మాతృభాషలో ఇంజినీరింగ్ విద్య
భోపాల్: మధ్యప్రదేశ్ లోని ఓ యూనివర్సిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇంజినీరింగ్ విద్యను హిందీ మీడియంలో అందించాలని నిర్ణయించుకుంది. ఇంజినీరింగ్, మెడిసిన్ లాంటి ఉన్నత విద్యను అభ్యసించాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలో చదవాల్సిందే. మధ్యప్రదేశ్ లోని అటల్ బిహారీ వాజ్ పేయి హిందీ విశ్వ విద్యాలయ ఇంజనీరింగ్ విద్యలోని ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ బ్రాంచ్ లను హిందీ మీడియంలో అందించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతోందని, యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ మోహన్ లాల్ చిప్పా తెలిపారు.
ఇందుకు సంబంధించిన సిలబస్ ను సైతం రూపొందించామని ఆయన వెల్లడించారు. ఒక్కో బ్రాంచిలో 30 సీట్లు ఉంటాయని చెప్పారు. ఒక్క విద్యార్థి అడ్మిషన్ తీసుకున్నాసరే ఈ యేడాది నుంచే హిందీలో కోర్సులను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని వీసీ స్పష్టం చేశారు. 250 ఏళ్లుగా ఆంగ్లం ఈ దేశ విద్యావ్యవస్థను డామినేట్ చేస్తోందని స్వాంతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా కూడా ఈ దుస్ధితి మారలేదని మోహన్ లాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంగ్లీష్ వ్యామోహం నుంచి ప్రజలను బయటపడేసేందుకే తాము హిందీ మీడియంలో కోర్సును ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు. ఇజ్రాయిల్, జపాన్, చైనా, రష్యా, కొరియా, జెర్మనీ, స్వీడన్ లాంటి దేశాలు ఇప్పటికీ ఉన్నత విద్యను ప్రాంతీయ భాషలో అందిస్తున్నాయని గుర్తు చేశారు.