ఎట్టకేలకు.. సెట్టయ్యింది!
ఎంసెట్ కౌన్సెలింగ్‌కు మోక్షం
- 7 నుంచి 23 వరకు సర్టిఫికెట్ల పరిశీలన
- జిల్లాలో నాలుగు హెల్ప్‌లైన్ కేంద్రాల ఏర్పాటు
గుంటూరు ఎడ్యుకేషన్ :ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న విద్యార్థుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. ర్యాంకులు విడుదలై దాదాపు రెండు నెలలు గడిచిన తరువాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కౌన్సెలింగ్‌పై స్పష్టత వచ్చింది. జిల్లాలోని నాలుగు హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఈ నెల 7వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. మే 22న జరిగిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 19,250 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాలోని 47 ఇంజినీరింగ్ కళాశాలల్లో 20 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి.
చురుకుగా ఏర్పాట్లు..
కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం జిల్లా అధికార యంత్రాంగం చురుకుగా ఏర్పాట్లు చేస్తోంది. ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలనకు జిల్లాలో నాలుగు హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. జిల్లా కేంద్రంలో సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఈ నెల 7వ తేదీ నుంచి 23 వరకూ సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది.
ర్యాంకర్లు తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్లు.. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు తమ వెంట ఎంసెట్ ర్యాంకు కార్డు, హాల్ టిక్కెట్, ఇంటర్మీడియెట్ మార్కుల జాబితా కమ్ పాస్ సర్టిఫికెట్, 10వ తరగతి మార్కుల జాబితా, 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, 2014 జనవరి ఒకటో తేదీ తరువాత జారీచేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం ఒరిజినల్, జిరాక్స్ కాపీలను తీసుకెళ్లాలి. అంగవైకల్యం, క్యాప్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, మైనారిటీ విభాగాలకు చెందిన విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు తీసుకెళ్లాలి. సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో ప్రాసెసింగ్ ఫీజు రూపంలో ఓసీ, బీసీ విద్యార్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 300 చెల్లించాలి.
ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల పరిశీలన జరిగేదిలా
తేదీ ర్యాంకు (నుంచి.. వరకూ)
7న ఒకటి నుంచి 5,000
8న 5,001 నుంచి 10,000
9న 10,001 నుంచి 15,000
10న 15,001 నుంచి 20,000
11న 20,001 నుంచి 38,000
12న 38,001 నుంచి 56,000
13న 56,001 నుంచి 75,000
14న 75,001 నుంచి 90,000
16న 90,001 నుంచి 1,05,000
17న 1,05,001 నుంచి 1,20,000
18న 1,20,001 నుంచి 1,35,000
19న 1,35,001 నుంచి 1,50,000
20న 1,50,001 నుంచి 1,65,000
21న 1,65,001 నుంచి 1,80,000
22న 1,80,001 నుంచి 1,95,000
23న 1,95,001 నుంచి చివరి వరకూ