేనందున.. అభ్యర్థులు ఇంగిష్ మీడియం లోనే పరీక్ష రాయాల్సి ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. వీటికి అనుగుణంగా తాజా మార్గదర్శకాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.