semister exams
-
తెలంగాణ విద్య, ఉద్యోగ సమాచారం
ఓయూ దూరవిద్య డిగ్రీ పరీక్షలు 18 నుంచి ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ దూరవిద్య బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సుల పరీక్షలు ఈ నెల 18 నుంచి వచ్చే నెల 17 వరకు జరగనున్నట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల టైంటేబుల్ వివరాలను ఉస్మానియా వెబ్సైట్లో చూడవచ్చన్నారు. గూప్స్పై రేపు 21వ సెంచరీ అవగాహన సదస్సు సాక్షి, హైదరాబాద్: గ్రూప్స్‌కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఆదివారం ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణప్రదీప్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8న ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని తమ అకాడమీలో ఈ కార్యక్రమం ఉంటుందని, సిలబస్, ప్రిపరేషన్, వ్యూహాలు, నోట్స్ తయారీ, సమయపాలన వంటి అంశాలపై నిష్ణాతులైన అధ్యాపకులు అవగాహన కల్పిస్తారని వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు 9133237733 లో సంప్రదించవచ్చని సూచించారు. పీజీ సెమిస్టర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో ఈ నెల 10నుంచి ప్రారంభంకానున్న వివిధ రెగ్యులర్ పీజీ కోర్సుల సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు అడిషనల్ కంట్రోలర్ ప్రొ.అంజయ్య శుక్రవారం పేర్కొన్నారు. ఎం.ఎ, ఎం.కాం, ఎమ్మెస్సీ, ఇతర పీజీ కోర్సులు చదివే ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు నేటి నుంచి ఆయా కాలేజీల్లో హాల్ టిక్కెట్లను పొందవచ్చన్నారు. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్సైట్లో చూడవచ్చని తెలిపారు. జూలై 23న డీసెట్ సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశానికి జూలై 23న ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు డీసెట్ కన్వీనర్ శ్రీనివాసాచారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ ద్వారా ఈ నెల 9 నుంచి జూన్ 30 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు డీసెట్ వెబ్‌సైట్‌కు లాగిన్ కావాలని సూచించారు. ‘మనూ’లో యూజీ కోర్సుల దరఖాస్తు 22 వరకు గచ్చిబౌలి: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ (మనూ)లో అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) కోర్సులకు దరఖాస్తు చేసుకునే గడువు తేదీని పెంచారు. శుక్రవారంతో ముగియనున్న గడువు తేదీని మే 22 వరకు పెంచారు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) ద్వారా అన్ని సెంట్రల్ యూనివర్సిటీలకు కలిపి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రకారం ఆన్లైన్ ద్వారానే దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు దారులు సీయూఈటీ వెబ్‌సైట్‌ను పరిశీలించి దరఖాస్తులు పంపించాలి. దరఖాస్తులు ఉర్దూ యూనివర్సిటీ వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంటాయి. కాగా, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో ఆన్లైన్ అడ్మిషన్స్ రెగ్యులర్ మోడ్ కింద ఎంట్రన్స్ ఆధారంగా సీట్లు కేటాయించే కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 1 చివరి తేదీగా ప్రకటించారు. అలాగే మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించే వాటికి దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 30 చివరి తేదీగా పేర్కొన్నారు. దరఖాస్తులు యూనివర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయన్నారు. సింగరేణిలో గిరిజన బ్యాక్లాగ్ పోస్టుల ఫలితాలు సాక్షి, హైదరాబాద్: సింగరేణిలో 665 గిరిజన బ్యాక్లాగ్ పోస్టుల పరీక్షాఫలితాలను యాజమాన్యం విడుదల చేసింది. 2017 జూలైలో నోటిఫికేషన్ జారీ చేసిన ఈ పోస్టులకు 60 వేల మందికి పైగా దర ఖాస్తు చేసుకున్నారు. 2018 జూన్ 10న నిర్వహించిన పరీక్షలో 27,279 మంది అభ్యర్థులు హాజర య్యారు. అన్ని విధాలుగా అర్హులైన 665 మందికి నెలరోజుల్లోగా నియామక ఉత్తర్వులు అందజేస్తామని సింగరేణి డైరెక్టర్ ఎన్.బలరామ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని యాజమాన్యం భావించినప్పటికీ కోర్టు కేసుల కారణంగా జాప్యం జరిగిందన్నారు. గిరిజనులకు ఉద్యోగాలు కల్పించాలన్న సంకల్పంతో కేసుల పరిష్కారానికి యాజమాన్యం కృషి చేయడం హర్షణీయమని పలువురు పేర్కొన్నారు. మే 7న బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీ సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల వెబ్ కౌన్సెలింగ్‌కు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దంత కళాశాలల్లో బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు ఇప్పటికే మూడు విడతల కౌన్సెలింగ్ పూర్తయిందని తెలిపింది. కన్వీనర్ కోటాలో ఇంకా మిగిలిపోయిన ఖాళీలను ఈ అడిషనల్ మాప్ అప్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నామని వెల్లడించింది. అర్హులైన అభ్యర్థులు ఈనెల 7వ తేదీ ఉదయం 8 గంటల నుంచి అదే రోజు రాత్రి 8 గంటల వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చునని సూచించింది. గత విడత కౌన్సెలింగ్‌లో సీట్ పొంది చేరకపోయినా, చేరి మధ్యలో మానేసినా, అల్ ఇండియా కోటాలో ఇప్పటికే సీటు పొందిన అభ్యర్థులూ ఈ కౌన్సెలింగ్‌కు అనర్హులని స్పష్టం చేసింది. -
Mizoram: పరీక్షలు రాయాలి.. సిగ్నల్స్ రావడం లేదు
ఐజ్వాల్: కరోనా మహమ్మారితో స్కూళ్లు, కాలేజీలు మూతపడడంతో విద్యార్థులంతా ఆన్లైన్ క్లాసులకే పరిమితమయ్యారు. క్లాసులతో పాటు పరీక్షలు కూడా ఆన్లైన్లో రాయాల్సి వస్తుంది. మహానగరాలు, పట్టణాల్లో అయితే ఇంటర్నెట్ సేవలు బాగుంటాయి.. కాబట్టి ఆన్లైన్లో పరీక్షలు రాయడం కాస్త తేలికే.. అదే మారుమూల గ్రామాల్లో కనీసం సిగ్నల్స్ కూడా అందవు. ఇక గిరిజన ప్రాంతాల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సిగ్నల్స్ కోసం కొండలు, గుట్టలు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. తాజాగా మిజోరంలో కొందరు విద్యార్థులకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. రాజధాని ఐజ్వాల్‌కు 400 కిమీ దూరంలో సైహా జిల్లాలో మావ్రేయి అనే కూగ్రామం ఉంది. ఆ గ్రామం నుంచి ఏడుగురు విద్యార్థులు తమ సెమిస్టర్ పరీక్షలు రాయాల్సి ఉంది. గ్రామంలో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం.. ఫోన్లో సిగ్నల్స్ కూడా అంతంత మాత్రానే ఉంటుంది. అయితే కాలేజీ యాజమాన్యం పరీక్షలు రాయకపోతే ఫెయిల్ చేస్తారేమోనని ఆ విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఎలాగైనా పరీక్షలు రాయాలని ఊరికి దగ్గర్లోని త్లావ్ త్లా కొండపై ఫోన్ సిగ్నల్ వస్తుండడంతో ఆ విద్యార్థులంతా ఎలాగోలా కష్టపడి అక్కడికి చేరుకున్నారు. ఆ కొండపైనే ఒక గుడిసెను ఏర్పాటు చేసుకున్న విద్యార్థుల సమూహం తమ సెమిస్టర్ పరీక్షలను పూర్తి చేస్తున్నారు. '' మా గ్రామం పూర్తిగా కొండల నడుమ ఉంది. గ్రామంలో ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగా రావు.. ఇంక ఇంటర్నెట్ సంగతి వేరే చెప్పనవసరం లేదు. అందుకే కొండపైకి చేరుకొని సెమిస్టర్ పరీక్షలు పూర్తి చేస్తున్నాం'' అంటూ ఒక విద్యార్థి పేర్కొన్నాడు. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: వామ్మో.. ఆ రాష్ట్రంలో లక్ష దాటిన కరోనా మరణాలు -
డిగ్రీ, పీజీ పరీక్షలపై ప్రభుత్వానికే స్పష్టత లేదు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ ముగిసింది. చివరి సెమిస్టర్ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించాలని ఎన్ఎస్యూఐ, ఇతర పిటిషనర్లు కోరారు. అయితే ఆన్లైన్లో చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడం వీలు కాదన్న ప్రభుత్వం.. గ్రామీణ ప్రాంతాల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్ సమస్య తలెత్తుతుందని కోర్టుకు తెలిపింది. పరీక్షలు రాయలేని విద్యార్థులు సప్లిమెంటరీ రాయవచ్చు. సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైనప్పటికీ రెగ్యులర్‌గా పరిగణిస్తాం. అటానమస్ కాలేజీలకు మాత్రం ఆన్లైన్లో నిర్వహించేందుకు స్వేచ్ఛ ఇచ్చామన్న ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తెచ్చింది. క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజీలో మాత్రమే ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తామన్న ఓయూ కోర్టుకు వివరించింది. మిడ్‌టర్మ్ పరీక్షలు ఆన్లైన్లో.. సెమిస్టర్ ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తామని జేఎన్టీయూహెచ్ పేర్కొంది. ప్రభుత్వ విధానం గందరగోళంగా కనిపిస్తోందని.. ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ ఏదో ఒకే విధానం ఉండాలని హైకోర్టు అభిప్రాయ పడింది. ఈ మేరకు హైకోర్టు స్పష్టత ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను రేపటికి వాయిదా వేసింది. (చిన్నజీయర్ స్వామిని పరామర్శించిన సీఎం కేసీఆర్) -
16 నుంచి ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ ఫైనల్ ఇయర్ విద్యార్థుల సెమిస్టర్ పరీక్షల (రెగ్యులర్/సప్లిమెంటరీ) తేదీలు ఖరారయ్యాయి. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన రెండో సెమిస్టర్ పరీక్షలను తాజాగా ఈ నెల 16 నుంచి 25 వరకు నిర్వహించాలని జేఎన్టీయూహెచ్ నిర్ణయిం చింది. ఇందుకు సంబంధించి రోజువారీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. షెడ్యూల్‌ను వెబ్సైట్లో అందుబాటులో పెట్టింది. బీటెక్, బీ ఫార్మసీలో ఆర్09, ఆర్13, ఆర్15, ఆర్16 సబ్జెక్టుల విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. సెమిస్టర్ పరీక్షలను రోజుకు రెండు చొప్పున నిర్వహించనున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఒక పరీక్ష, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు రెండో పరీక్ష నిర్వహిస్తారు. -
ఆన్లైన్లోనే సెమిస్టర్లు
న్యూఢిల్లీ: కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులకు ఇకపై పూర్తిగా ఆన్లైన్ ద్వారానే సెమిస్టర్లను నిర్వహించాలని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)– బాంబే నిర్ణయించింది. విద్యాసంవత్సరం ఆలస్యం కాకుండా ఆన్లైన్ ద్వారానే తరగతులు ప్రారంభించేందుకు యత్నిస్తున్నట్లు వెల్లడించింది. దేశంలోని మిగతా ఐఐటీలు ఇదే విధానాన్ని అనుసరించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఐఐటీ–బాంబే డైరెక్టర్ సుభాశీశ్ ఛౌధురి గురువారం ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ‘సంస్థ సెనేట్‌లో చర్చించాక.. వచ్చే సెమిస్టర్‌ను ఆన్లైన్లోనే చేపట్టాలని నిర్ణయించాం. విద్యార్థుల ఆరోగ్యం, రక్షణ విషయంలో రాజీ పడబోం’అని తెలిపారు. తమ విద్యాసంస్థలో ఆర్థికంగా బలహీన వర్గాల కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నందున ఆన్లైన్లో చదువుకునేందుకు అవసరమైనవి సమకూర్చుకునేందుకు వారికి దాతలు ముందుకువచ్చి, సాయం చేయాలని ఛౌధురి కోరారు. విద్యాసంవత్సరం క్యాలెండర్‌ను సమీక్షిం చేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ సంప్రదింపులు జరుపుతున్న సమయంలో ఐఐటీ–బోంబే ఈ నిర్ణయం తీసుకుంది. జూలై నుంచి డిసెంబర్ వరకు సాగే సెమిస్టర్‌కు మిగతా ఐఐటీలు అనుసరించే చాన్సుంది. ఈ విషయమై ఐఐటీ–ఢిల్లీకి చెందిన ఒక అధికారి స్పందించారు. ‘విద్యాసంవత్సరాన్ని ఆలస్యం చేయడం తెలివైన పనికాదు. ఎంతకాలం క్యాంపస్‌లో విద్యార్థులు సురక్షితంగా ఉండగలరనేది మనకు తెలియదు. అందుకే, కంప్యూటర్, ఇంటర్నెట్ సౌకర్యం లేని విద్యార్థులు వాటిని సమకూర్చుకునేందుకు సాయపడుతూ విద్యా సంవత్సరాన్ని మొదలు పెట్టడమే మంచిది’ అని అభిప్రాయపడ్డారు. -
కామన్ పేపర్.. ఎక్కువ చాయిస్‌లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులకు కామన్ పేపర్‌తో ఎక్కువ చాయిస్ ఉండేలా ప్రశ్నలతో పరీక్ష ప్రశ్న పత్రాలు రూపొందించే అంశాల పై ఉన్నత విద్యా మండలి కసరత్తు ప్రారంభించింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇటీవల పరీక్షలు, విద్యా కార్యక్రమాలపై జారీ చేసిన మార్గదర్శకాల అమలుకు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి పలు యూనివర్సిటీల రిజిస్ట్రార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యూజీసీ మార్గదర్శకాల జారీ కంటే ముందుగానే డిటెన్షన్ విధానాన్ని ఎత్తివేసి, మార్కులతో సంబంధం లేకుండా ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులందరినీ ప్రమోట్ చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో లాక్డౌన్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఇందుకు యూనివర్సిటీలు కూడా సిద్ధం కావాలని పేర్కొంది. యూనివర్సిటీ స్థాయిలోనూ పరీక్షల విభాగం నియంత్రణాధికారులు, యూనివర్సిటీ కాలేజీల ప్రిన్సిపాళ్లు, హెచ్‌వోడీలతో చర్చించి నివేదికలు సిద్ధం చేసుకోవాలని పాపిరెడ్డి ఆదేశించారు. నాలుగు రోజుల్లో మరోసారి సమావేశం కావాలని, అందులో తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఆ సమావేశంలో తాము తీసుకునే నిర్ణయాలపై ప్రభుత్వ ఆమోదానికి ఫైలు పంపించాలని నిర్ణయించారు. చదవండి: వేరే ప్రాంతాలకు వెళ్లేవారికి ఈ–పాస్‌లు త్వరలోనే నిర్ణయం.. వీలైతే జూన్ 20 నుంచి లేకపోతే జూలై 1 నుంచి ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని తాజా సమావేశంలో నిర్ణయించారు. మిగతా సెమిస్టర్ల వారికి జూలై 15 నుంచి నిర్వహించాలన్న అభిప్రాయానికి వచ్చారు. అయితే వారికి పరీక్షలు నిర్వహించాలా.. యూజీసీ చెప్పినట్లు కిందటి సెమిస్టర్ మార్కుల ఆధారంగా మార్కులు ఇవ్వాలా.. అన్న దానిపై త్వరలో నిర్వహించే సమావేశంలో నిర్ణ యం తీసుకోనున్నారు. పరీక్ష సమయాన్ని 3 గంటలు నుంచి 2 గంటలకు కుది ంచాలనే యోచనలో ఉంది. కామన్ పేపరు విధానం అవలంబించాలని, ఎక్కువ ఆప్షన్లు ఉండేలా ప్రశ్నల సరళి ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. మొత్తంగా 10 నుంచి 14 వరకు ప్రశ్నలు ఇచ్చి అందులో సగం (5 నుంచి 7 ప్రశ్నలకు) ప్రశ్నలకు జవాబు రాయాలనే విధానం అమలుపై యోచిస్తున్నారు. వీలైతే ఆబ్జెక్టివ్‌లోనూ పరీక్షలు నిర్వహించుకోవచ్చని యూజీసీ చెప్పినా, రాష్ట్రంలో విద్యార్థులకు డిస్క్రిప్టివ్ విధానం అలవాటు ఉండటంతో ఇబ్బంది పడతారనే ఆలోచనతో దాని అమలు అవసరం లేదన్న భావనకు వచ్చారు. చదవండి: వడివడిగా ‘కొండపోచమ్మ’ చెంతకు -
పరీక్ష రాసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
సాక్షి, హన్మకొండ: ప్రజాప్రతినిధిగా గెలుపొంది.. శాసనసభలో అడుగుపెట్టినా.. ఆయన చదువును మాత్రం ఆపలేదు. దూరవిద్యలో న్యాయశాస్త్రాన్ని అభ్యసిస్తూ.. క్రమం తప్పకుండా సెమిస్టర్ పరీక్షలకు హాజరవుతున్నారు. తాజాగా తోటి విద్యార్థులతో కలిసి ఆయన హన్మకొండ సుబేదారిలోని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లాలో పరీక్షలు రాశారు. ఆయనే ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి. హన్మకొండలోని ఆదర్శ్ లా కాలేజీలో జీవన్‌రెడ్డి ఎల్ఎల్ఎం అభ్యసిస్తున్నారు. ఎల్ఎల్ఎం విద్యలో భాగంగా ఆయన ప్రస్తుతం మూడో సెమిస్టర్ పరీక్షలకు హాజరవుతున్నారు. సోమవారం పరీక్ష రాసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఏడాది రెండు సెమిస్టర్ పరీక్షలు రాసి పాసయ్యానని, ఈ రోజు మూడో సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యానని తెలిపారు. పరీక్షలకు హాజరుకావడం చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసిందని, పదో తరగతి, ఇంటర్ పరీక్షలు గుర్తుకువచ్చాయని అన్నారు. -
‘అకాడమిక్’ అయోమయం..!
సాక్షి, శాతవాహనయూనివర్సిటీ: ఓ సెమిస్టర్ చివరి దశకు వస్తున్నా.. నేటికీ పలు కోర్సులకు సంబంధించిన సబ్జెక్టుల సిలబస్ పూర్తి కాలేదంటే నమ్మాల్సిందే..!! నెల రోజుల్లో ప్రస్తుత సెమిస్టర్ కావాల్సి ఉంది. కానీ.. పలు కళాశాలల్లో ఆ పరిస్థితి లేదు. దీంతో అంతా అయోమయం నెలకొంది. అకాడమిక్ అల్మానాక్ అమలులో శాతవాహన యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యంతో అటు విద్యార్థులు, ఇటు అధ్యాపకులకు తలనొప్పిగా మారింది. జూన్‌లో సెమిస్టర్ ప్రారంభమైనా సెప్టెంబర్ నెల వరకు సిలబస్ పూర్తిస్థాయిలో నిర్ణయించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సెమిస్టర్ ప్రారంభానికి ముందే ప్రకటించాల్సి ఉన్నా.. వర్సిటీ తీరులో మార్పు రావడం లేదు. అకాడమిక్ అల్మానాక్ ప్రకారం షెడ్యూల్ జరగాల్సి ఉంది. దాని అమలుపై వర్సిటీ పట్టింపు లేకుండా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆరంభంలో ఊహాజనితంగా పలానా అంశాలు సిలబస్‌లో ఉంటాయని భావించి బోధన చేపట్టారు. తీరా చూస్తే సిలబస్ పరిశీలించాక బోధించిన అంశాలు కాకుం డా ఇంతరత్రా ఉండడంతో ఖంగుతిన్నారు. తిరిగి కొత్తగా పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని.. అకాడమిక్ అల్మానాక్ అమలుపై దృష్టి సారించి దాని ప్రకారం తరగతులు, పరీక్షలు నిర్వహించాలని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. సిలబస్ నిర్ణయించడంపై నిర్లక్ష్యం.. శాతవాహన యూనివర్సిటీ సిలబస్ విషయంలో కొన్నేళ్లుగా నిర్లక్ష్య వైఖరే కనిపిస్తోంది. గతంలో రెండో సెమిస్టర్‌లోని జెండర్ సెన్సిటైజేషన్ అనే కామన్ సబ్జెక్టు పేపర్ సిలబస్ కూడా సెమిస్టర్ ముగిసే 20 రోజుల ముందే ఇచ్చారు. దీంతో విద్యార్థులకు ఆయా అంశాలు 20 రోజుల్లో బోధించడానికి నానా అవస్థలు పడ్డారు. చివరకు ఫలితాలపై ప్రభావం పడింది. వివిధ సబ్జెక్టుల విషయంలోనూ ప్రారంభంలో ఇవ్వకుండా జాప్యం చేయడంతో కష్టాలు తప్పడంలేదు. ఇప్పుడు కూడా సెమిస్టర్ ప్రారంభమైన నెల రోజులు దాకా కూడా స్పష్టమైన సిలబస్ అంశాలు ప్రకటించలేదు. ఒకటి రెండు సబ్జెక్టులకు సంబందించిన సబ్జెక్టుల విషయంలో వర్సిటీ అధికారులు సిలబస్ ప్రకటించినా కళాశాలల్లో నేటికీ స్పష్టత లేదు. సెమిస్టర్ పూర్తి కావస్తున్నా ఇంకా అధ్యాపకులు వాటిని ఎప్పుడు బోధిస్తారు.. విద్యార్థులు వాటిని ఎప్పుడు చదువుతారు.. అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల్లో గందరగోళం.. యూనివర్సిటీ అధికారులు కొన్ని సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్ ప్రకటించిన తీరుపై అధ్యాపకుల్లో, విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. డిగ్రీ 5వ సెమిస్టర్ వారికి ‘పబ్లిక్ హెల్త్ అండ్ హైజీన్’ అనేది బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ అన్ని కోర్సుల వారికి సిలబస్ ప్రకటించారు. ‘వెర్బల్ రీజనింగ్ ఫర్ అప్టిట్యూడ్’ అనే సెలబస్ బీఏ, బీకాం, బీఎస్సీ వారికి అందరికీ ఉండాలని సెప్టెంబర్‌లో ఇచ్చారు. దీంతో బీఎస్సీ వారితోపాటు బీకాం, బీఏ విద్యార్థులకు దీనికి సంబంధించిన సిలబస్ బోధించడం ప్రారంభించారు. దాదాపు 15 రోజుల తర్వాత బీకాం విద్యార్థులకు మళ్లీ కొత్తగా ‘ప్రాక్టీస్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్’ అనే సబ్జెక్టును ప్రవేశపెట్టడంతో అధ్యాపకులు తలలు పట్టుకున్నారు. ఇదే కాకుండా బీకాం వారికి మార్చినప్పుడు బీఏ, బీఎస్సీ లైఫ్ సైన్స్ వాళ్లకూ ఇది చదవడం కఠినంగానే ఉంటుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ విధంగా ఏటా సిలబస్‌లో అస్పష్టత, సరైన సమయంలో నిర్ణయించకపోవడంతోపాటు పలు కారణాలతో అకాడమిక్ అల్మానాక్ అమలుపై నీలినీడలు అలుముకుంటున్నాయి. పరీక్షల తేదీని పొడగిస్తాం.. డిగ్రీ కోర్సుల్లో సిలబస్‌ను నిర్ణయించడంలో కొంత ఆలస్యమైంది. నేను ఇటీవలే శాతవాహన రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించాను. ప్రస్తుతం నవంబర్‌లో పరీక్షలు ఉండాల్సింది. కానీ.. ఎన్నికల దృష్ట్యా వాటిని ఇంకా పొడగించే అవకాశం ఉంది. పరీక్షల సమయం పొడగించడంతో సిలబస్ పూర్తి చేసుకోవడానికి సమయం కూడా ఉంటుంది. వచ్చే సెమిస్టర్ నుండి సిలబస్, అకాడమిక్ అల్మానాక్ అమలు విషయంలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.– యూ.ఉమేష్‌కుమార్, శాతవాహనయూనివర్సిటీ రిజిస్ట్రార్ -
నిలిచిపోయిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు నిలిచిపోయాయి. ప్రైవేటు డిగ్రీ కాలేజీలు తమ సెంటర్లలో పరీక్షలను బాయ్‌కాట్ చేయడంతో పరీక్షలు నిలిచిపోయాయి. సీబీసీఎస్ సెమిస్టర్స్ విధానంతో డిగ్రీ, పీజీ యాజమాన్యాలపై 30 శాతం అదనపు భారం పడుతుందని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ వెల్లడించింది. డిగ్రీ, పీజీ ఫీజులు పెరగకపోవడంతో సకాలంలో తమకు రీయింబర్స్మెంట్ అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు పెరిగే వరకు ఆన్లైన్ అడ్మిషన్లలో పాల్గొనబోం అని ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ స్పష్టం చేసింది. -
నేటి నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కోర్సుల్లో రెండు, నాలుగు సెమిస్టర్లకు సంబంధించిన పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమవుతున్నట్లు ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ రెడ్డివెంకటరాజు తెలిపారు. తొలిసారిగా ఆన్లైన్ ప్రశ్నాపత్రానికి వాటర్‌మార్క్ విధానం అమలు చేస్తున్నామన్నారు. నిర్ధేశించిన సమయం కంటే గంట ముందు పరీక్ష కేంద్రం వద్దకు రావాలన్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షలకు అనుమతిచ్చేదిలేదన్నారు. ఏప్రిల్ 28న పాలిసెట్ పరీక్ష ఉన్నందున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. మిగతా పరీక్షలు యథాతథంగా జరుగుతాయని వివరించారు. -
15 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
–36 వేల మంది పరీక్షలకు దరఖాస్తు –తొలిసారిగా ఆన్లైన్ ప్రశ్నాపత్రాలకు వాటర్‌మార్క్ విధానం అమలు ఎస్కేయూ : వర్సిటీ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. డిగ్రీ మొదటి, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు నిర్వహరణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 36 వేల మంది విద్యార్థులు సెమిస్టర్ పరీక్షలకు దరఖాస్తు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న డిగ్రీ పరీక్షల్లో (సంవత్సరానికి ఒక్క సారి జరిపే) అనుబంధ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు అక్రమాలకు పాల్పడి ప్రశ్నాపత్రాలను సామాజిక మాధ్యమాల ద్వారా పంపుతున్న నేపథ్యంలో వివాదస్పదమైంది. దీంతో సెమిస్టర్ పరీక్షలు పకడ్భందీగా జరిపేందుకు ఎస్కేయూ పరీక్షల విభాగం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పటిష్టంగా అమలు చేయగలిగితే : తొలిసారిగా ప్రశ్నాపత్రాన్ని ఆన్లైన్ విధానం ద్వారా పంపే పద్ధతికి శ్రీకారం చుట్టారు. గతంలో నేరుగా ప్రశ్నాపత్రాన్ని పరీక్ష కేంద్రాలకు చేరవేసే విధానంలో వర్సిటీ అబ్జర్వర్ సమక్షంలో ప్రశ్నాపత్రాలు తీసేవారు. కానీ తాజాగా ఎన్క్రిప్టెడ్ పాస్‌వర్డ్‌ను వర్సిటీ పరీక్షల విభాగం ఉన్నతాధికారులు నేరుగా ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ అధికార మెయిల్‌కు, సెల్‌ఫోన్ నెంబర్‌కు మెసేజ్ పంపుతారు. ఈ పాస్వర్డ్ ద్వారా గంట ముందు ప్రశ్నాపత్రాలను డౌన్లోడ్ చేసుకొని విద్యార్థులకు అందివ్వాల్సి ఉంటుంది. జంబ్లింగ్ విధానం అయినప్పటికీ , విద్యార్థులను పరీక్షలకు అరగంట ముందు వరకు కళాశాల వద్ద ఉంచుకొని ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు అన్నీ విద్యార్థులకు తెలియపరిచి .. కేవలం 15 నిమిషాల ముందు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి పంపుతున్నారు. ప్రధానంగా అనంతపురం నగరంలో డిగ్రీ కళాశాలలు దగ్గరగా ఉండడంతో ఈ విధానం సులువుగా అమలుచేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రశ్నాపత్రం వచ్చిన వెంటనే విద్యార్థులకు ప్రశ్నలు తెలియపరచడం, జంబ్లింగ్ పడ్డ కేంద్రానికి విద్యార్థులను నేరుగా కళాశాల బస్సుల్లోనే తరలిస్తూ.. విద్యార్థులకు పూర్తిగా సహకారాలు అందిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వ్యాట్సాప్ ద్వారా ప్రశ్నాపత్రాలు చేరవేయడంతో గత వారం బీకాం ఫైనలియర్ ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆన్లైన్ ప్రశ్నాపత్రానికి వాటర్‌మార్క్ విధానంను సెమిస్టర్ పరీక్షలకు అమలు చేస్తున్నారు. దీంతో వాట్సాప్, తదితర సామాజిక మాధ్యమాల్లో ఏ కళాశాల నుంచి ప్రశ్నాపత్రం బయటకు వెళ్లిందో ..పసిగట్టే అవకాశం ఉంది . ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ కళాశాలలకు ఇవ్వకముందే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరే విధంగా పరీక్షల విభాగం అధికారులు ఆదేశాలు జారీ చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. -
పీజీ సెమిస్టర్ ఫలితాలు విడుదల
ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో ఏప్రిల్‌లో జరిగిన పీజీ రెండు, నాలుగు సెమిస్టర్ ఫలితాలను ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య శుక్రవారం విడుదల చేశారు. రెండో సెమిస్టర్లో 13 పీజీ కోర్సులకు సంబంధించి 84.43 శాతం ఫలితాలు నమోదయ్యాయి. 546 మంది పరీక్ష రాయగా, 461 మంది ఉత్తీర్ణత సాధించారు. నాలుగో సెమిస్టర్లో 18 కోర్సులకు సంబంధించి 91.75 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 618 మందికి 567 మంది ఉత్తీర్ణత సాధించారు. ఎల్ఎల్బీ, ఎంసీఏ, జీయోటెక్‌కు సంబంధించి నాలుగో సెమిస్టర్లో 92.59 శాతం ఫలితాలు నమోదయ్యాయి. 108కి 100 మంది ఉత్తీర్ణత సాధించారు. ఎంసీఏ, ఎంబీఏ, ఎల్ఎల్ఎంలకు సంబంధించి రెండో సెమిస్టర్లో 98.78 శాతం ఉత్తీర్ణత సాధించారు. 206 మందికి 187 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావు, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పెద్దకోట చిరంజీవులు, ఎగ్జామినేషన్స్ డీన్ ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు, చీఫ్ వార్డెన్ ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్యలు పాల్గొన్నారు. -
ప్రశ్నర్థకంగా జేఎన్టీయూహెచ్ సెమిస్టర్ ఎగ్జామ్స్!
హైదరాబాద్ : హైదరాబాదు జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (జేఎన్టీయూహెచ్) అనుబంధ కళాశాలల్లో జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలు ప్రశ్నార్థకంగా మారాయి. యూనివర్శిటీ ఇప్పటికీ కాలేజీలకు ఎగ్జామ్ మెటీరియల్‌తో పాటు హాల్ టికెట్లు పంపిణీ చేయలేదు. కాలేజీలు కామన్ సర్వీస్ ఫీజు చెల్లిస్తేనే ఎగ్జామ్ మెటీరియల్, హాల్ టికెట్లు అందచేస్తామని జేఎన్టీయూహెచ్ స్పష్టం చేసింది. అయితే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అందాకే కామన్ సర్వీస్ ఫీజు చెల్లిస్తామని కాలేజీలు చెబుతున్నాయి. కాలేజీల నుంచి దాదాపుగా రూ.50 కోట్ల బకాయిల్లో కొంతైనా చెల్లించాలని జేఎన్టీయూహెచ్ డిమాండ్ చేస్తోంది. దీంతో పరీక్షలు దగ్గర పడుతున్నా హాల్ టికెట్లు అందక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. -
ప్రశ్నాపత్రాల కొరతతో ఐటీఐ పరీక్షల్లో ఆలస్యం
బొబ్బిలి : ప్రశ్నాపత్రాల కొరత కారణంగా విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో ఐటీఐ సెమిస్టర్ పరీక్షలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 830 మంది విద్యారులు బొబ్బిలిలోని ప్రభుత్వ ఐటీఐలో పరీక్షలు రాయాల్సి ఉంది. అయితే, 200 ప్రశ్నాపత్రాలు కొరత ఉండడంతో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావాల్సిన సెమిస్టర్ పరీక్షలు మధ్యాహ్నం 1.30 గంటల వరకూ మొదలు కాలేదు. జిరాక్స్ తీసి పరీక్ష నిర్వహిద్దామన్నా, విద్యుత్ లేకపోవడంతో ఆలస్యం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. 1.30 గంటల తర్వాత కరెంట్ రావడంతో ప్రశ్నాపత్రాలను జిరాక్స్ తీసి పరీక్ష నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ ప్రశ్నాపత్రాల కొరత నెలకొన్నట్లు సమాచారం.