కోర్సులందు.. ఇంజనీరింగ్ కోర్సు వేరయా! | Engineering Course evergreen to choose best career for Students Career | Sakshi
Sakshi News home page

కోర్సులందు.. ఇంజనీరింగ్ కోర్సు వేరయా!

Published Fri, Jul 18 2014 12:31 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

కోర్సులందు.. ఇంజనీరింగ్ కోర్సు వేరయా! - Sakshi

కోర్సులందు.. ఇంజనీరింగ్ కోర్సు వేరయా!

నేడు సమాజంలో చక్కటి హోదా, భారీ వేతనాలు, పేరుప్రతిష్టలు సంపాదించి పెట్టే రంగాలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచీకరణ, ఆర్థిక సంస్కరణల ప్రభావం, పారిశ్రామిక అభివృద్ధితో మన నగర యువతకు ఎన్నో కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. అయితే అటు తల్లిదండ్రులకు.. ఇటు విద్యార్థులకు ఇప్పటికీ ఎవర్‌గ్రీన్ కోర్సు అంటే ముందు ఇంజనీరింగ్ అనే చెప్పాలి. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు నగర శివార్లలో దాదాపు 150కు పైగా ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి.
 
 ఇంజనీరింగ్ తర్వాత మెడిసిన్, లా, చార్టర్డ్ అకౌంటెన్సీ/కంపెనీ సెక్రటరీషిప్, బ్యాంకింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, జర్నలిజం వంటి కోర్సులు నిలుస్తున్నాయి. వీటికి సంబంధించిన కోర్సులను అందించే సంస్థలు కూడా నగరంలో కొలువుదీరాయి. ఈ నేపథ్యంలో మిగిలిన కోర్సులతో పోలిస్తే ఇంజనీరింగ్‌ను ప్రత్యేకంగా నిలుపుతున్న అంశాలేమిటి? ఇంజనీరింగ్‌కు, మిగిలిన కోర్సులకు మధ్య ఉన్న వ్యత్యాసాలు, పోలికలు ఏమిటో తెలుసుకుందాం..
 
ఇంజనీరింగ్ వర్సెస్ మెడిసిన్:
ఇంజనీరింగ్ కోర్సు వ్యవధి నాలుగేళ్లు. ఎంబీబీఎస్ కోర్సు వ్యవధి ఇంటర్న్‌షిప్‌తో కలిపి ఐదున్నరేళ్లు. మ్యాథ్స్ సూత్రాలు, భౌతిక శాస్త్ర భావనలపై పట్టు ఉండటం ఇంజనీరింగ్ ఔత్సాహి కులకు తప్పనిసరి. మానవ శరీర నిర్మాణం, వ్యాధులు, ఆధునిక చికిత్సా పద్ధతులు, వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలపై ఆసక్తి ఉన్నవారు మెడిసిన్‌ను ఎంచుకోవాలి. మూలనపడి ఉన్న యంత్రాలను సైతం బాగుచేయగల సత్తా ఇంజనీర్‌కు ఉండాలి. వ్యాధిగ్రస్తమైన శరీరాన్ని సాధారణ స్థితికి తీసుకురాగల నైపుణ్యాన్ని డాక్టర్లు పుణికి పుచ్చుకోవాలి.
 
 ఇంజనీరింగ్ - లా
 ఏదైనా గ్రూప్‌లో నిర్దేశిత మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత సాధించినవారు లాయర్ కావచ్చు. ఇందుకోసం మన రాష్ట్రంలో లాసెట్, జాతీయస్థాయిలో కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) రాయాల్సి ఉంటుంది. ఇంటర్ తర్వాత ఐదేళ్ల లా కోర్సు అందుబాటులో ఉంది. బ్యాచిలర్స్ డిగ్రీ తర్వాత మూడేళ్ల లా కోర్సు ఉంది. ఇంజనీరింగ్‌తో పోలిస్తే విస్తృత అధ్యయనం లాయర్లకు తప్పనిసరి. వివిధ కేసుల అధ్యయనం, దేశ, విదేశాల్లో ఆయా కేసుల్లో కోర్టుల తీర్పుల గురించి తెలుసుకోవాలి. ఇక ఇంజనీర్లకు సునిశిత పరిశీలన జ్ఞానం ఉండాలి. వివిధ యంత్రాలు, యంత్ర పరికరాలకు సంబంంధించిన సూక్ష్మ పరికరాలపై అవగాహన పెంచు కోవాలి. ఎన్ని కేసుల్లో విజయం సాధించారు? ఎలాంటి కేసుల్లో వాదించారు? అనే విషయాలపై లాయర్ల ప్రతిభ, సంపాదన ఆధారపడి ఉంటుంది. ఏయే కొత్త ఆవిష్కరణలు చేశారు? ప్రస్తుతమున్న టెక్నాలజీకి కొత్తగా ఎలాంటి సొబగులు అద్దారు? అనే అంశాలపై ఇంజనీర్ల కెరీర్, వేతనాలు ఆధారపడి ఉంటాయి.
 
