విద్యార్థులు కావలెను!
- ఇంజినీరింగ్ కళాశాలల్లో మందకోడిగా ప్రవేశాలు
– రెండు కళాశాలల్లో మాత్రమే వంద శాతం విద్యార్థుల చేరిక
– చాలా కళాశాలల్లో నామమాత్రంగా భర్తీ
–గతేడాదితో పోలిస్తే భారీగా తగ్గిన ప్రవేశాలు
జేఎన్‌టీయూ : ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు మందకొడిగా సాగుతున్నాయి. విద్యార్థులు లేని కళాశాలలుగా నడపాల్సిన విపత్కర పరిస్థితి నెలకొంది. విద్యార్థులు లేకపోవడంతో కొన్ని కళాశాలలు బోసిపోనున్నాయి. ఒకప్పుడు ఇంజనీరింగ్ సీట్లకు విపరీతమైన డిమాండ్ ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితులు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ , అనంతపురం పరిధిలో కొన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో మాత్రమే ప్రవేశాల జోరు కొనసాగుతోంది. మరికొన్ని కళాశాలల్లో నామమాత్రంగా సీట్ల భర్తీ అవుతున్నాయి.
100 లోపు ఇంజనీరింగ్ సీట్లు కూడా భర్తి కాని పరిస్థితి. తొలి దఫా ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు ఈ నెల 24వ తేదీతో పూర్తయింది. జేఎన్‌టీయూ పరిధిలో రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లా కలిపి మొత్తం 118 ఇంజినీరింగ్ కళాశాలలు ఉండగా, కేవలం 32 కళాశాలల్లోనే పూర్తిగా సీట్లు భర్తీ అయ్యాయి. ప్రత్యేక కేటగిరి కింద ఇంజినీరింగ్ సీట్లు కేటాయింపును వాయిదా వేశారు. దీంతో ప్రతి కళాశాలలోనూ 5 నుంచి 7 ఇంజినీరింగ్ సీట్లు త్వరలో భర్తీ చేస్తారు. ఆ లెక్కన అనంతపురం జిల్లాలో జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల, ఎస్కేయూ ఇంజనీరింగ్ కళాశాల, శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాల (ఎస్‌ఆర్‌ఐటీ , రోటరీపురం) (420 సీట్లకు గాను 413 సీట్లు భర్తీ అయ్యాయి. ), అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాలలో (420 సీట్లకు గాను 413 సీట్లు భర్తీ అయ్యాయి), ఎస్వీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో 240 సీట్లకుగాను 213 సీట్లు, తాడిపత్రి ఇంజినీరింగ్ కళాశాల 213 సీట్లకు 208 సీట్లు భర్తీ అయ్యాయి.
అనంతపురం జిల్లాలో మొత్తం 5,565 ఇంజినీరింగ్ సీట్లు ఉన్నాయి. అందులో కన్వీనర్ కోటాలో 4,187 సీట్లు అందుబాటులో ఉండగా 2,912 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 5 కళాశాలల్లో 100 లోపు సీట్లు భర్తీ అయ్యాయి. పొరుగు రాష్ట్రాల్లోని ఇంజినీరింగ్ కళాశాలల పట్ల విద్యార్థులు ఆసక్తి కనబరచడంతో సీట్లు మిగిలిపోయాయి. అంచనాలకు మించి సీట్లు మిగిలిపోవడంతో ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలకు దిక్కుతోచడం లేదు. తొలి దఫా కౌన్సెలింగ్‌లో అరకొరగా భర్తీ అయిన ఇంజినీరింగ్ సీట్లను కనీసం రెండో దఫాలోనైనా భర్తీ చేసుకోవడానికి ప్రయత్నాలు ఆయా కళాశాలల యాజమాన్యాలు ముమ్మరం చేశాయి.
కళాశాలల వారీగా ఇంజినీరింగ్ సీట్ల భర్తీ :