నేటి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ | EAMCET counseling from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్

Published Mon, Jun 6 2016 1:39 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 AM

నేటి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్

నేటి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్

జిల్లాలో నాలుగు హెల్ప్‌లైన్ కేంద్రాలు సిద్ధం
నేడు ఒకటో ర్యాంకు నుంచి 5 వేల
ర్యాంకు వరకూ సర్టిఫికెట్ల పరిశీలన

 
 
గుంటూరు ఎడ్యుకేషన్ :  ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశించేందుకు నిర్ధేశించిన ఏపీ ఎంసెట్-2016 (ఎంపీసీ స్ట్రీమ్) కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభం కానుంది. సర్టిఫికెట్ల పరిశీలనకు జిల్లాలో నాలుగు హెల్ప్‌లైన్ కేంద్రాలను సిద్ధం చేశారు. గుంటూరు నగర పరిధిలో గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్, నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఈ నెల 15వ తేదీ వరకూ సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. కౌన్సెలింగ్ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. అయితే సోమవారం మాత్రం కౌన్సెలింగ్ ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన విద్యార్థులకు కళాశాలల ఎంపిక కోసం ఆప్షన్లు నమోదు చేసేందుకు ఈ నెల 9వ తేదీ నుంచి 18 వరకూ వెబ్ కౌన్సెలింగ్ జరగనుంది.   సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో ప్రాసెసింగ్ ఫీజు రూపంలో ఓసీ, బీసీ విద్యార్థులు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.500 చెల్లించాలి. ఎస్టీ విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు గుజ్జనగుండ్లలోని పాలిటెక్నిక్‌లో హాజరు కావాలి.


సర్టిఫికెట్ల పరిశీలనకు వెంట తీసుకెళ్లాల్సిన ధ్రువీకరణ పత్రాలు..
 ఎంసెట్-2016 ర్యాంకు కార్డు, హాల్ టికెట్, ఇంటర్ మార్కుల జాబితా, పాస్ సర్టిఫికెట్, 6వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకూ స్టడీ సర్టిఫికెట్, టెన్త్ లేదా తత్సమాన అర్హత పరీక్ష మెమో, రెసిడెన్స్ సర్టిఫికెట్ సమర్పించాలి. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ తరువాత జారీ చేసిన ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు,  దివ్యాంగులు, ఇతర కేటగిరీలకు చెందిన వారు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను చూపాలి.


 ఆదాయ ధ్రువీకరణ పత్రం చూపితేనే ఫీజుల చెల్లింపు
 ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందగోరు విద్యార్థులు ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని విధిగా తీసుకెళ్లాలి. కుటుంబ వార్షికాదాయం రూ.లక్ష లోపు కలిగిన ఓసీ, బీసీలు, రూ.2 లక్షలకు మించని ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులు.  విద్యార్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఆయా సర్టిఫికెట్ల రెండు సెట్ల జెరాక్స్ కాపీలను వెంట తీసుకెళ్లాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించిన తరువాత ఒక సెట్ జెరాక్స్ కాపీలను తీసుకుని ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలను తిరిగి విద్యార్థులు ఇచ్చేస్తారు.

 ప్రత్యేక విభాగాలకు విజయవాడలో..  
 దివ్యాంగులు, క్యాప్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, గేమ్స్, ఆంగ్లో ఇండియన్ విభాగాలకు చెందిన విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకూ విజయవాడ బెంజ్ సర్కిల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో హాజరవ్వాలి.
 
 
నేడు ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల పరిశీలన

గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం ఒకటో ర్యాంకు నుంచి 1,200 ర్యాంకు వరకూ, నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 1,201 ర్యాంకు నుంచి 2,400 ర్యాంకు వరకూ, సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2,401 ర్యాంకు నుంచి 3,700 ర్యాంకు వరకూ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 3,701 ర్యాంకు నుంచి 5,000 ర్యాంకు వరకూ విద్యార్థులు హాజరుకావాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement