
ఇక డిగ్రీలో బయోమెట్రిక్!
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో విద్యార్థులు, అధ్యాపకులకు బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది.
విద్యార్థులు, అధ్యాపకులకు తప్పనిసరిగా అమలు
ఉన్నత విద్యా మండలి నిర్ణయం
75 శాతం హాజరుంటే నే పరీక్షలకు అనుమతి
సెమిస్టర్ విధానం అమలు.. ఒక్కో సెమిస్టర్‌కు 90 పనిదినాలు
నవంబర్‌లో మొదటి సెమిస్టర్, ఏప్రిల్‌లో రెండో సెమిస్టర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో విద్యార్థులు, అధ్యాపకులకు బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. లెక్చరర్లు ఇకపై నెలకోసారి తమ రోజు వారీ పనితీరు నివేదికలను (టీచింగ్ డైరీ) కళాశాల విద్యాశాఖకు అందజేయాలని స్పష్టం చేసింది. అకడమిక్ కేలండర్ ప్రకారం ఏ రోజు ఏ పాఠం చెప్పాలి, తామేం చెప్పారన్న అంశాలపై టీచింగ్ డైరీ రాసి యూనివర్సిటీకి, అక్కడి నుంచి కళాశాల విద్య కమిషనరేట్‌కు అందజేయాలని సూచించింది.
డిగ్రీ కాలేజీల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్న సంస్కరణలపై సోమవారం మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన వివిధ యూనివర్సిటీల రిజిస్ట్రార్లతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో అన్ని డిగ్రీ కాలేజీల్లో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్)ను అమలు చేయా లని నిర్ణయించారు. యూనివర్సిటీలు ఇందుకు అవసరమైన చర్య లు చేపట్టడంతోపాటు సెమిస్టర్ విధానం అమలుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.
డిగ్రీలో యూనివర్సిటీ యూనిట్‌గా ఆన్‌లైన్ ప్రవేశాల విధానాన్ని అమలు చేయాలి. ఇందుకోసం ప్రతి జిల్లాలో మూడు వరకు హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఇంటర్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. కామన్ అకడమిక్ కేలండర్ ప్రకారమే అన్ని యూనివర్సిటీల పరిధిలోని కాలేజీల్లో ప్రవేశాలు, విద్యా బోధన, పరీక్షలు జరగాలి. మే 1వ తేదీన డిగ్రీలో ప్రవే శాలకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. మే నెలాఖరుకల్లా ప్రవేశాలను పూర్తిచేసి... జూన్ రెండోవారంలో తరగతులు ప్రారంభిస్తారు.
డిగ్రీలో సెమిస్టర్ విధానం అమలు చేస్తారు. ఒక్కో సెమిస్టర్‌లో 90 రోజుల పనిదినాలు ఉంటాయి. ఏటా రెండు సెమిస్టర్లు ఉంటాయి. మొదటి సెమిస్టర్ పరీక్షలు నవంబర్‌లో, రెండో సెమిస్టర్ పరీక్షలు తర్వాతి ఏడాది ఏప్రిల్‌లో నిర్వహిస్తారు. ద్వితీయ, తృతీయ సంవత్సరాల్లోనూ సెమిస్టర్ విధానం ఉంటుంది.
► ప్రశ్నపత్రాలను మాత్రం యూనివర్సిటీల వారీగా తయారుచేసుకుని... కామన్ షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలి.
► విద్యార్థులకు ప్రతి సెమిస్టర్‌లో 75 శాతం హాజరు ఉండాల్సిందే. లేకపోతే పరీక్షలకు అనుమతించరు.
► విద్యార్థులు, లెక్చరర్లకు కాలేజీలు బయోమెట్రిక్ విధానం అమలు చేయాలి. ఈ హాజరు డాటాను యూనివర్సిటీకి, కళాశాల విద్యాశాఖకు, ఉన్నత విద్యా మండలి వెబ్‌సైట్‌కు ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలి.
► ప్రతి కాలేజీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
► బోగస్ విద్యార్థులు, రెండు మూడు చోట్ల ప్రవేశాలను నిరోధించేందుకు విద్యార్థుల ఆధార్ నంబర్ తీసుకోవాలి. భవిష్యత్తులో అవసరమైతే ఈ డాటాను ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన ఈ పాస్ వెబ్‌సైట్‌కు అనుసంధానం చేస్తారు.