
సెంటర్ ఫర్ ‘గుడ్డి’ గవర్నెన్స్
సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) అధికారుల తప్పిదం వేల మంది డిగ్రీ విద్యార్థులకు శాపంగా మారింది.
ఇవన్నీ పూర్తయ్యే సమయంలో గురువారం చావు కబురు చల్లగా చెప్పింది. ‘మీకు సీటు ఆ కాలేజీలో కాదు.. మరో కాలేజీలో కేటాయించాం... అందులో చేరండి..’అంటూ సమాచారం పంపడంతో విద్యార్థులు లబోదిబోమంటున్నారు. ఇలా దాదాపు 2,900 మంది విద్యార్థులు సీట్లు మారిపోయాయని, 92 మంది విద్యార్థులు సీట్లు కోల్పోయారని ప్రాథమికంగా అంచనా వేశారు. కానీ, వారి సంఖ్య ఎక్కువగానే ఉండవచ్చని ఉన్నత విద్యా మండలి అధికారులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై శుక్రవారం వందల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
ఆ కేటాయింపులకు చేసిన సీట్ మ్యాట్రిక్స్‌లో తప్పులు దొర్లినట్లు ఈ నెల 11న గుర్తించింది. కొన్ని ఉర్దూ కాలేజీల్లో సీట్ల కేటాయింపు జరగకపోవడంతో ఆ అంశంపై దృష్టి సారించగా ఈ విషయం బయటపడింది. దీంతో ఈ నెల 17న తాజాగా మళ్లీ సీట్లను కేటాయించింది. దీంతో దాదాపు 2,900 మంది సీట్లు మారిపోయాయి. 92 మంది సీట్లు గల్లంతయ్యాయి. సీట్లు మారాయని, తాజాగా సీటు వచ్చిన కాలేజీలో చేరండని మెసేజ్‌లు రావడంతో విద్యార్థులు ఆందోళనలో పడ్డారు.
అప్పటికే అనేక మంది కాలేజీల్లో చేరిపోయారు. ఇప్పుడేం చేయాలో అర్థంకాని స్థితిలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డికి శుక్రవారం ఫిర్యాదు చేశారు. మరోవైపు కోర్టు ఆదేశాల మేరకు సొంతంగా ప్రవేశాలు చేసుకునే 28 కాలేజీల్లోనూ సీజీజీ సీట్లను కేటాయించింది. తీరా విద్యార్థులు అక్కడికి వెళితే వారిని చేర్చుకోవడం లేదు. ఒకటీ రెండురోజుల్లో కమిటీ సమావేశం నిర్వహించి విద్యార్థులెవరికీ అన్యాయం జరక్కుండా తగిన నిర్ణయం తీసుకుంటామని మండలి ఛైర్మన్ పాపిరెడ్డి పేర్కొన్నారు.