Minimum educational qualification
-
రాజస్తాన్ నిర్ణయం భేష్
పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు కనీస విద్యార్హతలు ఉండాలంటూ మూడేళ్లక్రితం రాజస్తాన్‌లో అప్పటి బీజేపీ ప్రభుత్వం చేసిన చట్టాన్ని రద్దు చేయాలని అశోక్ గహ్లోత్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అన్నివిధాలా హర్షించదగ్గది. ఆ చట్టం ప్రకారం మున్సిపల్ ఎన్నికలు, జడ్పీ ఎన్నికలు, పంచాయతీ సమితి ఎన్నికల్లో పోటీచేయడానికి పదో తరగతి...సర్పంచ్ పదవికి పోటీ చేయడానికి ఎనిమిదో తరగతి కనీస విద్యార్హతగా ఉండాలి. గిరిజన ప్రాంతాల్లో సర్పంచ్ పదవికి పోటీ చేసేవారు అయిదో తరగతి ఉత్తీర్ణులైతే చాలని ఆ చట్టం నిర్దేశించింది. రాజస్తాన్ ఆ చట్టం తీసుకొచ్చిన కొన్నాళ్లకే హర్యానా ప్రభుత్వం సైతం అదే మాదిరి చట్టాన్ని తీసుకొచ్చింది. ఓటు హక్కు ఎవరికి ఇవ్వాలి...ఎవరు పోటీ చేయొచ్చు అన్న అంశాలపై మన రాజ్యాంగసభలో విస్తృతంగా చర్చ జరిగింది. ప్రజాస్వామ్య సంస్కృతి దేశంలో వేళ్లూనుకుని వృద్ధి చెందాలంటే అన్ని రకాల వివక్షలకూ అతీతంగా ఓటు హక్కు ఇవ్వాలని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. స్త్రీ పురుష భేదం, బీదా గొప్పా తారతమ్యం, గ్రామ–పట్టణ విభజన వంటివి ఉండ కూడదని, విద్యార్హతలను పట్టించుకోనవసరం లేదని వారు నిర్ణయించారు. అయితే ఓటేయడానికి అవసరమైన విచక్షణా జ్ఞానం ఉండటానికి నిర్దిష్ట వయసు తప్పనిసరని తీర్మానించారు. ప్రాతినిధ్య ప్రజాస్వామ్య విధానం పునాది స్థాయి నుంచి పటిష్టం కావాలంటే పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం కావడం ముఖ్యమనుకున్నారు. ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో తమ పాత్ర లేదని, తమ స్వరం వినబడనీయరని అనుకునే పరిస్థితులుంటే అది ప్రజాస్వామ్యానికి మేలు కలిగించదు. ఓటేయడానికి పనికొచ్చే విచక్షణా జ్ఞానం పాలించడానికి పనికిరాదని...చదువుకోనివారు పదవుల్లోకొస్తే అవినీతికి పాల్పడతారని లేదా మోసపోతారని భావించడం అజ్ఞానం. మన దేశంలో పార్లమెంటు, అసెంబ్లీలు వంటి చట్టసభలు తమ సభ్యులకు వర్తించని అర్హతలు అట్టడుగు స్థాయిలోని పంచాయతీరాజ్ సంస్థల సభ్యులకు ఉండితీరాలని చెప్పడం నియంతృత్వ పోకడ తప్ప మరేమీ కాదు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలహీనపడుతున్నదని, దాన్ని పటిష్టం చేయాల్సిన అవసరం ఉన్నదని భావించి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా అనేక మార్పులు తీసుకొచ్చారు. వాటికి నిర్దిష్ట కాలపరిమితిలోగా ఎన్నికలు జరపడం తప్పనిసరి చేశారు. ఆ సంస్థల ద్వారా గ్రామ స్థాయిల్లో అమలు కావాల్సిన 29 అంశాలను ఖరారు చేశారు. ఆ అంశాల్లో వాటికి పూర్తి అధికారాలిచ్చారు. అయితే బీజేపీ సర్కారు విద్యార్హతలు నిర్ణయించడానికి చూపిన కారణాలు చిత్రంగా ఉన్నాయి. పంచాయతీరాజ్ సంస్థల్లో బాధ్యతాయుత స్థానాల్లో పనిచేస్తున్నవారు ఎడా పెడా అవినీతికి పాల్పడుతూ దర్యాప్తు సమయంలో మాత్రం తమకు చదువు రాకపోవడం వల్ల చట్టంలో ఏముందో తెలియలేదని తప్పించుకోజూస్తున్నారని అప్పట్లో విజయరాజే ప్రభుత్వం ఆరోపించింది. ఈ వాదనలోని డొల్లతనాన్ని పౌర సమాజ కార్యకర్తలు బయటపెట్టారు. రాజస్తాన్‌లో దాదాపు 6,000మంది సర్పంచ్‌లుంటే వారిలో కేవలం కొన్ని వందలమందిపైన మాత్రమే అవినీతి ఆరోపణలొచ్చాయని వారు గణాంక సహితంగా వివరించారు. మన దేశంలో నిరక్షరాస్యత ఒక సమస్యే. విద్యావ్యాప్తి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని పథకాలు అమలు చేస్తున్నా ఆ విషయంలో సంపూర్ణ విజయం లభించడం లేదు. అయితే అందరికీ విద్య అందించాలన్న సంకల్పం మాత్రమే ఉంటే సరిపోదు. అది సాకారం కావడానికి అడ్డుపడుతున్న అంశాలేమిటో పరిశీలించి వాటిని చక్కదిద్దాలి. గ్రామల్లో ఉపాధి అవకాశాలు నానాటికీ తగ్గిపోతుంటే వేలాది కుటుంబాలు వలస బాట పడుతున్నాయి. ఇంటిల్లిపాదీ పనిచేస్తే తప్ప పూట గడవని స్థితి ఉండటం వల్ల బడికొచ్చే పిల్లలు సైతం మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పవలసి వస్తున్నది. పోనీ ఆ బడుల్లోనైనా చాలినంతమంది ఉపాధ్యాయులుండటం లేదు. ఫలితంగా చదువుకునేవారికి తగినంత పరిజ్ఞానం లభించడం లేదు. ఏటేటా వెలువడే ‘ప్రథమ్’ సర్వేలు మన సర్కారీ బడుల నిర్వాకాన్ని వెల్లడిస్తుంటాయి. అయిదో తరగతి పిల్లలకు రెండో తరగతి పుస్తకాలు చదవడం కూడా రావటం లేదని ఆ నివేదికలు చెబుతున్నా దిద్దుబాటు చర్యలుండవు. ఇలాంటి పరిస్థితుల్లో నిరుపేద వర్గాల్లో తరాలు గడుస్తున్నా విద్యాగంధం అంటడం లేదు. అందుకు తిరిగి వారినే బాధ్యులుగా చేస్తూ పంచాయతీరాజ్ ఎన్నికల్లో పోటీకి అనర్హుల్ని చేయడం దుర్మార్గం. ఒకరకంగా ఇది ఓటర్ల విజ్ఞతను కూడా శంకించడమే అవుతుంది. తమ ప్రయోజనాలను పరిరక్షించగల వారెవరో, పనులు చేయగలిగేవారెవరో నిర్ణయించుకోగలిగిన సామర్ధ్యం వారికుంటుంది. ఎంపిక చేసుకునేందుకు కేవలం విద్యార్హతలున్నవారిని మాత్రమే ఓటర్ల ముందు ఉంచాలని భావించడం సరికాదు. విద్యార్హతలు లేని నేతల్లో వారికి నిజాయితీ కనబడొచ్చు. వారిలోనే తగిన శక్తిసామర్థ్యాలు ఉన్నాయని లేదా వారే తమకు అందుబాటులో ఉంటారని భావించవచ్చు. ఓటర్లకు ఆ అవకాశం లేకుండా చేయడానికి ప్రభుత్వం ఎవరు? ఒక్క రాజస్తాన్ మాత్రమే కాదు... హర్యానా కూడా ఈ మాదిరి చట్టాన్నే తీసుకొచ్చింది. ఇంట్లో మరుగుదొడ్డి ఉన్న అభ్యర్థులే పోటీకి అర్హులని బిహార్, కర్ణాటక చట్టాలు ఆంక్షలు విధించాయి. ఆంధ్రప్రదేశ్ చట్టం ప్రకారం మూగ, బధిర, కుష్టువ్యాధి ఉన్నవారు పోటీకి అనర్హులు. అధిక సంతానం ఉన్నవారు పోటీకి అనర్హులని కొన్నిచోట్ల చట్టాలు చేశారు. రాజస్తాన్‌లో నిరక్షరాస్యత పురుషుల్లో 21 శాతం, మహిళల్లో 48 శాతం ఉంది. ఇతర రాష్ట్రాల్లో సైతం కాస్త హెచ్చుతగ్గులతో ఇదే పరిస్థితి ఉంటుంది. ఇంతమందిని ప్రజాస్వామ్య ప్రక్రియకు దూరం చేయడం సరికాదని గ్రహించకపోవడం, పైగా చట్టసభలకు పోటీచేసేవారికి మాత్రం ఇటువంటివి అవసరం లేదనుకోవడం నిరంకుశత్వం తప్ప మరేమీ కాదు. ఇతర రాష్ట్రాలు సైతం రాజస్తాన్ బాటలో నడిచి అర్ధరహితమైన నిబంధనలను పరిహరిస్తాయని ఆశించాలి. -
డిగ్రీ ఉంటేనే.. అంగన్వాడీ కొలువు!
వర్కర్ పోస్టుల విద్యార్హత పెంపునకు ఉన్నతాధికారుల ప్రతిపాదన * హెల్పర్ల విద్యార్హతనూ 10వ తరగతికి పెంచే అవకాశం * ప్రభుత్వామోదం లభిస్తే వెంటనే నోటిఫికేషన్ విడుదల * త్వరలో 1,800 అంగన్వాడీ వర్కర్ పోస్టుల భర్తీకి సర్కారు సన్నాహాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ఇటీవల గౌరవ వేతనాలను పెంచిన ప్రభుత్వం తాజాగా వారికి ఉండాల్సిన కనీస విద్యార్హతలను కూడా పెంచాలని యోచిస్తోంది. ఇప్పటి వరకు టెన్త్ విద్యార్హతతోనే అంగన్వాడీ వర్కర్ల నియామకం జరగ్గా ఉన్నతాధికారులు తాజాగా సమర్పించిన ప్రతిపాదనల మేరకు ఇకపై‘అంగన్వాడీ కొలువు’కు కనీస అర్హత డిగ్రీ కానుంది. హెల్పర్ల విద్యార్హతను ఏడవ తరగతి నుంచి టెన్త్‌కు పెంచే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న వర్కర్ పోస్టులను భర్తీ చేసేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. వివిధ జిల్లాల్లో పలు సీడీపీవో ప్రాజెక్టుల కింద సుమారు 1,800 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మహిళా శిశుసంక్షేమ విభాగం ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పథకాల సమగ్ర అమలు కోసమే.. మహిళలు, బాలల సంక్షేమం కోసం కేంద్రంతోపాటు తాము ప్రవేశపెడుతున్న వివిధ కార్యక్రమాలను సమగ్రంగా అమలు చే యాలంటే అంగన్వాడీ వర్కర్లకు తగిన విద్యార్హతలు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ వర్కర్లుగా డిగ్రీ చదువుకున్న అభ్యర్థులు దొరకని పక్షంలో.. ఏం చేయాలనే దానిపై కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాలను ‘ఏ’ కేటగిరీ కింద, గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్వాడీలను ‘బి’ కేటగిరీగా విభజించాలని నిర్ణయించారు. ‘ఏ’ కేటగిరీ అంగన్వాడీల్లో వర్కర్ పోస్టుల భర్తీ విషయంలో డిగ్రీ కలిగిన అభ్యర్థులనే పరిగణన లోకి తీసుకోవాలని, గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ వర్కర్లకు కనీస అర్హతను ఇంటర్మీడియట్గా నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తోంది. మహిళా, శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 35,334 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటిలో 31,606 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుకాగా, 3,728 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. అంగన్వాడీల్లో బాధ్యతలు ఇలా.. సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్)లో పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్లకు గౌరవ వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మే 23నే ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన కేంద్రాల వర్కర్లకు గతంలో రూ.4,200లుగా ఉన్న వేతనాన్ని రూ.7 వేలకు, మినీ అంగన్వాడీల్లో పనిచేసే వర్కర్లు, హెల్పర్ల వేతనాన్ని రూ.2,200 నుంచి రూ. 4,500కు పెంచింది. వర్కర్లు నిర్వహించాల్సిన విధులు, చేపట్టాల్సిన బాధ్యతలను కూడా పెంచింది. అంగన్వాడీ కేంద్రాల్లో వర్కర్లకు 24 రకాల విధులను సూచించింది. అంగన్వాడీ వర్కర్లు ప్రతిరోజూ అంగన్వాడీ కేంద్రాన్ని ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించాలి. ఆరేళ్లలోపు చిన్నారులకు ప్రీస్కూలింగ్ నిర్వహించాలి. ఇమ్యునైజేషన్, డీవార్మింగ్ నిమిత్తం ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లను భాగస్వాములను చేయాలి. ఐసీడీఎస్ వేదికల (ఐజీఎంఎస్‌వై, ఆర్ ఎస్బీకే, కెఎస్వై.. తదితర)తో సమన్వయం చేసుకోవాలి. ఆపై ప్రభుత్వం అప్పగించిన ఏ బాధ్యతలనైనా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలి.