Inspection certificate
-
నకిలీల స్థానాల్లో కొత్తవారికి
26మంది డీ ఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన రాష్ట్ర విద్యాశాఖ నుంచి అందిన జాబితా చిత్తూరు(గిరింపేట): డీఎస్సీ-2014లో ఎస్జీటీ, లాంగ్వేజ్ పండిట్ పోస్టుల కు అర్హత సాధించిన 1,200 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను ఇటీవల విద్యాశాఖ పరిశీలించిన విషయం విధితమే. ఇందులో 26 మంది సర్టిఫికెట్లు నకిలీవని విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఆ జాబితాను రాష్ట్ర విద్యాశాఖకు పంపారు. వారు ఆ జాబితాను పక్కనబెట్టి కొత్త జాబితాను మంగళవారం రాత్రి డీఈవో కార్యాలయానికి పంపారు. ఈ క్రమంలో ఆ జాబితాలోని అభ్యర్థులు బుధవారం సాయంత్రం లోగా ఒరిజిన ల్ సర్టిఫికెట్లతో డీఈవో కార్యాలయానికి చేరుకోవాలని వారి సెల్ఫోన్లకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు సందేశం పంపారు. 26 మంది అభ్యర్థులలో ఎస్జీటీలు 18 మంది, ల్యాంగ్వేజ్ పండిట్లు(హిందీ)-01, (తెలుగు)-05, వికలాంగులు - 2 ఉన్నట్లు డీఈవో కార్యాలయ సిబ్బంది పేర్కొన్నారు. అభ్యర్థుల సర్టిఫికెట్లను డీఈవో నాగేశ్వరరావు సమక్షంలో డీఎస్సీ సెక్షన్ సూపరింటెండెంట్ పురుషోత్తం, సిబ్బంది కుమార్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. -
ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సర్వం సిద్ధం
హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి నేడు ఒకటి నుంచి 15 వేల ర్యాంకు వరకు విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన 14 నుంచి వెబ్ కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు గుంటూరు ఎడ్యుకేషన్ : ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి శుక్రవారం నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం జిల్లాలోని నాలుగు హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కేంద్రాల పరిధిలో శుక్రవారం ఒకటో ర్యాంకు నుంచి 15 వేల ర్యాంకు వరకు సాధించిన విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈనెల 14 నుంచి వెబ్ కౌన్సెలింగ్ జరగనుంది. నూతన విధానం అమలు.. ఎంసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఈ ఏడాది నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకుని కళాశాలలను ఎంచుకునేందుకు ఆప్షన్లు ఇచ్చుకునే సమయంలో హెల్ప్‌లైన్ కేంద్రంలో ఇచ్చే పాస్‌వర్డ్‌ను విద్యార్థులు భద్ర పరచుకోవాలి. సీట్ల కేటాయింపు తర్వాత విద్యార్థి సంబంధిత కళాశాలకు వెళ్లి రిపోర్టు చేయాల్సిన విధానం గత ఏడాది వరకు ఉండేది. తాజా మార్పుల ప్రకారం సీట్ అలాట్మెంట్ అయ్యాక విద్యార్థి కోరుకున్న కళాశాలలో సీటు రాని పక్షంలో తనకు ఇచ్చిన పాస్వర్డ్ ఆధారంగా ఆన్లైన్లో పూరించే వివరాల్లో ఆ విషయాన్ని స్పష్టం చేస్తూ రైట్ మార్క్ వేస్తే సరిపోతుంది. దీంతో తదుపరి కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చు. ఇందుకోసం వెబ్ కౌన్సెలింగ్ సమయంలో ఇచ్చే పాస్‌వర్డ్‌ను విద్యార్థులు అత్యంత గోప్యంగా ఉంచుకోవాల్సి ఉంది. నేటి కౌన్సెలింగ్ ఇలా.. గుంటూరు గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఒకటో ర్యాంకు నుంచి 3,700 ర్యాంకు వరకు, నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 3,701 ర్యాంకు నుంచి 7,500 ర్యాంకు వరకు, సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 7,501 ర్యాంకు నుంచి 11,200 ర్యాంకు వరకు, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో 11,201 ర్యాంకు నుంచి 15,000 ర్యాంకు వరకు హాజరుకావాలి. ఎస్టీ విభాగ విద్యార్థులు తమ సర్టిఫికెట్ల పరిశీలనకు గుంటూరులో గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో హాజరుకావాల్సి ఉంది. ఏఎన్‌యూలో.. ఏఎన్‌యూ: ఏఎన్‌యూ ఆన్లైన్ సెంటర్లో ఎంసెట్ విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు అన్ని ఏర్పాట్లు చేశామని ఏఎన్‌యూ ఆన్లైన్ కౌన్సెలింగ్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ జి. సింహాచలం, అసిస్టెంట్ కో-ఆర్డినేటర్ డాక్టర్ బి. రామచంద్రన్‌లు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యే ఓపెన్, బీసీ కేటగిరీల అభ్యర్థులు 900 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల వారు 450 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. విద్యార్థులు పదవ తరగతి, ఇంటర్మీడియెట్ ఒరిజినల్ మార్కుల జాబితాలు, ఆరు నుంచి పదవ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, అర్హత ఉన్నవారు ఈ ఏడాది జనవరి ఒకటవ తేదీ తరువాత జారీ చేసిన ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతోపాటు ఆధార్ కార్డు , అన్ని పత్రాల ఒక సెట్ జిరాక్సు కాపీలను తప్పకుండా తెచ్చుకోవాలని సూచించారు. -
గుంటూరులో రేపటి నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
విద్యానగర్(గుంటూరు): గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఈనెల 9 నుంచి 20వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన యువకులు ఈ రిక్రూట్మెంట్లో పాల్గొనవచ్చు. సర్టిఫికెట్ల పరిశీలన, దేహదారుఢ్యం, శరీరకొలతలు, పోలీస్ వెరిఫికేషన్, వైద్య, రాత పరీక్షల విధానాల ద్వారా ఈ ఎంపిక చేస్తారు. సోల్జర్ టెక్నికల్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్‌మెన్, సోల్జర్ క్లర్క్, స్టోర్‌కీపర్, టెక్నికల్ క్యాటగిరీల్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. 500 పోస్టుల భర్తీకి ఈ ర్యాలీ జరుగుతున్నట్లు రిక్రూటింగ్ డెరైక్టర్ కల్నల్ అఫ్సర్ జాఫ్రి తెలిపారు. ఏఏ విభాగాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి.. ఎలా సిద్ధపడాలి అనే విషయాలను ఇలా వివరించారు.. ఎంపికకు అవసరమైన సర్టిఫికెట్లు విద్యార్హత మార్కుల లిస్టులు, కుల ధ్రువీకరణ పత్రం, కాండక్ట్ సర్టిఫికెట్, నివాస ధ్రువీకరణ పత్రం, పుట్టినతేదీ సర్టిఫికెట్ తదితర సర్టిఫికెట్లు మండల తహశీల్దార్ సంతకంతో ఆఫీసు ముద్రతో ఉండాలి.అన్ని పత్రాలు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు, 20 పాస్‌పోర్టుసైజు ఫొటోలు వెంట తీసుకురావాలి. అన్ని సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఇంగ్లిష్‌లో ఉండాలి. అభ్యర్థులు వసతి, ఆహారం సొంతంగానే ఏర్పాటు చేసుకోవాలి. మంచినీరు తప్పనిసరిగా తెచ్చుకోవాలి. సెల్ఫోన్లు అనుమతించరు.మాజీ సైనికుల కుమారులు, యుద్ధ వితంతువుల కుమారులు, యుద్ధంలో చనిపోయినవారి కుమారులు సంబంధిత రిలేషన్ సర్టిఫికెట్లను తీసుకురావాలి.21 సంవత్సరాలలోపు వివాహం జరిగిన అభ్యర్థులు ఎంపికకు అనర్హులు.శరీరంపై పచ్చబొట్లు ఉంటే అనర్హులు. అభ్యర్థులకు పరీక్షలు ఇలా.. 1.6 కిలోమీటర్ల పరుగుపందెం 6 నిమిషాల 20 సెకన్లలోపు పూర్తి చేయాలి. అదేవిధంగా 9 అడుగుల లాంగ్‌జంప్, పుష్అప్స్ కనీసం 6 తీయాలి. ఒక కడ్డీపై నిలబడి బ్యాలెన్స్‌గా చేతులు చాపి నడవాలి. సోల్జర్ జనరల్ డ్యూటీలో 1.6 కిమీ పరుగు పందేన్ని రెండు గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూపులో 5 నిముషాల 20 సెకన్లలోపు, రెండవ గ్రూపు 6 నిముషాలలోపు పూర్తి చేయాలి. ఫిజికల్ టెస్ట్‌లో ఎంపికైనవారు అనంతరం మెడికల్, రాతపరీక్షకు హాజరవాలి. రాత పరీక్షలో సమాధానాల్లో ప్రతి తప్పునకు నాలుగవ వంతు మార్కు కట్ చేస్తారు. అభ్యర్థుల అర్హతలు సోల్జర్ టెక్నికల్ విభాగం: సైన్స్ సబ్జెక్టుతో కూడిన ఇంటర్ పాసై ఉండాలి సోల్జర్ టెక్నికల్ ఏవియేషన్: సెన్స్ సబ్జెక్టుతో కూడిన ఇంటర్. అదేవిధంగా 3 సంవత్సరాల డిప్లొమా సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ : ఇంటర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బ యాలజీలలో కనీసం 40 శాతం మార్కులతో పాసై ఉండాలి. (పై పోస్టులకు ఛాతీ 77 సెంటీ మీటర్లు కలిగి ఉండాలి. గాలి పీల్చినపుడు 5 సెంమీ వ్యాకోచం కలిగి ఉండాలి. బరువు 50 కేజీలకు పైగా, 165 సెంమీ ఎత్తు ఉండాలి. 17 సంవత్సరాల 6 నెలల నుంచి 23 సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండాలి) సోల్జర్ జనరల్ డ్యూటీ: 10వతరగతి ప్రతి సబ్జెక్టులో 33 శాతం మార్కులతో పాసై ఉండాలి. మొత్తం మార్కులలో 40 శాతం కలిగి ఉండాలి. ఎత్తు 166 సెంమీ ఎత్తు కలిగి ఉండాలి. {sేడ్మెన్: 8వ తరగతి పాసై ఉండాలి. పదవతరగతి పా సైన అభ్యర్థులకు ఇందులోనే ఉన్నత స్థానాలు కల్పిస్తారు. ఛాతీ 76 సెంటీమీటర్లు కలిగి ఉండాలి. గాలి పీల్చినపుడు 5 సెంమీ వ్యాకోచం కలిగి ఉండాలి. బరువు 48 కేజీలకు పైగా ఉండి 166 సెంమీ ఎత్తు కలిగి ఉండాలి సోల్జర్ క్లర్క్/స్టోర్ కీపర్: ఇంటర్ 40 శాతం మార్కులతో పాసై ఉండాలి. అభ్యర్థులు ఇంగ్లిష్, గణితం, అకౌంట్స్, బుక్కీపింగ్ తదితర సబ్జెక్టులలో తప్పనిసరిగా 40శాతం మార్కులు కలిగి ఉండాలి. ఛాతీ 77 సెంటీమీటర్లు ఉండాలి. గాలి పీల్చినపుడు 5 సెంమీ వ్యాకోచం కలిగి ఉండాలి. బరువు 50 కేజీలకు పైగా ఉండి 162 సెంమీ ఎత్తు తప్పనిసరిగా ఉండాలి. -
గేట్ ర్యాంక ర్లకు వెబ్ ఆప్షన్లు ప్రారంభం
రెండు రకాల జాబితాలు పంపిన జేఎన్టీయుూహెచ్ మొదటి జాబితాలో 61 ఫార్మసీ, 145 ఇంజనీరింగ్ కాలేజీలు రెండో జాబితాలో 43 ఫార్మసీ,124 ఇంజనీరింగ్ కాలేజీలు ఆప్షన్లు ఇచ్చుకోవడంలో అభ్యర్థుల అయోమయం హైదరాబాద్: గేట్/జీప్యాట్ ర్యాంకర్లకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఎట్టకేలకు శనివారం ప్రారంభమైంది. ఈనెల 6,7 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకున్న విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు ఆదివారం వరకు అవకాశం కల్పించా రు. అవసరమైన పక్షంలో గడువును పొడిగిస్తామని పీజీ ఈసెట్ అధికారులు తెలిపారు. జేఎన్టీయూహెచ్ అఫిలియేటెడ్ కళాశాలల జాబితా సకాలంలో కౌన్సెలింగ్ అధికారులకు చేరనందున ఈనెల 10 నుంచి ప్రారంభం కావాల్సిన గేట్/ జీ ప్యాట్ అభ్యర్థుల ఆప్షన్ల ప్రక్రియ వాయిదా పడింది. కాగా పీజీ ఈసెట్ ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలనకు ఇప్పటివరకు 25 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. కౌన్సెలింగ్‌కు రెండేసి జాబితాలు ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఒక్కో యూనివర్సిటీ నుంచి ఒక్కొక్క జాబితానే కౌన్సెలింగ్ అధికారులకు అందగా, జేఎన్టీయూహెచ్ రెండేసి జాబితాలను పంపడం విశేషం. పీజీ కళాశాలలకు అఫిలియేషన్ అంశంపై హైకోర్టులో కేసు నడుస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మొదటి జాబితాలో 145 ఇంజనీరింగ్, 61 ఫార్మసీ కళాశాలల పేర్లు ఉండగా, రెండవ జాబితాలో 124 ఇంజనీరింగ్, 43 ఫార్మసీ కళాశాలలున్నాయి. లోపాలున్న కళాశాలల్లో సిబ్బంది, మౌలిక వసతులపై వివరాలు ఇవ్వాలని నోటీసులు జారీచేశామని అధికారులు తెలిపారు. నివేదికలు సమర్పించేందుకు శుక్రవారంతో గడువు ముగియగా, 60 కాలేజీలే స్పందించాయి. అభ్యర్థుల అయోమయం వెబ్ కౌన్సెలింగ్‌కు జేఎన్టీయూహెచ్ పంపిన అఫిలియేటెడ్ కళాశాలల జాబితాల్లో ఎలాంటి షరతులతో అఫిలియేషన్ ఇచ్చారో అధికారులు స్పష్టంగా పేర్కొనలేదు. అంతేకాదు.. ఆయా కళాశాలల్లో అడ్మిషన్లు హైకోర్టు తీర్పునకు లోబడి ఉంటాయంటూ అభ్యర్థులకు అవగాహన నిమిత్తం కొంత సమాచారాన్ని వెబ్సైట్లో పెట్టారు. తాము ఆప్షన్లు ఇచ్చిన అన్ని కళాశాలలకు చివరి నిమిషంలో అఫిలియేషన్ రద్దు చేసినట్లైతే తమకు సీట్లు ఎలాగని అభ్యర్థులు వాపోతున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు పీజీ అడ్మిషన్ల విషయమై విద్యార్థులకు అవగాహన కల్పించే నిమిత్తం అధికారులు పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి ఈనెల 9న హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలమేరకు ఎంటెక్/ఎంఫార్మసీ కోర్సు ల్లో ప్రవేశానికై వెబ్ కౌన్సెలింగ్‌కు అఫిలియేటెడ్ కళాశాల జాబితాలను రెండేసి చొప్పు న కౌన్సెలింగ్ అధికారులకు పంపాం. జేఎన్టీయూహెచ్/ఏఐసీటీఈ ప్రమాణాల మేరకు ఆయా క ళాశాలల్లో నిర్వహిస్తున్న కోర్సులకు సంబంధించి అవసరమైన ఫ్యాకల్టీ, మౌలిక వసతుల నివేదిక ఆధారంగానే అఫిలియేషన్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం. అఫిలియేషన్ రాని కళాశాలల్లో చేరిన విద్యార్థుల విషయుంలో వర్సిటీ ఎటువంటి బాధ్యత వహించదు. ఈ మేరకు ముందుగానే అండర్‌టేకింగ్ తీసుకుంటాం.హైకోర్టు ఆదేశాల ప్రకారం కళాశాలల నుంచి సమాచారం సేకరించడంలో జాప్యం జరుగుతోంది. ఈ ఏడాది కోర్సుల నిర్వహణ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. గతంలో మాదిరిగా అకడమిక్ కేలండర్‌ను అమలు చేయడం ఈ సారి మా నియంత్రణలో లేదు. ఈ విద్యా సంవత్సరం ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సులకు సంబంధించి వెబ్ ఆప్షన్ల మేరకు సీట్ల కేటాయింపు(అలాట్మెంట్లెటర్) లను కేసు ముగిసేవరకు విత్‌హెల్డ్‌లో పెడతాం. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే అవసరమైన చర్యలు చేపడతాం. -
ప్రారంభమైన ఎంసెట్ కౌన్సెలింగ్
175 మంది సర్టిఫికెట్ల పరిశీలన మెదక్ మున్సిపాలిటీ: ఎంసెట్ 2014 కౌన్సెలింగ్ గురువారం పట్టణంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభమైంది. మొదటి రోజు ఎంసెట్ ఎంట్రెన్స్‌లో 1వ ర్యాంకు 25 వేల ర్యాంకు సాధించిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల అర్హత సర్టిఫికెట్లను పరిశీలించారు. జిల్లాలో మెదక్ తో పాటు ఈ సారి సిద్దిపేటలో కూడా కౌన్సెలింగ్ నిర్వహించడంతో విద్యార్థులు పెద్దగా హాజరు కాలేదు. మెదటి రోజు మొత్తం 86 మంది విద్యార్థులు హాజరైనట్లు ఎంసెట్ కౌన్సెలింగ్ కన్వీనర్ వెంకటరాంరెడ్డి తెలిపారు. ఈ నెల 16న 25 వేల 1వ ర్యాంకు నుండి 50 వేల ర్యాంకు వరకు సాధించిన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో పా టు రెండు జతల జిరాక్స్ పత్రాలు తీసుకుని కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని కోరారు. సిబ్బంది భవాని, కాశీనాథ్, సత్యనారాయణ, రమాదేవి, మహ్మాద్ భాన్, హమ్మద్ హుస్సేన్, టి. జయరాజ్, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నంగునూరు: నంగునూరు మండలం రాజగోపాల్‌పేటలోని పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 89 మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌లో పాల్గొనగా అధికారులు సర్టిఫికెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, ఎంసెట్ కౌన్సెలింగ్ కోఆర్డినేటర్ సీహెచ్. నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. తమ కళాశాలలో మొట్టమొదటి సారిగా విద్యార్థులు వెబ్ ఆప్షన్లు పెట్టుకొనేందుకు ఏర్పాటు చేశామన్నారు. మొదటి రోజు కౌన్సెలింగ్ నిర్వహించి సర్టిఫికెట్లను పరిశీలించామన్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో విద్యార్థులు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చని, 20 నుంచి 25 వరకు వరుసగా ఆరు రోజుల పాటు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఈ నెల 26న ఒకటో ర్యాంక్ నుంచి లక్ష వరకు, 27న లక్షా ఒకటి నుంచి ర్యాంక్ ముగిసే వరకు విద్యార్థులు వెబ్ ద్వారా ఆప్షన్లు మార్చుకోవచ్చన్నారు. ఏ కళాశాలలో సీటు అలాట్మెంట్ అయిందో ఈ నెల 30న విద్యార్థులకు సెల్‌ఫోన్ ద్వారా తెలియజేస్తామన్నారు. కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులు తమ సెల్ఫోన్లను అందుబాటులో ఉంచుకోవాలని ఆయన సూచించారు. -
ఎట్టకేలకు.. సెట్టయ్యింది!
ఎంసెట్ కౌన్సెలింగ్‌కు మోక్షం - 7 నుంచి 23 వరకు సర్టిఫికెట్ల పరిశీలన - జిల్లాలో నాలుగు హెల్ప్‌లైన్ కేంద్రాల ఏర్పాటు గుంటూరు ఎడ్యుకేషన్ :ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న విద్యార్థుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. ర్యాంకులు విడుదలై దాదాపు రెండు నెలలు గడిచిన తరువాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కౌన్సెలింగ్‌పై స్పష్టత వచ్చింది. జిల్లాలోని నాలుగు హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఈ నెల 7వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. మే 22న జరిగిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 19,250 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాలోని 47 ఇంజినీరింగ్ కళాశాలల్లో 20 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. చురుకుగా ఏర్పాట్లు.. కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం జిల్లా అధికార యంత్రాంగం చురుకుగా ఏర్పాట్లు చేస్తోంది. ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలనకు జిల్లాలో నాలుగు హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. జిల్లా కేంద్రంలో సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఈ నెల 7వ తేదీ నుంచి 23 వరకూ సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. ర్యాంకర్లు తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్లు.. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు తమ వెంట ఎంసెట్ ర్యాంకు కార్డు, హాల్ టిక్కెట్, ఇంటర్మీడియెట్ మార్కుల జాబితా కమ్ పాస్ సర్టిఫికెట్, 10వ తరగతి మార్కుల జాబితా, 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, 2014 జనవరి ఒకటో తేదీ తరువాత జారీచేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం ఒరిజినల్, జిరాక్స్ కాపీలను తీసుకెళ్లాలి. అంగవైకల్యం, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, మైనారిటీ విభాగాలకు చెందిన విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు తీసుకెళ్లాలి. సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో ప్రాసెసింగ్ ఫీజు రూపంలో ఓసీ, బీసీ విద్యార్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 300 చెల్లించాలి. ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల పరిశీలన జరిగేదిలా తేదీ ర్యాంకు (నుంచి.. వరకూ) 7న ఒకటి నుంచి 5,000 8న 5,001 నుంచి 10,000 9న 10,001 నుంచి 15,000 10న 15,001 నుంచి 20,000 11న 20,001 నుంచి 38,000 12న 38,001 నుంచి 56,000 13న 56,001 నుంచి 75,000 14న 75,001 నుంచి 90,000 16న 90,001 నుంచి 1,05,000 17న 1,05,001 నుంచి 1,20,000 18న 1,20,001 నుంచి 1,35,000 19న 1,35,001 నుంచి 1,50,000 20న 1,50,001 నుంచి 1,65,000 21న 1,65,001 నుంచి 1,80,000 22న 1,80,001 నుంచి 1,95,000 23న 1,95,001 నుంచి చివరి వరకూ -
ఎంసెట్ సర్టిఫికెట్ల పరిశీలనకు 485మంది హాజరు
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : ఎంసెట్-2013 కౌన్సెలింగ్‌లో భాగంగా స్థానిక సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం జరిగిన సర్టిఫికెట్ల పరిశీలనకు 485మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో తరలిచ్చిన విద్యార్థులతో కళాశాల ప్రాంగణం నిండిపోయింది. ఉదయం 9.00 గంటలకు ప్రారంభమైన సర్టిఫికెట్ల పరిశీలన రాత్రి 8.00 గంటల వరకు కొనసాగింది. హెల్ప్‌లైన్ కేంద్రం సమన్వయకర్త సీహెచ్ పుల్లారెడ్డి సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను పర్యవేక్షించారు. నేడు ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల పరిశీలన.. ఎంసెట్-2013 కౌన్సెలింగ్‌లో భాగంగా శనివారం సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 85,001 నుంచి 95,000 ర్యాంకు వరకు గల విద్యార్థులు హాజరుకావాలి. నేడు సర్టిఫికెట్ల పరిశీలన నిలిపివేత ఏఎన్‌యూ, న్యూస్‌లైన్: వర్సిటీ ఆన్లైన్ కౌన్సెలింగ్ కేంద్రంలో జరుగుతున్న ఎంసెట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన శనివారం నిలిపివేస్తున్నామని రిజిస్ట్రార్ ఆచార్య ఆర్ఆర్ఎల్ కాంతం తెలిపారు. సమైక్య రాష్ట్రాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వర్సిటీ అధ్యాపకులు శనివారం సామూహిక సెలవు ప్రకటించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాగా.. శుక్రవారం సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భోజన వసతిలేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవంపై సమావేశం సెప్టెంబరు 11న నిర్వహించాల్సిన వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవ ఏర్పాట్లపై వైస్‌చాన్సలర్ కె.వియన్నారావు అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించారు. సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల వ్యవస్థాపక దినోత్సవం సెప్టెంబరు 11న జరుగుతుందని ప్రకటించవద్దని, ఏర్పాట్లు మాత్రం చేయాలని నిర్ణయించారు. చివరివరకు పరిస్థితిని గమనించి నిర్వహణపై నిర్ణయం తీసుకుందామని అభిప్రాయపడ్డారు. సమావేశంలో రెక్టార్ వైపీ రామసుబ్బయ్య, రిజిస్ట్రార్ ఆర్ఆర్ఎల్ కాంతం, ఓఎస్డీ జడ్.విష్ణువర్ధన్ పాల్గొన్నారు. రేపటి ఎన్ఐఓఎస్ పరీక్ష వాయిదా గుంటూరు ఎడ్యుకేషన్: సాక్షర భారత్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 25న నిర్వహించాల్సిన అభ్యాసకుల సామర్థ్య పరీక్ష (ఎన్ఐఓఎస్)ను సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వాయిదా వేసినట్లు వయోజన విద్య ఉప సంచాలకులు జి.తారకేశ్వరరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని సాక్షరభారత్ కోఆర్డినేటర్లు గమనించాలని సూచించారు.