ఇంజనీరింగ్ - చార్టర్డ్ అకౌంటెన్సీ/ కంపెనీ సెక్రటరీషిప్

 ఇంటర్‌లో ఏ గ్రూపు ఉత్తీర్ణులైనా సీఏ/సీఎస్ చేయొచ్చు. పూర్తిస్థాయిలో సీఏ/సీఎస్‌గా మారాలంటే దాదాపు నాలుగేళ్లు పడుతుంది. సీఏ, సీఎస్‌లు ఇద్దరూ వ్యాపార రంగంలో కీలకపాత్ర పోషిస్తారు. సీఏ.. కంపెనీ బ్యాలెన్స్ షీట్‌ను ఎలాంటి తప్పులు లేకుండా రూపొందిస్తాడు. కంపెనీ వ్యవహారాలు చట్టబద్ధంగా సాగడంలో సీఎస్‌దే ప్రధానపాత్ర.  పరిశోధనల్లో, యంత్రపరికరాల రూపకల్పనలో ఇంజనీర్ క్రియాశీలకంగా ఉంటాడు. సూత్రాలు/నియమాల ఆధారంగా యంత్ర నిర్మాణం, పనితీరును పరీక్షిస్తాడు. ఇక వేతనాల విషయానికొస్తే తమ రంగంలో కొత్త ఆవిష్కరణలు తక్కువ కాబట్టి చాలా మంది సీఏ/సీఎస్‌ల కెరీర్ ఎక్కువ జీతంతో ప్రారంభమై ఒక దశలో ఆగిపోతుంది. ఇంజనీర్లకు మొదట తక్కువ జీతం ఉన్నా ఆ తర్వాత పరిశోధనలు - నూతన ఆవిష్కరణలతో అత్యున్నత స్థాయికి చేరుకుంటారు.
 
ఇంజనీరింగ్ - బ్యాంకింగ్:
 ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ అభ్యసించినవారికి పీజీ స్థాయిలో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని సంస్థలు  పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి. వినియోగదారులు చేసే ప్రతి లావాదేవీలో లాభం గురించి బ్యాంకర్ ఆలోచిస్తే, ప్రతి యంత్రంతో ఉత్పత్తి పొందడానికి ఇంజనీర్ ప్రయత్నిస్తుంటాడు. ఆదాయాలు, అప్పులు, వడ్డీలు వీటికి సంబంధించిన విధులు బ్యాంకింగ్ వృత్తిలో భాగంగా ఉంటాయి. పరిశోధన, డిజైన్, అభివృద్ధి, ఆవిష్కరణలు ఇంజనీరింగ్ ప్రొఫెషన్‌లో ఉంటాయి. తను చేసిన ఆవిష్కరణకు గుర్తింపు లభిస్తే.. ఇంజనీర్ కెరీర్‌కు ఆకాశమే హద్దు. సంబంధిత ఆవిష్కరణకు పేటెంట్ హక్కులు కూడా సొంతమైతే బిలియనీర్‌గా ఎదుగుతాడు.
 
ఇంజనీరింగ్ - జర్నలిజం:
 ఇంటర్మీడియెట్‌లో ఏ గ్రూపు తీసుకున్నవారైనా జర్నలిస్ట్ కావొచ్చు. డిగ్రీ స్థాయిలో బ్యాచిలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (బీసీజే), ిపీజీలో ఎంసీజే/ఎంఏ (జర్నలిజం అండ్ మాస్‌కమ్యూనికేషన్) చేసిన వారు పాత్రికేయ రంగంలోకి అడుగు పెట్టొచ్చు. జర్నలిజంలో డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. జర్నలిస్టు ముందు కనీస అవగాహనతో తన వృత్తిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత అనుభవంతో పూర్తిస్థాయిలో పరిపూర్ణుడిగా తయారవుతాడు. కానీ ఇంజనీర్ పరిశ్రమకు అవసరమైన సాంకేతిక అంశాలను ముందే నేర్చుకుని ఉద్యోగంలో మెళకువలు తె లుసుకుంటాడు. మంచి స్టోరీలు రాయడం, ఎక్కువ మంది పాఠకులను ఆకట్టుకోవడంపై జర్నలిస్టు కెరీర్ ఆధారపడి ఉంటుంది. జనంతో మమేకమైన జర్నలిస్టులకు పేరుప్రఖ్యాతులు వచ్చినట్లే, ప్రజలకు ఉపయోగపడే టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చిన ఇంజనీర్లకు  గుర్తింపు లభిస్తుంది. జర్నలిస్టులు, ఇంజనీర్ల విజయంలో బృంద సహకారం తప్పనిసరి.  
 
ఇంజనీర్ - ఫ్యాషన్ డిజైనర్:
 ఇంటర్మీడియెట్‌లో ఏ గ్రూప్ ఉత్తీర్ణులైనా బ్యాచిలర్స్ డిగ్రీలో ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులను అభ్యసించవచ్చు. అప్పటివరకు ఉన్న ఫ్యాషన్లను తోసిరాజని  వినూత్నమైన ఫ్యాషన్ డిజైన్‌ను ఫ్యాషన్ డిజైనర్ రూపొందిస్తాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా తన ప్రతిభకు మరింత మెరుగులు దిద్దుకుంటాడు. ఇంజనీర్ కూడా ఫ్యాషన్ డిజైనర్‌లానే ఎప్పటికప్పుడు తన నైపుణ్యాలను పెంచుకుంటాడు. తద్వారా కొత్త ఆవిష్క రణలకు నాంది పలుకుతాడు. చూడగానే ఆకర్షించే ఉత్పత్తుల కోసం ఇంజనీర్లు, ఫ్యాషన్  డిజైనర్లు ప్రయత్నిస్తారు. అందులో సక్సెస్ అయిన వారికే తర్వాతి  ప్రాజెక్టు సిద్ధంగా ఉంటుంది.
 
ఇంజనీరింగ్‌తో విస్తృత అవకాశాలు!
 ‘‘భారతీయ విద్యారంగంలో.. ఇంజనీరింగ్ విద్య చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తూ.. దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తోంది. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, కంప్యూ టర్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఐటీలతోపాటు మల్టీడిసిప్లినరీ బ్రాంచ్‌లైన నానోటెక్నాలజీ,  మెకట్రానిక్స్,  ఏరోస్పేస్ ఇంజనీరింగ్, న్యూక్లియర్ ఇంజనీరింగ్ తదితర విభిన్న రంగాల్లో ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంజనీరింగ్‌లో చేరాలనుకునే విద్యార్థికి.. సమస్యను విశ్లేషించే సామర్థ్యాలుండాలి.
 
అందుబాటులో ఉన్న టెక్నాలజీ, టూల్స్‌ను వినియోగించి కొత్త ప్రొడక్ట్స్‌ను తయారు చేయగలగాలి. సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి. ఇంజనీరింగ్ విద్యార్థుల్లో సామాజిక అవగాహనను పెంచే ఉద్దేశంతో కళాశాలలు ప్రత్యేక ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగానే ఈ ఏడాది నుంచి ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులకు సొసైటీ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్(ప్రాక్టికల్)ను ప్రవేశపెడుతోంది. ఇంజనీరింగ్ అయినా ఇతర డిగ్రీ కోర్సులైనా... విద్యార్థుల్లో నైపుణ్యాలు, సామర్థ్యం, జ్ఞానం పెంచడానికి ఉద్దేశించినవే. అభిరుచి, ఆసక్తి, లక్ష్యాల ఆధారంగా తమ కెరీర్‌ను నిర్ణయించే కోర్సులను విద్యార్థులు ఎంచుకోవాలి. తమకు తగిన కోర్సును విజయవంతంగా అభ్యసించినప్పుడే బంగారు భవిష్యత్తు సొంతమవుతుంది’’    
- ప్రొఫెసర్ ఎం. వెంకట్‌దాస్,  హెచ్‌ఓడీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్,
కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఉస్మానియా యూనివర్సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement