ప్రి-ప్లేస్‌మెంట్స్‌కు ప్రిపేరవ్వండిలా! | How we can prepare for Free placements? | Sakshi
Sakshi News home page

ప్రి-ప్లేస్‌మెంట్స్‌కు ప్రిపేరవ్వండిలా!

Published Sun, Aug 31 2014 4:07 AM | Last Updated on Sat, Sep 2 2017 12:38 PM

ప్రి-ప్లేస్‌మెంట్స్‌కు ప్రిపేరవ్వండిలా!

ప్రి-ప్లేస్‌మెంట్స్‌కు ప్రిపేరవ్వండిలా!

దేశవ్యాప్తంగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)లతోపాటు ప్రముఖ బిజినెస్ స్కూళ్లలో, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రి-ప్లేస్‌మెంట్స్ సీజన్ మొదలైంది. ఈ తరుణంలో కొన్ని ముఖ్యమైన విషయాలను దృష్టిలో ఉంచుకొని తదనుగుణంగా సిద్ధమైతే ప్రి-ప్లేస్‌మెంట్ ద్వారా అవకాశం పొందొచ్చు. మన సిటీలోనూ పేరొందిన బిస్కూల్స్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్లేస్‌మెంట్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. విద్యార్థులు ప్రధానంగా దృష్టిసారించాల్సిన అంశాలేవో తె లుసుకుందాం..
 
 ప్రి-ప్లేస్‌మెంట్స్‌కు సిద్ధమయ్యే క్రమంలో.. ఏ విభాగంలోకి అడుగుపెట్టాలనుకుంటున్నారు? జాబ్ ప్రొఫైల్, వేతన ప్యాకేజీ వంటి వాటి గురించి   తెలుసుకోవాలి. ప్లేస్‌మెంట్స్‌లో స్థానం పదిలం చేసుకోవాలంటే.. ఉత్తమమైన మార్గం.. యాక్టివ్ ప్రిపరేషన్. కోర్ కాన్సెప్ట్‌లపై దృష్టిపెట్టాలి. గ్రూప్ డిస్కషన్లు, మాక్ ఇంటర్వ్యూలను సాధన చేయాలి. అసలైన మౌఖిక పరీక్షలో విజయానికి ఇవి ఉపయోగపడతాయి. సబ్జెక్టు పరిజ్ఞానంతోపాటు సమకాలీన అంశాలపై పట్టు పెంచుకోవాలి.
 
 ముఖ్యమైన నాలుగు దశలు..
 ప్రి-ప్లేస్‌మెంట్ ప్రక్రియను సాధారణంగా నాలుగు విధాలుగా వర్గీకరించొచ్చు. అవి..ప్రభావవంతమైన కరిక్యులమ్ విటేను తయారు చేసుకోవడం; దరఖాస్తు చేసుకోవడంతోపాటు ఇంటర్వ్యూకు ప్రిపేర్ కావడం; ఇంటర్వ్యూను ఎదుర్కోవడం; అంతిమంగా ఇంటర్న్‌షిప్‌లో చేరడం! ఇంటర్న్‌షిప్‌లో మంచి పనితీరును ప్రదర్శించి, యాజమాన్యాన్ని ఆకట్టుకుంటే ప్రి-ప్లేస్‌మెంట్ ఆఫర్ పొంది, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ప్రక్రియను ఎదుర్కొనే అవసరం లేకుండా కోర్సు పూర్తికాగానే అదే సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది.   ఇష్టమైన కొలువును సొంతం చేసుకోవాలంటే.. అభ్యర్థులు శ్రమించక తప్పదు.
 
 సీవీ.. సులభం కాదు
 ప్రభావవంతమైన కరిక్యులమ్ విటే(సీవీ)ను తయారు చేసుకోవడం అనుకున్నంత సులభం కాదు. ఈ విషయంలో కాలేజీలో సీనియర్ల సలహాలు తీసుకోవాలి. సీవీలో రాసే ప్రతి పదానికి ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి అప్రమత్తత అవసరం. అభ్యర్థులు తమ నైపుణ్యాలు, అర్హతలను అందులో చక్కగా పొందుపర్చాలి. వ్యాకరణ దోషాలు, అక్షర దోషాలు లేకుండా ఒకటికి రెండుసార్లు క్షుణ్నంగా సరిచూసుకోవాలి.  రిక్రూటర్ దృష్టిని ఆకర్షించేలా సీవీని తీర్చిదిద్దుకోవాలి.
 
 దరఖాస్తు, ఇంటర్వ్యూ ప్రిపరేషన్
 సీవీ తయారు చేసుకున్న తర్వాతి దశ దరఖాస్తు చేసుకోవడం, ఇంటర్వ్యూకు సిద్ధం కావడం. సంస్థకు దర ఖాస్తు పంపిన తర్వాత ఇంటర్వ్యూ సాధన ప్రారంభించాలి. ముఖ్యంగా రెండు సెక్టార్లపై ఫోకస్ చేయడం మంచిది. అన్నింటిపై దృష్టిపెడితే దేనికీ సరైన న్యాయం చేయలేరు. సదరు సెక్టార్/కంపెనీలో ఇప్పటికే పనిచేస్తున్న సీనియర్లను సంప్రదించాలి. జాబ్ ప్రొఫైల్, యాజమాన్యం ఆకాంక్షలు, ఇంటర్వ్యూ ప్రక్రియ గురించి తెలుసుకోవాలి. తదనుగుణంగా ఇంటర్వ్యూకు సిద్ధం కావాలి. మౌఖిక పరీక్షలో ఏయే అంశాలను ప్రస్తావిస్తారో గుర్తించి, వాటిని సాధన చేయాలి. కంపెనీ గురించి ముందుగానే వివరాలు తెలుసుకోవాలి. మౌఖిక పరీక్ష విషయంలో ఇతరుల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. వారు చేసిన తప్పులు చేయకుండా అభ్యర్థులు జాగ్రత్తపడాలి. ఇంటర్వ్యూకు ప్రిపేర్ కావడం అంటే.. సిలబస్‌లోని సబ్జెక్టు అంశాలతో కుస్తీ పట్టడం మాత్రమే కాదని తెలుసుకోవాలి.
 
 ఇంటర్న్‌షిప్‌లో ప్రతిభ చూపాలి
 అభ్యర్థులు పూర్తి ఆత్మవిశ్వాసంతో గ్రూప్ డిస్కషన్‌కు, ఇంటర్వ్యూకు హాజరు కావాలి. రిక్రూటర్ అడిగే ప్రశ్నలకు నిజాయతీగా సమాధానాలు ఇవ్వాలి. ఇంటర్వ్యూ బోర్డును మెప్పిస్తే ఇంటర్న్‌షిప్‌లో చేరేందుకు అవకాశం లభిస్తుంది. ఇంటర్న్‌షిప్‌లో చేరడానికంటే ముందు గతేడాది అక్కడ పనిచేసిన సీనియర్లను సంప్రదించి వారి సూచనలు తీసుకోవాలి. ప్రాజెక్ట్ వివరాలు, అక్కడి పని వాతావరణం, ఉద్యోగుల పనితీరును యాజమాన్యం అంచనా వేసే విధానం..  తదితర విషయాలపై అవగాహన పెంచుకోవాలి.  ఎంబీఏలో, ఇంజనీరింగ్‌లో ఉండగా నిర్మాణాత్మకమైన ఇంటర్న్‌షిప్, కార్పొరేట్ ప్రాజెక్ట్‌లను విజయవంతంగా పూర్తిచేస్తే అభ్యర్థులకు కోర్సు తర్వాత కొలువు తప్పనిసరిగా లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement