సాక్షి, హైదరాబాద్: జాతీయ విద్యావిధానం–2020కి అనుగుణంగా డిగ్రీలో సరికొత్త మార్పులకు ఉన్నత విద్యామండలి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కసరత్తు మొదలు పెట్టింది. విద్యార్థులు కోరుకున్న సబ్జెక్టులతో డిగ్రీ పూర్తి చేసేందుకు అవకాశం కల్పించేలా వచ్చే విద్యాసంవత్సరం నుంచి ‘బకెట్’విధానాన్ని తీసుకొస్తున్నామని ఉన్నత విద్యామండలి ప్రకటించింది.
ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి నేతృత్వంలో గురువారం మండలి కార్యాలయంలో కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిత్తల్‌సహా ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాందీ, శాతవాహన, పాలమూరు, తెలంగాణ యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్లతో సమావేశం నిర్వహించింది. సమావేశ వివరాలను లింబాద్రి మీడియాకు వివరించారు.
నచ్చిన కోర్సు...
♦ ఇప్పటి వరకూ డిగ్రీ కోర్సులు మూస విధానంలో ఉండేవి. బీఏ హెచ్‌పీపీ తీసుకుంటే హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్లు మాత్రమే చదవాలి. అయితే కొత్త విధానంలో ఏ, బీ, సీ, డీ బకెట్లుగా సబ్జెక్టులను విడగొడతారు. వీటిల్లో వేటినైనా ఎంచుకోవచ్చు. ఉదాహరణకు... ఎ గ్రూపులో అరబిక్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ పాలసీ, లిటరేచర్ ఇలా కొన్ని సబ్జెక్టులుంటాయి. బి గ్రూప్‌లో ఎకనామిక్స్, హిందీ, ఇంగ్లిష్, తెలుగు, సాహిత్యం, ట్రావెల్ టూరిజం వంటి కొన్ని కోర్సులుంటాయి. ఇలా సి, డీ గ్రూపుల్లోనూ కొన్ని కోర్సులుంటాయి. విద్యార్థులు ఏవేని మూడు బకెట్స్ నుంచి ఒక్కో సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చు.
♦ డిగ్రీలో క్రెడిట్ సిస్టమ్ అమలు చేయడం వల్ల ప్రతీ దాన్ని క్రెడిట్ విధానంలో కొలుస్తారు. బకెట్ విధానం వల్ల బీఏ విద్యార్థి కూడా కంప్యూటర్ సైన్స్ కోర్సు, సాహిత్యం, మరే ఇతర కోర్సు అయినా చేయవచ్చు.
♦ ఈ విధానం క్షేత్రస్థాయిలో అన్ని కాలేజీల్లో ఎలా అమలు చేయాలనే దానిపై మండలి ఓ కమిటీని నియమించి, దాని సూచనల మేరకు మార్పులు చేస్తుంది. విభిన్న సబ్జెక్టులతో డిగ్రీ చేసిన విద్యార్థికి మార్కెట్ అవసరాలకు తగిన నైపుణ్యం వచ్చే వీలుంది.
మరికొన్ని మార్పులు
♦ విద్యార్థి కాలేజీలోనే కాకుండా ఆన్‌లైన్ ద్వారా కూడా దేశ, విదేశాల్లో ఎక్కడైనా ఒక కోర్సు చేసే వీలుంది. దానికి సంబంధిత సంస్థలే పరీక్షలు నిర్వహిస్తాయి. క్రెడిట్స్‌ను ఆయా సంస్థలకు బదలాయిస్తాయి.
♦ డిగ్రీ స్థాయిలో సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తోపాటు మరికొన్ని కంప్యూటర్ అనుబంధ కోర్సులను సబ్జెక్టులుగా తీసుకురానున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ కోర్సుల బోధనకు అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.
♦ రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ కాలేజీ మొదలయ్యే నాటికే పూర్తి చేయాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది జూలై నుంచే డిగ్రీ క్లాసులు మొదలవ్వాలని తీర్మానించారు.
♦ కోవిడ్ మూలంగా చాలామంది విద్యార్థుల్లో అభ్యసన నష్టాలు కన్పిస్తున్నాయి. వీటిని పూడ్చడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. దీనికి పక్కా ప్రణాళికను త్వరలో ఖరారు చేయబోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment