–36 వేల మంది పరీక్షలకు దరఖాస్తు
–తొలిసారిగా ఆన్‌లైన్ ప్రశ్నాపత్రాలకు వాటర్‌మార్క్ విధానం అమలు
ఎస్కేయూ : వర్సిటీ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. డిగ్రీ మొదటి, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు నిర్వహరణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 36 వేల మంది విద్యార్థులు సెమిస్టర్ పరీక్షలకు దరఖాస్తు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న డిగ్రీ పరీక్షల్లో (సంవత్సరానికి ఒక్క సారి జరిపే) అనుబంధ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు అక్రమాలకు పాల్పడి ప్రశ్నాపత్రాలను సామాజిక మాధ్యమాల ద్వారా పంపుతున్న నేపథ్యంలో వివాదస్పదమైంది. దీంతో సెమిస్టర్ పరీక్షలు పకడ్భందీగా జరిపేందుకు ఎస్కేయూ పరీక్షల విభాగం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
పటిష్టంగా అమలు చేయగలిగితే :
తొలిసారిగా ప్రశ్నాపత్రాన్ని ఆన్‌లైన్ విధానం ద్వారా పంపే పద్ధతికి శ్రీకారం చుట్టారు. గతంలో నేరుగా ప్రశ్నాపత్రాన్ని పరీక్ష కేంద్రాలకు చేరవేసే విధానంలో వర్సిటీ అబ్జర్వర్ సమక్షంలో ప్రశ్నాపత్రాలు తీసేవారు. కానీ తాజాగా ఎన్‌క్రిప్టెడ్ పాస్‌వర్డ్‌ను వర్సిటీ పరీక్షల విభాగం ఉన్నతాధికారులు నేరుగా ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ అధికార మెయిల్‌కు, సెల్‌ఫోన్ నెంబర్‌కు మెసేజ్ పంపుతారు. ఈ పాస్‌వర్డ్ ద్వారా గంట ముందు ప్రశ్నాపత్రాలను డౌన్‌లోడ్ చేసుకొని విద్యార్థులకు అందివ్వాల్సి ఉంటుంది.
జంబ్లింగ్ విధానం అయినప్పటికీ , విద్యార్థులను పరీక్షలకు అరగంట ముందు వరకు కళాశాల వద్ద ఉంచుకొని ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు అన్నీ విద్యార్థులకు తెలియపరిచి .. కేవలం 15 నిమిషాల ముందు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి పంపుతున్నారు. ప్రధానంగా అనంతపురం నగరంలో డిగ్రీ కళాశాలలు దగ్గరగా ఉండడంతో ఈ విధానం సులువుగా అమలుచేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రశ్నాపత్రం వచ్చిన వెంటనే విద్యార్థులకు ప్రశ్నలు తెలియపరచడం, జంబ్లింగ్ పడ్డ కేంద్రానికి విద్యార్థులను నేరుగా కళాశాల బస్సుల్లోనే తరలిస్తూ.. విద్యార్థులకు పూర్తిగా సహకారాలు అందిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
వ్యాట్సాప్ ద్వారా ప్రశ్నాపత్రాలు చేరవేయడంతో గత వారం బీకాం ఫైనలియర్ ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ ప్రశ్నాపత్రానికి వాటర్‌మార్క్ విధానంను సెమిస్టర్ పరీక్షలకు అమలు చేస్తున్నారు. దీంతో వాట్సాప్, తదితర సామాజిక మాధ్యమాల్లో ఏ కళాశాల నుంచి ప్రశ్నాపత్రం బయటకు వెళ్లిందో ..పసిగట్టే అవకాశం ఉంది . ఎన్‌క్రిప్టెడ్ పాస్‌వర్డ్ కళాశాలలకు ఇవ్వకముందే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరే విధంగా పరీక్షల విభాగం అధికారులు ఆదేశాలు జారీ చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.
15 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
Published Sun, Apr 9 2017 11:01 PM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM
Advertisement
Advertisement