రాజస్తాన్‌ నిర్ణయం భేష్‌ | Editorial ON Minimum Educational Criteria For Rajasthan Civic Polls candidates  | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 4 2019 2:12 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Editorial ON Minimum Educational Criteria For Rajasthan Civic Polls candidates  - Sakshi

పంచాయతీరాజ్‌ సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు కనీస విద్యార్హతలు ఉండాలంటూ మూడేళ్లక్రితం రాజస్తాన్‌లో అప్పటి బీజేపీ ప్రభుత్వం చేసిన చట్టాన్ని రద్దు చేయాలని అశోక్‌ గహ్లోత్‌ నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అన్నివిధాలా హర్షించదగ్గది. ఆ చట్టం ప్రకారం మున్సిపల్‌ ఎన్నికలు, జడ్‌పీ ఎన్నికలు, పంచాయతీ సమితి ఎన్నికల్లో పోటీచేయడానికి పదో తరగతి...సర్పంచ్‌ పదవికి పోటీ చేయడానికి ఎనిమిదో తరగతి కనీస విద్యార్హతగా ఉండాలి. గిరిజన ప్రాంతాల్లో సర్పంచ్‌ పదవికి పోటీ చేసేవారు అయిదో తరగతి ఉత్తీర్ణులైతే చాలని ఆ చట్టం నిర్దేశించింది. రాజస్తాన్‌ ఆ చట్టం తీసుకొచ్చిన కొన్నాళ్లకే హర్యానా ప్రభుత్వం సైతం అదే మాదిరి చట్టాన్ని తీసుకొచ్చింది.

ఓటు హక్కు ఎవరికి ఇవ్వాలి...ఎవరు పోటీ చేయొచ్చు అన్న అంశాలపై మన రాజ్యాంగసభలో విస్తృతంగా చర్చ జరిగింది. ప్రజాస్వామ్య సంస్కృతి దేశంలో వేళ్లూనుకుని వృద్ధి చెందాలంటే అన్ని రకాల వివక్షలకూ అతీతంగా ఓటు హక్కు ఇవ్వాలని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. స్త్రీ పురుష భేదం, బీదా గొప్పా తారతమ్యం, గ్రామ–పట్టణ విభజన వంటివి ఉండ కూడదని, విద్యార్హతలను పట్టించుకోనవసరం లేదని వారు నిర్ణయించారు. అయితే ఓటేయడానికి అవసరమైన విచక్షణా జ్ఞానం ఉండటానికి నిర్దిష్ట వయసు తప్పనిసరని తీర్మానించారు. ప్రాతినిధ్య ప్రజాస్వామ్య విధానం పునాది స్థాయి నుంచి పటిష్టం కావాలంటే పంచాయతీరాజ్‌ వ్యవస్థ బలోపేతం కావడం ముఖ్యమనుకున్నారు. ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో తమ పాత్ర లేదని, తమ స్వరం వినబడనీయరని అనుకునే పరిస్థితులుంటే అది ప్రజాస్వామ్యానికి మేలు కలిగించదు. 

ఓటేయడానికి పనికొచ్చే విచక్షణా జ్ఞానం పాలించడానికి పనికిరాదని...చదువుకోనివారు పదవుల్లోకొస్తే అవినీతికి పాల్పడతారని లేదా మోసపోతారని భావించడం అజ్ఞానం. మన దేశంలో పార్లమెంటు, అసెంబ్లీలు వంటి చట్టసభలు తమ సభ్యులకు వర్తించని అర్హతలు అట్టడుగు స్థాయిలోని పంచాయతీరాజ్‌ సంస్థల సభ్యులకు ఉండితీరాలని చెప్పడం నియంతృత్వ పోకడ తప్ప మరేమీ కాదు. పంచాయతీరాజ్‌ వ్యవస్థ బలహీనపడుతున్నదని, దాన్ని పటిష్టం చేయాల్సిన అవసరం ఉన్నదని భావించి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా అనేక మార్పులు తీసుకొచ్చారు. వాటికి నిర్దిష్ట కాలపరిమితిలోగా ఎన్నికలు జరపడం తప్పనిసరి చేశారు. ఆ సంస్థల ద్వారా గ్రామ స్థాయిల్లో అమలు కావాల్సిన 29 అంశాలను ఖరారు చేశారు.

ఆ అంశాల్లో వాటికి పూర్తి అధికారాలిచ్చారు. అయితే బీజేపీ సర్కారు విద్యార్హతలు నిర్ణయించడానికి చూపిన కారణాలు చిత్రంగా ఉన్నాయి. పంచాయతీరాజ్‌ సంస్థల్లో బాధ్యతాయుత స్థానాల్లో పనిచేస్తున్నవారు ఎడా పెడా అవినీతికి పాల్పడుతూ దర్యాప్తు సమయంలో మాత్రం తమకు చదువు రాకపోవడం వల్ల చట్టంలో ఏముందో తెలియలేదని తప్పించుకోజూస్తున్నారని అప్పట్లో విజయరాజే ప్రభుత్వం ఆరోపించింది. ఈ వాదనలోని డొల్లతనాన్ని పౌర సమాజ కార్యకర్తలు బయటపెట్టారు. రాజస్తాన్‌లో దాదాపు 6,000మంది సర్పంచ్‌లుంటే వారిలో కేవలం కొన్ని వందలమందిపైన మాత్రమే అవినీతి ఆరోపణలొచ్చాయని వారు గణాంక సహితంగా వివరించారు. 

మన దేశంలో నిరక్షరాస్యత ఒక సమస్యే. విద్యావ్యాప్తి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని పథకాలు అమలు చేస్తున్నా ఆ విషయంలో సంపూర్ణ విజయం లభించడం లేదు. అయితే అందరికీ విద్య అందించాలన్న సంకల్పం మాత్రమే ఉంటే సరిపోదు. అది సాకారం కావడానికి అడ్డుపడుతున్న అంశాలేమిటో పరిశీలించి వాటిని చక్కదిద్దాలి. గ్రామల్లో ఉపాధి అవకాశాలు నానాటికీ తగ్గిపోతుంటే వేలాది కుటుంబాలు వలస బాట పడుతున్నాయి. ఇంటిల్లిపాదీ పనిచేస్తే తప్ప పూట గడవని స్థితి ఉండటం వల్ల బడికొచ్చే పిల్లలు సైతం మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పవలసి వస్తున్నది. పోనీ ఆ బడుల్లోనైనా చాలినంతమంది ఉపాధ్యాయులుండటం లేదు. ఫలితంగా చదువుకునేవారికి తగినంత పరిజ్ఞానం లభించడం లేదు.

ఏటేటా వెలువడే ‘ప్రథమ్‌’ సర్వేలు మన సర్కారీ బడుల నిర్వాకాన్ని వెల్లడిస్తుంటాయి. అయిదో తరగతి పిల్లలకు రెండో తరగతి పుస్తకాలు చదవడం కూడా రావటం లేదని ఆ నివేదికలు చెబుతున్నా దిద్దుబాటు చర్యలుండవు. ఇలాంటి పరిస్థితుల్లో నిరుపేద వర్గాల్లో తరాలు గడుస్తున్నా విద్యాగంధం అంటడం లేదు. అందుకు తిరిగి వారినే బాధ్యులుగా చేస్తూ పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో పోటీకి అనర్హుల్ని చేయడం దుర్మార్గం. ఒకరకంగా ఇది ఓటర్ల విజ్ఞతను కూడా శంకించడమే అవుతుంది. తమ ప్రయోజనాలను పరిరక్షించగల వారెవరో, పనులు చేయగలిగేవారెవరో నిర్ణయించుకోగలిగిన సామర్ధ్యం వారికుంటుంది. ఎంపిక చేసుకునేందుకు కేవలం విద్యార్హతలున్నవారిని మాత్రమే ఓటర్ల ముందు ఉంచాలని భావించడం సరికాదు. విద్యార్హతలు లేని నేతల్లో వారికి నిజాయితీ కనబడొచ్చు. వారిలోనే తగిన శక్తిసామర్థ్యాలు ఉన్నాయని లేదా వారే తమకు అందుబాటులో ఉంటారని భావించవచ్చు. ఓటర్లకు ఆ అవకాశం లేకుండా చేయడానికి ప్రభుత్వం ఎవరు?

ఒక్క రాజస్తాన్‌  మాత్రమే కాదు... హర్యానా కూడా ఈ మాదిరి చట్టాన్నే తీసుకొచ్చింది. ఇంట్లో మరుగుదొడ్డి ఉన్న అభ్యర్థులే పోటీకి అర్హులని బిహార్, కర్ణాటక చట్టాలు ఆంక్షలు విధించాయి. ఆంధ్రప్రదేశ్‌ చట్టం ప్రకారం మూగ, బధిర, కుష్టువ్యాధి ఉన్నవారు పోటీకి అనర్హులు. అధిక సంతానం ఉన్నవారు పోటీకి అనర్హులని కొన్నిచోట్ల చట్టాలు చేశారు. రాజస్తాన్‌లో నిరక్షరాస్యత పురుషుల్లో 21 శాతం, మహిళల్లో 48 శాతం ఉంది. ఇతర రాష్ట్రాల్లో సైతం కాస్త హెచ్చుతగ్గులతో ఇదే పరిస్థితి ఉంటుంది. ఇంతమందిని ప్రజాస్వామ్య ప్రక్రియకు దూరం చేయడం సరికాదని గ్రహించకపోవడం, పైగా చట్టసభలకు పోటీచేసేవారికి మాత్రం ఇటువంటివి అవసరం లేదనుకోవడం నిరంకుశత్వం తప్ప మరేమీ కాదు. ఇతర రాష్ట్రాలు సైతం రాజస్తాన్‌ బాటలో నడిచి అర్ధరహితమైన నిబంధనలను పరిహరిస్తాయని ఆశించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement