
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల రిజిస్ట్రేషన్‌ను మొబైల్ ద్వారా చేసుకునేలా సులభతర విధానాన్ని డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల కమిటీ, తెలంగాణ (దోస్త్) అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఆధార్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకునేలా ప్రత్యేకంగా మొబైల్ యాప్ రూపొందించాలని యోచిస్తోంది. అలాగే ఆన్‌లైన్‌లో లేదా చలానా రూపంలో విద్యార్థులు ఫీజులు చెల్లించే అవకాశం కల్పించాలని భావిస్తోంది.
మే 8న డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించిన ప్రవేశాల కమిటీ.. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రవేశాల కౌన్సెలింగ్ సందర్భంగా గతంలో తలెత్తిన లోపాలను ఈసారి రాకుండా చర్యలు తీసుకుంటోంది.
మొదటి దశ ప్రవేశాల్లో సీట్లు లభించిన విద్యార్థులు కాలేజీల్లో ఫీజులు చెల్లిస్తే రెండో దశ కౌన్సెలింగ్‌లో మరో కాలేజీలో సీటొచ్చినపుడు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కాలేజీల్లో కాకుండా దోస్త్ పేరిటే చలానా రూపంలో లేదా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించే ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. తద్వారా ఏ దశ కౌన్సెలింగ్‌లో సీటొచ్చినా విద్యార్థులకు ఇబ్బంది ఉండదని ఆలోచిస్తోంది. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనుంది.
పాలిటెక్నిక్ విద్యార్థులకు వెసులుబాటు
కాలేజీలకు జియో ట్యాగింగ్ విధానం అమలు చేయాలని దోస్త్ నిర్ణయించింది. తద్వారా కాలేజీ ఎక్కడుంది..? అందులో ఫీజు ఎంత? సదుపాయాలు ఏమున్నాయి? తదితర వివరాలు ఆన్‌లైన్‌లో పొందే వీలుంటుంది.
పాలిటెక్నిక్ చదివిన విద్యార్థి డిగ్రీలో చేరేటప్పుడు సబ్జెక్టులు అన్ని సరిపోలితే తన ఇష్ట ప్రకారం డిగ్రీ ప్రథమ సంవత్సరం లేదా ద్వితీయ సంవత్సరంలో చేరే వీలు కల్పించాలని దోస్త్ నిర్ణయించింది. ఇంటర్ ఫలితాలు విడుదల చేసినప్పుడు విద్యార్థి మెమో డౌన్‌లోడ్ చేసుకునేప్పుడే విద్యార్థికి డిగ్రీ ప్రవేశాల సమగ్ర వివరాలొచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. అన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో హెల్ప్‌లైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment