సాక్షి, శాతవాహనయూనివర్సిటీ: ఓ సెమిస్టర్ చివరి దశకు వస్తున్నా.. నేటికీ పలు కోర్సులకు సంబంధించిన సబ్జెక్టుల సిలబస్ పూర్తి కాలేదంటే నమ్మాల్సిందే..!! నెల రోజుల్లో ప్రస్తుత సెమిస్టర్ కావాల్సి ఉంది. కానీ.. పలు కళాశాలల్లో ఆ పరిస్థితి లేదు. దీంతో అంతా అయోమయం నెలకొంది. అకాడమిక్ అల్మానాక్ అమలులో శాతవాహన యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యంతో అటు విద్యార్థులు, ఇటు అధ్యాపకులకు తలనొప్పిగా మారింది. జూన్‌లో సెమిస్టర్ ప్రారంభమైనా సెప్టెంబర్ నెల వరకు సిలబస్ పూర్తిస్థాయిలో నిర్ణయించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సెమిస్టర్ ప్రారంభానికి ముందే ప్రకటించాల్సి ఉన్నా.. వర్సిటీ తీరులో మార్పు రావడం లేదు. అకాడమిక్ అల్మానాక్ ప్రకారం షెడ్యూల్ జరగాల్సి ఉంది. దాని అమలుపై వర్సిటీ పట్టింపు లేకుండా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆరంభంలో ఊహాజనితంగా పలానా అంశాలు సిలబస్‌లో ఉంటాయని భావించి బోధన చేపట్టారు. తీరా చూస్తే సిలబస్ పరిశీలించాక బోధించిన అంశాలు కాకుం డా ఇంతరత్రా ఉండడంతో ఖంగుతిన్నారు. తిరిగి కొత్తగా పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని.. అకాడమిక్ అల్మానాక్ అమలుపై దృష్టి సారించి దాని ప్రకారం తరగతులు, పరీక్షలు నిర్వహించాలని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
సిలబస్ నిర్ణయించడంపై నిర్లక్ష్యం..
శాతవాహన యూనివర్సిటీ సిలబస్ విషయంలో కొన్నేళ్లుగా నిర్లక్ష్య వైఖరే కనిపిస్తోంది. గతంలో రెండో సెమిస్టర్‌లోని జెండర్ సెన్సిటైజేషన్ అనే కామన్ సబ్జెక్టు పేపర్ సిలబస్ కూడా సెమిస్టర్ ముగిసే 20 రోజుల ముందే ఇచ్చారు. దీంతో విద్యార్థులకు ఆయా అంశాలు 20 రోజుల్లో బోధించడానికి నానా అవస్థలు పడ్డారు. చివరకు ఫలితాలపై ప్రభావం పడింది. వివిధ సబ్జెక్టుల విషయంలోనూ ప్రారంభంలో ఇవ్వకుండా జాప్యం చేయడంతో కష్టాలు తప్పడంలేదు. ఇప్పుడు కూడా సెమిస్టర్ ప్రారంభమైన నెల రోజులు దాకా కూడా స్పష్టమైన సిలబస్ అంశాలు ప్రకటించలేదు. ఒకటి రెండు సబ్జెక్టులకు సంబందించిన సబ్జెక్టుల విషయంలో వర్సిటీ అధికారులు సిలబస్ ప్రకటించినా కళాశాలల్లో నేటికీ స్పష్టత లేదు. సెమిస్టర్ పూర్తి కావస్తున్నా ఇంకా అధ్యాపకులు వాటిని ఎప్పుడు బోధిస్తారు.. విద్యార్థులు వాటిని ఎప్పుడు చదువుతారు.. అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విద్యార్థుల్లో గందరగోళం..
యూనివర్సిటీ అధికారులు కొన్ని సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్ ప్రకటించిన తీరుపై అధ్యాపకుల్లో, విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. డిగ్రీ 5వ సెమిస్టర్ వారికి ‘పబ్లిక్ హెల్త్ అండ్ హైజీన్’ అనేది బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ అన్ని కోర్సుల వారికి సిలబస్ ప్రకటించారు. ‘వెర్బల్ రీజనింగ్ ఫర్ అప్టిట్యూడ్’ అనే సెలబస్ బీఏ, బీకాం, బీఎస్సీ వారికి అందరికీ ఉండాలని సెప్టెంబర్‌లో ఇచ్చారు. దీంతో బీఎస్సీ వారితోపాటు బీకాం, బీఏ విద్యార్థులకు దీనికి సంబంధించిన సిలబస్ బోధించడం ప్రారంభించారు. దాదాపు 15 రోజుల తర్వాత బీకాం విద్యార్థులకు మళ్లీ కొత్తగా ‘ప్రాక్టీస్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్’ అనే సబ్జెక్టును ప్రవేశపెట్టడంతో అధ్యాపకులు తలలు పట్టుకున్నారు. ఇదే కాకుండా బీకాం వారికి మార్చినప్పుడు బీఏ, బీఎస్సీ లైఫ్ సైన్స్ వాళ్లకూ ఇది చదవడం కఠినంగానే ఉంటుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ విధంగా ఏటా సిలబస్‌లో అస్పష్టత, సరైన సమయంలో నిర్ణయించకపోవడంతోపాటు పలు కారణాలతో అకాడమిక్ అల్మానాక్ అమలుపై నీలినీడలు అలుముకుంటున్నాయి.
పరీక్షల తేదీని పొడగిస్తాం..
డిగ్రీ కోర్సుల్లో సిలబస్‌ను నిర్ణయించడంలో కొంత ఆలస్యమైంది. నేను ఇటీవలే శాతవాహన రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించాను. ప్రస్తుతం నవంబర్‌లో పరీక్షలు ఉండాల్సింది. కానీ.. ఎన్నికల దృష్ట్యా వాటిని ఇంకా పొడగించే అవకాశం ఉంది. పరీక్షల సమయం పొడగించడంతో సిలబస్ పూర్తి చేసుకోవడానికి సమయం కూడా ఉంటుంది. వచ్చే సెమిస్టర్ నుండి సిలబస్, అకాడమిక్ అల్మానాక్ అమలు విషయంలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.– యూ.ఉమేష్‌కుమార్, శాతవాహనయూనివర్సిటీ రిజిస్ట్రార్
Published Fri, Oct 26 2018 4:01 PM | Last Updated on Fri, Oct 26 2018 4:01 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment