Undergraduate
-
యూజీ, పీజీ పరీక్షలపై మంత్రి సురేష్ స్పష్టత
సాక్షి, అమరావతి : పదో తరగతి పరీక్షల మాదిరి యూజీ, పీజీ పరీక్షలు రద్దయ్యే అవకాశం లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తున్నామే తప్ప రద్దన్న ప్రశ్న ఉత్పన్నమే కాలేదని స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఉన్నత విద్యా కోర్సులు చదువుతున్న విద్యార్థుల పరీక్షల నిర్వహణ, రాబోయే విద్యా సంవత్సరంలో చేయాల్సిన పనులపై రాష్ట్రంలో ఉన్న 16 యూనివర్సిటీల వీసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం పరిస్థితులపై ఏ విధంగా ముందుకు వెళ్లాలో సమీక్షించారు. అనంతరం మంత్రి సురేష్ మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో సీఎం జగన్ నాయకత్వంలో కరోనా నియంత్రణపై స్పష్టమైన జాగ్రత్తలతో ముందుకు వెళ్తున్నామన్నారు. కరోనా సమయంలో ఇబ్బందులు ఎదురావుతాయనే ముందుగానే తొమ్మిదో తరగతి లోవు పరీక్షలు రద్దు చేశామని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలు నిర్వహించాలనుకున్నా కేసులు పెరుగుతున్నందున రద్దు చేశామన్నారు. (చదవండి : కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ మరో రికార్డ్ ) యూజీ, పీజీ చదువుతున్న విద్యార్థులకు పరిస్థితులపై అవగాహన ఉంటుందని.. ఒక్కో యూనివర్సిటీలో ఒక్కొక్క రకమైన పరిస్థితి ఉందన్నారు. పరీక్షలు నిర్వహించాల్సి వస్తే ఎలా చేయాలి.. రద్దు చేయాల్సి వస్తే ఏమి చేయాలి అని పూర్తిగా కసరత్తు చేశామని మంత్రి తెలిపారు. ఇవన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి గురువారం నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకూ పరీక్షలు రద్దు చేస్తున్నామని ప్రకటించలేదని.. ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం అకాడమిక్ క్యాలెండర్‌ను రూపొందిస్తామని మంత్రి సురేష్ తెలిపారు. -
ఒకే దేశం.. ఒకే డిగ్రీ!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కోర్సుల సిలబస్‌లో వచ్చే ఏడాది సమూల మార్పులు జరగనున్నాయి. నూతన విద్యా విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ స్థాయిలో ఒకే తరహా సిలబస్‌ను అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) కోర్సుల్లో ప్రవేశపెట్టేందుకు కసరత్తు ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) దేశంలోని అన్ని యూనివర్సిటీల వైస్ చాన్సలర్లతో ఢిల్లీలో సమావేశం నిర్వహించింది. ఇందులో మెజార్టీ యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లు దేశ వ్యాప్తంగా ఒకే తరహా డిగ్రీ సిలబస్ ఉండేలా మార్పులు తీసుకువచ్చేందుకు అంగీకారం తెలిపారు. దీంతో యూజీసీ ఈ నెలాఖరులో మోడల్ సిలబస్‌ను ప్రకటించేందుకు సిద్ధమైంది. అనంతరం ఆయా రాష్ట్రాల్లోని విద్యాశాఖ అధికారులు, కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి శాఖ అధికారులతో సంయుక్త కమిటీలను ఏర్పాటు చేయనుంది. ఆ కమిటీలు రాష్ట్రాల్లోని పరిస్థితులకు అనుగుణంగా 20 శాతం నుంచి 30 శాతం వరకు సిలబస్‌ను మార్పు చేసుకునే వీలు కల్పించనుంది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కసరత్తు ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ నెలాఖరు మోడల్ సిలబస్ రాగానే స్థానిక అవసరాల మేరకు సిలబస్‌లో మార్పులకు చర్యలు చేపట్టేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మిగతా 70 శాతం నుంచి 80 శాతం సిలబస్ జాతీయ స్థాయిలో ఒకే తరహాలో ఉండేలా పాఠ్యాంశాల రూపకల్పన చేయనుంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా.. ప్రస్తుతం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా డిగ్రీ సిలబస్ ఉంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో వేర్వేరు మార్కుల విధానం అమలు అమలు అవుతోంది. ఎక్కడా సమానత్వం ఉండటం లేదు. కొన్ని రాష్ట్రాల్లో 75 శాతానికి మార్కులు మించకపోతే మరికొన్ని రాష్ట్రాల్లో 95 శాతం వరకు మార్కులు వేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఒకేలా రకమైన బోధన, పాఠ్యాంశాల రూపకల్పన, మార్కుల విధానం తీసుకువచ్చే చర్యలను కేంద్రం చేపట్టింది. మరోవైపు భాషలు, చరిత్ర వంటి పుస్తకాల్లో అవసరంలేని అంతర్జాతీయ స్థాయి సిలబస్ ఉంది. దేశంలోని ప్రముఖులకు సంబంధించిన పాఠ్యాంశాలకు చోటు లేకుండా పోయింది. ప్రస్తుతం వాటన్నింటిని పరిశీలించి దేశీయ అవసరాలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేసి మోడల్ సిలబస్‌ను ప్రకటించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇక 2016లో కేంద్రం ప్రవేశపెట్టిన చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంకు అనుగుణంగా డిగ్రీ సిలబస్‌లో మార్పులు తీసుకువచ్చినా, జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా మరిన్ని మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోనూ మార్పు చేసిన పాఠ్య పుస్తకాలను 2016–17 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అప్పుడు ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థుల ఫైనల్ ఇయర్ ఈ విద్యా సంవత్సరంతో ముగియనుంది. కాబట్టి వచ్చే విద్యా సంవత్సరంలో కొత్త సిలబస్‌ను రూపొందించి అమల్లోకి తీసుకురానుంది. గతేడాది రాష్ట్రంలో డిగ్రీ ఇంగ్లిషులో మార్పులు తేవాలని భావించినా కోర్సు మధ్యలో అలా చేయడం కుదరదని, విద్యార్థులు గందరగోళానికి గురవుతారని వర్సిటీలు వ్యతిరేకించాయి. దీంతో ఉన్నత విద్యా మండలి మిన్నకుండిపోయింది. గతంలో మార్పు చేసిన సిలబస్‌లో చేరిన వారి ఫైనల్ ఇయర్ ఇప్పుడు పూర్తి అవుతున్న నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరంలో కొత్త సిలబస్‌ను డిగ్రీ ప్రథమ సంవత్సరంలో అమల్లోకి తెచ్చేలా చర్యలు చేపడుతోంది. -
డీయూకు విదేశీ విద్యార్థుల క్యూ
న్యూఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) విదేశాల్లోనూ ప్రాచుర్యం పొందుతోంది. వివిధ కోర్సుల కోసం విదేశీ విద్యార్థులుకూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది ఇప్పటిదాకా మొత్తం 2,098 మంది విదేశీ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారి ఒకరు గురువారం వెల్లడించారు. అండర్గ్రాడ్యుయేట్ కోర్సుకే వీరిలో అత్యధిక శాతం మంది దరఖాస్తు చేసుకున్నారు. 1,259 మంది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు, 609 మంది నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని డీయూ ఫారిన్ రిజిస్ట్రీ విభాగం అధిపతి కౌర్ బస్రా వెల్లడించారు. వీరిలో టిబెటన్లు 475 మంది కాగా 237 మంది నేపాలీయులని ఆయన చెప్పారు. గత ఏడాది 248 మంది టిబెటన్లు, 222 మంది నేపాలీయులు దరఖాస్తు చేసుకున్న సంగతి విదితమే. ‘ఇక దక్షిణ కొరియాకు చెందిన విద్యార్థులు సైతం డీయూలో వివిధ కోర్సులకు దరఖాస్తు చేసుకునేందుకు నగరానికి వచ్చారని బస్రా చెప్పారు. వారికి కొరియా రాయబార కార్యాలయం అవసరమైన వసతులు కల్పిస్తోందన్నారు. దీంతో వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తడం లేదన్నారు. అయితే దేశంలోని వివిధ నగరాల నుంచి వచ్చిన విద్యార్థినులు సరైన వసతి దొరక్క నానాఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వారికి తగు వసతులు కల్పించేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. దక్షిణ కొరియాకు చెందిన 54 మంది విద్యార్థులు గత ఏడాది తమ విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సుల్లో చేరారన్నారు. -
విద్యార్థులకు రిలయన్స్ ఉపకార వేతనాలు
ముంబై: అండర్ గ్రాడ్యుయేట్ చదువుతున్న 393 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ ఉపకార వేతనాలను అందించింది. వీరిలో 111 మంది మానసిక వికలాంగులు కూడా ఉన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ బుధవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో విద్యార్థులందరికీ ఉపకార వేతనాలను అందించారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు చేయూతనందించే సంకల్పంతో 1996 నుంచి ప్రారంభించిన ధీరూ అంబానీ ఉపకార వేతనం కార్యక్రమం కింద ఇప్పటివరకు పది వేల మంది అభ్యర్థులు లబ్ధి పొందారు. వీరిలో రెండు వేల మంది మానసిక వికలాంగులు కూడా ఉన్నారని ఫౌండేషన్ సభ్యుడు ఒకరు తెలిపారు.