హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి
నేడు ఒకటి నుంచి 15 వేల ర్యాంకు వరకు విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన
14 నుంచి వెబ్ కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు
గుంటూరు ఎడ్యుకేషన్ : ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి శుక్రవారం నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం జిల్లాలోని నాలుగు హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కేంద్రాల పరిధిలో శుక్రవారం ఒకటో ర్యాంకు నుంచి 15 వేల ర్యాంకు వరకు సాధించిన విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈనెల 14 నుంచి వెబ్ కౌన్సెలింగ్ జరగనుంది.
నూతన విధానం అమలు..
ఎంసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఈ ఏడాది నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకుని కళాశాలలను ఎంచుకునేందుకు ఆప్షన్లు ఇచ్చుకునే సమయంలో హెల్ప్‌లైన్ కేంద్రంలో ఇచ్చే పాస్‌వర్డ్‌ను విద్యార్థులు భద్ర పరచుకోవాలి. సీట్ల కేటాయింపు తర్వాత విద్యార్థి సంబంధిత కళాశాలకు వెళ్లి రిపోర్టు చేయాల్సిన విధానం గత ఏడాది వరకు ఉండేది. తాజా మార్పుల ప్రకారం సీట్ అలాట్‌మెంట్ అయ్యాక విద్యార్థి కోరుకున్న కళాశాలలో సీటు రాని పక్షంలో తనకు ఇచ్చిన పాస్‌వర్డ్ ఆధారంగా ఆన్‌లైన్‌లో పూరించే వివరాల్లో ఆ విషయాన్ని స్పష్టం చేస్తూ రైట్ మార్క్ వేస్తే సరిపోతుంది. దీంతో తదుపరి కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చు. ఇందుకోసం వెబ్ కౌన్సెలింగ్ సమయంలో ఇచ్చే పాస్‌వర్డ్‌ను విద్యార్థులు అత్యంత గోప్యంగా ఉంచుకోవాల్సి ఉంది.
నేటి కౌన్సెలింగ్ ఇలా..
గుంటూరు గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఒకటో ర్యాంకు నుంచి 3,700 ర్యాంకు వరకు, నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 3,701 ర్యాంకు నుంచి 7,500 ర్యాంకు వరకు, సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 7,501 ర్యాంకు నుంచి 11,200 ర్యాంకు వరకు, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో 11,201 ర్యాంకు నుంచి 15,000 ర్యాంకు వరకు హాజరుకావాలి. ఎస్టీ విభాగ విద్యార్థులు తమ సర్టిఫికెట్ల పరిశీలనకు గుంటూరులో గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో హాజరుకావాల్సి ఉంది.
ఏఎన్‌యూలో..
ఏఎన్‌యూ: ఏఎన్‌యూ ఆన్‌లైన్ సెంటర్లో ఎంసెట్ విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు అన్ని ఏర్పాట్లు చేశామని ఏఎన్‌యూ ఆన్‌లైన్ కౌన్సెలింగ్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ జి. సింహాచలం, అసిస్టెంట్ కో-ఆర్డినేటర్ డాక్టర్ బి. రామచంద్రన్‌లు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యే ఓపెన్, బీసీ కేటగిరీల అభ్యర్థులు 900 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల వారు 450 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. విద్యార్థులు
పదవ తరగతి, ఇంటర్మీడియెట్ ఒరిజినల్ మార్కుల జాబితాలు, ఆరు నుంచి పదవ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, అర్హత ఉన్నవారు ఈ ఏడాది జనవరి ఒకటవ తేదీ తరువాత జారీ చేసిన ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతోపాటు ఆధార్ కార్డు , అన్ని పత్రాల ఒక సెట్ జిరాక్సు కాపీలను తప్పకుండా తెచ్చుకోవాలని సూచించారు.
ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సర్వం సిద్ధం
Published Fri, Jun 12 2015 12:57 AM | Last Updated on Sun, Sep 3 2017 3:35 AM
Advertisement
Advertisement