డొనేషన్ల దందా!
- ఇంజినీరింగ్ సీట్లు మరింత ప్రియం
- కొన్ని కాలేజీల ఇష్టారాజ్యం
- కోర్సుల బట్టి వసూలు
- లక్షన్నర నుంచి రూ. 3 లక్షల వరకు డిమాండ్
- అదనపు ఫీజులు మరింత భారం
జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలలు: 20
మొత్తం సీట్లు: 18,000
సాక్షి ప్రతినిధి, కర్నూలు ఇంజినీరింగ్..ఎంపీసీ చదివిన ప్రతి విద్యార్థి కల. ఈ కలను కొన్ని ఇంజినీరింగ్ కళాశాలలు డబ్బు పెట్టి కొనుక్కోమంటున్నాయి. ఇష్టానుసారంగా డోషన్ ఫీజులు వసూలు చేస్తూ దందాకు తెరలేపాయి. కౌన్సెలింగ్‌లో ఇంకా సీట్ల కేటాయింపు పూర్తి కాకముందే ఈ వ్యవహారం జిల్లాలో తారాస్థాయికి చేరింది. అయినా సాంకేతిక విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
జిల్లాలో కొన్ని ఇంజినీరింగ్ కాలేజీలు డోనేషన్ల దందా నడుపుతున్నాయి. డిమాండ్ ఉన్న కోర్సులకు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఈసీఈ, కంప్యూటర్ సైన్స్ వంటి కోర్సులవైపు విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ కోర్సులకు లక్షన్నర రూపాయల నుంచి రూ.3 లక్షల వరకూ ఇవ్వాలని పట్టుబడుతున్నాయి. లేనిపక్షంలో సీటు లేదని ఖరాఖండిగా తేల్చిచెబుతున్నాయి. అయితే, సివిల్, మెకానికల్ వంటి కోర్సులకు మాత్రం కేవలం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు మేరకు ఇస్తే చాలు సీటు ఇస్తామని ఆఫర్ ఇస్తున్నాయి. విద్యార్థులు మాత్రం మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ఈసీఈ, కంప్యూటర్ సైన్స్ కోర్సులనే కోరుకుంటున్నారు. ఇదే అదునుగా కాలేజీలు దండుకునే కార్యక్రమానికి తెరలేపాయని తెలుస్తోంది. వీటికితోడుగా స్పెషల్ ఫీజులు, ప్లేస్‌మెంట్ ఫీజులు, బస్సు ఫీజుల పేరుతో అదనపు మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. ఈ మొత్తానికి ఎటువంటి రశీదు లేకుండా కేవలం నగదు రూపంలో మాత్రమే చెల్లించాలని కాలేజీలు షరతు విధిస్తుండటం గమనార్హం.
పర్యవేక్షణేదీ?
వాస్తవానికి ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్ ద్వారానే జరగాల్సి ఉంటుంది. అయితే, ఇందుకు భిన్నంగా జిల్లాలో మంచి పేరు ఉన్న కాలేజీ యాజమాన్యాలు డిమాండ్ ఉన్న కోర్సులకు డోనేషన్లను వసూలు చేస్తున్నాయి. డబ్బులు ఉన్న పిల్లలు మాత్రం మంచి కాలేజీల్లో మంచి కోర్సులల్లో చేరుతుండగా... అంత మొత్తం చెల్లించలేని వారు మాములు కాలేజీలల్లో మాములు కోర్సులల్లో చేరాల్సి వస్తోంది. ఈ డోనేషన్లకు తోడుగా ప్రత్యేక ఫీజుల మోత కూడా విద్యార్థులపై అదనపు భారం పడుతోంది. అయితే, ఈ మొత్తాన్ని పర్యవేక్షించడంలో సాంకేతిక విద్యాశాఖ అధికారులు విఫలమవుతున్నాయి. దీంతో కాలేజీలు ఆడిందే ఆటగా...పాడిందే పాటగా వ్యవహారం నడుస్తోంది.
అదనపుæ ఫీజుల మోత
ఒకవైపు డోనేషన్లతో విద్యార్థుల నడ్డి విరుస్తున్న కాలేజీ యాజమాన్యాలు... అదనపు ఫీజుల పేరుతో మరింత అడ్డంగా దోచేస్తున్నారు. ప్లేస్‌మెంట్ ఫీజుల పేరుతో రూ.3 వేల నుంచి రూ.2 వేల వరకూ వసూలు చేస్తున్నాయి. అదేవిధంగా స్పెషల్ ఫీజు పేరుతో రూ.3 వేల వరకూ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో ఈ ఫీజులు మరింత పెంచినట్టు తెలుస్తోంది. ఇక కాలేజీలకు బస్సుల్లో వెళ్లే విద్యార్థులపై కూడా అదనపు భారం పడుతోంది.
బస్సు ఫీజులను కూడా ఈ ఏడాది మరింత పెంచేశారు. అయితే, ఈ మొత్తాలను మాత్రం ఆన్‌లైన్‌లోనో, డిమాండ్ డ్రాఫ్టు/చలాన్ రూపంలో కాకుండా నేరుగా నగదు రూపంలో చెల్లించాలని పేర్కొంటున్నాయి. తద్వారా ఈ లెక్కలను ఆడిట్ సమయంలో సరిగ్గా చూయించడం లేదని తెలుస్తోంది. ఈ మొత్తాలను అదనంగా విద్యార్థుల నుంచి వసూలు చేసి లెక్కల్లో చూపడం లేదని సమాచారం. మొత్తం మీద ఇంజనీరింగ్ విద్యకు పెద్దగా డిమాండ్ లేని సమయంలో కూడా డిమాండ్ ఉన్న కోర్సుల నుంచి డోనేషన్లు వసూలు చేయడం గమనార్హం.