ప్రశాంతంగా జేఈఈ
యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్: ఐఐటీ, ఎన్‌ఐటీలలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఆదివారం తిరుపతిలో నిర్వహించిన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (జేఈఈ) ప్రశాంతం గా జరిగింది. రాయలసీమ జిల్లాలు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షలు జరిగాయి. 28 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.
ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, గాయత్రి డిగ్రీ కళాశాల, ఎమరాల్డ్స్ డిగ్రీ కళాశాల, శ్రీపద్మావతి మహిళా డిగ్రీ కళాశాల, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశ పరీక్షలు జరగడంతో టౌన్‌క్లబ్ సర్కిల్ నుంచి పద్మావతి వర్సిటీ వరకు రోడ్లు జనాలతో కిటకిటలాడాయి. పరీక్ష కేంద్రాల వద్ద సరైన సూచిక బోర్డులు లేకపోవడం, విద్యార్థులకు గైడ్ చేసే సహాయకుల సంఖ్య తక్కువగా ఉండడంతో పలువురు ఇబ్బందిపడ్డారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులంతా ఒక్కసారిగా చుట్టుముట్టడంతో వారికి సంబంధించిన గదుల కేటాయింపు బోర్డు వద్ద, లోపలికి ప్రవేశించే ద్వారం వద్ద తోపులాట జరిగింది.
90 శాతం పైగా హాజరు
జేఈఈ ప్రవేశ పరీక్షకు 90 శాతం పైగా హాజరయ్యారు. ఉదయం జరిగిన పేపర్ -1 ప్రవేశ పరీక్షకు 14,547 మంది దరఖాస్తు చేయగా 13,751 మంది హాజరయ్యారు. 95 శాతం హాజరు నమోదైంది. మధ్యాహ్నం జరిగిన పేపర్-2కు 2,515 మందికి గాను 2,285 మంది హాజరయ్యారు. ఈ పరీక్షకు 91 శాతం హాజరు నమోదైంది. ఈ ప్రవేశ పరీక్షకు శ్రీవిద్యానికేతన్ స్కూల్ ప్రిన్సిపల్ రోహిత్ పండా కో-ఆర్డినేటర్‌గా వ్యవహరించారు.