శ్రీకాంత్ (ఫైల్)
చందంపేట(దేవరకొండ) : పుట్టుకతో వికలాంగుడైన కుమారుడిని ఉన్నత స్థితిలో చూడాలనుకుంది. ఐదేళ్ల క్రితమే భర్త చనిపోయినా ఇద్దరు పిల్లలను ఏ లోటు లేకుండా చదివిస్తూ వచ్చింది. అమ్మ పెట్టుకున్న ఆశలను నెరవేర్చలేకపోతున్నానంటూ మనస్తాపంతో కుమారుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం చందంపేట మండలం పోలేపల్లి పంచాయతీ పరిధిలోని గన్నెర్లపల్లిలో జరిగింది. గన్నెర్లపల్లి గ్రామానికి చెందిన లక్ష్మమ్మ, బాలయ్య దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. బాలయ్య ఐదేళ్ల క్రితమే చనిపోగా.. లక్ష్మమ్మ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పో షిస్తోంది. పుట్టుకతోనే వికలాంగుడైన కుమారుడు కొండ్రపల్లి శ్రీకాంత్(22)కు ఏ లోటు లేకుండా చూసుకుంటూ వచ్చింది.
కుమారుడు చదివి ప్రయోజకుడై కుటుంబ పోషణ బాధ్యతలు తీసుకుంటాడని గంపెడు ఆశలు పెట్టుకుంది. దేవరకొండ పట్టణంలోని ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి.ఏ. చదువుతున్న శ్రీకాంత్ ఇటీవల విడుదలైన ఫలితాల్లో డిగ్రీ ఫెయిల్ కావడంతో మనస్తాపం చెందాడు. తల్లికి, కుటుంబానికి ఏ విధంగా తోడ్పాటు అందించలేకపోతున్నానని దిగులుతో శనివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడి మరణ వార్త తెలుసుకున్న ఆ తల్లి గుండెలలిసేలా రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఎదిగొచ్చిన కుమారుడు మృతి ఆ తల్లిని మరింత కుంగదీసింది.
Comments
Please login to add a commentAdd a comment