డిగ్రీ ఉంటేనే.. అంగన్‌వాడీ కొలువు!
వర్కర్ పోస్టుల విద్యార్హత పెంపునకు ఉన్నతాధికారుల ప్రతిపాదన
* హెల్పర్ల విద్యార్హతనూ 10వ తరగతికి పెంచే అవకాశం
* ప్రభుత్వామోదం లభిస్తే వెంటనే నోటిఫికేషన్ విడుదల
* త్వరలో 1,800 అంగన్‌వాడీ వర్కర్ పోస్టుల భర్తీకి సర్కారు సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు ఇటీవల గౌరవ వేతనాలను పెంచిన ప్రభుత్వం తాజాగా వారికి ఉండాల్సిన కనీస విద్యార్హతలను కూడా పెంచాలని యోచిస్తోంది.
ఇప్పటి వరకు టెన్త్ విద్యార్హతతోనే అంగన్‌వాడీ వర్కర్ల నియామకం జరగ్గా ఉన్నతాధికారులు తాజాగా సమర్పించిన ప్రతిపాదనల మేరకు ఇకపై‘అంగన్‌వాడీ కొలువు’కు కనీస అర్హత డిగ్రీ కానుంది. హెల్పర్ల విద్యార్హతను ఏడవ తరగతి నుంచి టెన్త్‌కు పెంచే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న వర్కర్ పోస్టులను భర్తీ చేసేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. వివిధ జిల్లాల్లో పలు సీడీపీవో ప్రాజెక్టుల కింద సుమారు 1,800 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మహిళా శిశుసంక్షేమ విభాగం ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
పథకాల సమగ్ర అమలు కోసమే..
మహిళలు, బాలల సంక్షేమం కోసం కేంద్రంతోపాటు తాము ప్రవేశపెడుతున్న వివిధ కార్యక్రమాలను సమగ్రంగా అమలు చే యాలంటే అంగన్‌వాడీ వర్కర్లకు తగిన విద్యార్హతలు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ గ్రామీణ ప్రాంతాల్లో అంగన్‌వాడీ వర్కర్లుగా డిగ్రీ చదువుకున్న అభ్యర్థులు దొరకని పక్షంలో.. ఏం చేయాలనే దానిపై కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను ‘ఏ’ కేటగిరీ కింద, గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్‌వాడీలను ‘బి’ కేటగిరీగా విభజించాలని నిర్ణయించారు.
‘ఏ’ కేటగిరీ అంగన్‌వాడీల్లో వర్కర్ పోస్టుల భర్తీ విషయంలో డిగ్రీ కలిగిన అభ్యర్థులనే పరిగణన లోకి తీసుకోవాలని, గ్రామీణ ప్రాంతాల్లో అంగన్‌వాడీ వర్కర్లకు కనీస అర్హతను ఇంటర్మీడియట్‌గా నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తోంది. మహిళా, శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 35,334 అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటిలో 31,606 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుకాగా, 3,728 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి.
అంగన్‌వాడీల్లో బాధ్యతలు ఇలా..
సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్)లో పనిచేస్తున్న అంగన్‌వాడీ వర్కర్లకు గౌరవ వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మే 23నే ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన కేంద్రాల వర్కర్లకు గతంలో రూ.4,200లుగా ఉన్న వేతనాన్ని రూ.7 వేలకు, మినీ అంగన్‌వాడీల్లో పనిచేసే వర్కర్లు, హెల్పర్ల వేతనాన్ని రూ.2,200 నుంచి రూ. 4,500కు పెంచింది. వర్కర్లు నిర్వహించాల్సిన విధులు, చేపట్టాల్సిన బాధ్యతలను కూడా పెంచింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో వర్కర్లకు 24 రకాల విధులను సూచించింది.
అంగన్‌వాడీ వర్కర్లు ప్రతిరోజూ అంగన్‌వాడీ కేంద్రాన్ని ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించాలి. ఆరేళ్లలోపు చిన్నారులకు ప్రీస్కూలింగ్ నిర్వహించాలి. ఇమ్యునైజేషన్, డీవార్మింగ్ నిమిత్తం ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లను భాగస్వాములను చేయాలి. ఐసీడీఎస్ వేదికల (ఐజీఎంఎస్‌వై, ఆర్ ఎస్‌బీకే, కెఎస్‌వై.. తదితర)తో సమన్వయం చేసుకోవాలి. ఆపై ప్రభుత్వం అప్పగించిన ఏ బాధ్యతలనైనా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలి.