కోడింగ్‌లో కిక్ లేదని | Did not kick coding | Sakshi
Sakshi News home page

కోడింగ్‌లో కిక్ లేదని

Published Thu, Jan 8 2015 12:07 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

కోడింగ్‌లో కిక్ లేదని - Sakshi

కోడింగ్‌లో కిక్ లేదని

వినీత త్యాగి చదివింది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. హైదరాబాద్‌లో కార్పొరేట్ ఉద్యోగం. కోడింగ్‌లో కిక్ లేదని మూడేళ్లుగా చేస్తున్న ఉద్యోగాన్ని పక్కన పెట్టి కలం పట్టింది. మర్డర్ మిస్టరీని కథాంశంగా ఎంచుకుని తొలి నవలను సక్సెస్‌ఫుల్‌గా విడుదల చేసింది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ వెనకున్న మిస్టరీ ఏంటో ఆమె మాట ల్లోనే తెలుసుకుందాం.
 ..:: కళ
 
చిన్నప్పటి నుంచి డైరీ రాయడం అలవాటు. చిన్న చిన్న కథలు కూడా రాసేదాన్ని. భోపాల్ ఎన్‌ఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాను. పేరెంట్స్ ఒత్తిడితో ఇంజనీరింగ్ చదవాల్సి వచ్చింది. ఇండియాలో కెరీర్ అంటే ఇంజనీర్, డాక్టర్.. ఇవే కదా! ఇంజనీరింగ్ తర్వాత  క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో హైదరాబాద్‌లోని డెలాయిట్ ఫోరెన్సిక్‌లో జాబ్ వచ్చింది. తర్వాత ఒరాకిల్‌కి మారాను. మా పేరెంట్స్ దిల్లీలో ఉంటారు.
 
మూడుసార్లు ప్రయత్నించా..


రాబర్ట్ లుడ్లుమ్ మిస్టరీ నవలలు బాగా చదివేదాన్ని. ఆఫ్ ట్రాక్ రాయడానికి అదీ ప్రేరణ అయి ఉండవచ్చు. చిన్నప్పుడు ఫాంటసీ, కాస్త పెద్దయ్యాక రొమాన్స్, జాబ్ చేస్తున్నప్పుడు మరో అంశం.. ఇలా మూడుసార్లు ఏదైనా నవల రాయాలని ప్రయత్నించాను. అయితే కాస్త రాశాక అవి ఎగ్జైటింగ్‌గా అనిపించలేదు. రాసేవాళ్లు ఎంజాయ్ చేయకపోతే.. చదివేవాళ్లు మాత్రం ఏం ఎంజాయ్ చేస్తారు. అందుకే రాయడం ఆపేశాను.
 
డైరీ రాయమంటే..

అనుకోకుండా ఎదురైన ఓ చేదు సంఘటన నా జీవితాన్ని డిస్ట్రబ్ చేసింది. నాకు ఎక్కువగా మాట్లాడటం అలవాటు లేదు. నా మనసు తేలిక చేసుకోవడానికి డైరీ రాయమని ఓ ఫ్రెండ్ సలహా ఇచ్చింది. కానీ నేను డైరీ రాయలేదు. ఫోరెన్సిక్‌లో చేస్తున్నప్పుడు జరిగిన విషయాల ఆధారంగా ఏదైనా రాయాలనే ఆలోచన ఉండేది. దానిని పేపర్‌పై పెట్టడం ప్రారంభించాను. ఈ నవల రాయడం అలా మొదలైంది.
 
నా టైం లాగేసుకుంది..

ఇందులోని క్యారెక్టర్స్ కొన్ని కల్పితమైతే, రియల్ లైఫ్‌లో తారసపడ్డవీ కొన్ని ఉన్నాయి. పగలంతా క్యారెక్టర్స్, సీన్లు, స్టోరీలో చాప్టర్స్ ఇలా ఆలోచించేదాన్ని. రాత్రి అందరూ పడుకున్నాక రాసేదాన్ని. రాస్తున్నప్పుడు ఆలోచనలు మారిపోయేవి. మేల్, ఫిమేల్ క్యారెక్టర్లను వారి పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించే ప్రయత్నం చేశాను. ఈ బుక్ నా పర్సనల్ టైం చాలా లాగేసుకుందని చెప్పాలి. ఫస్ట్‌టైం రైటర్స్ అందరికీ ఇలా జరుగుతుందనుకుంటా. చాప్టర్ వైజ్‌గా డివైడ్ చేసి ప్లాన్ ప్రకారం చేసి రాయలేదు. అనుకున్నది అనుకున్నట్టు పేపర్ మీద పెట్టాను.
 
ఇదీ కథ..

కథ గురించి చెప్పాలంటే.. ఫోరెన్సిక్ డేటా అనలిస్ట్ నతాషా రాయ్. ఆమె ప్రేమించిన నీల్‌ని హత్యకు గురవుతాడు. సింపుల్‌గా కనిపిస్తున్న ఈ మర్డర్ మిస్టరీని ఛేదించేందుకు నతాషానే ప్రయత్నించినప్పుడు ఆమె తెలుసుకునే షాకింగ్ విషయాలే అసలు కథ.
 
అందుకే పబ్లిష్ చేశా..

పబ్లిష్ చేయాలనే ఆలోచనతో ఆఫ్ ట్రాక్ రాయలేదు. నా మనసులో మెదిలిన కథకు ఓ రూపమిచ్చానంతే. దీనిలో పబ్లిష్ చేసేంత పస ఉందా అని తెలుసుకోవడానికి రైటర్ దీపక్ రానాకు చూపించాను. ఆయన చూసి కథ, కథనంలో పొటెన్షియల్ ఉందన్నారు. ఆయన అంత మంచి రివ్యూ ఇచ్చేసరికి పబ్లిష్ చేయాలనుకున్నాను. బుక్‌లో అడల్ట్ కంటెంట్ ఉంది. దీన్ని చదివిన మా ఇంట్లోవాళ్లు కాస్త ఇబ్బందిపడ్డా, అన్ని ఎలిమెంట్స్ బాగా కుదిరాయని మెచ్చుకున్నారు.
 
రణ్‌వీర్ అయితే ఓకే..

చాలామంది నా ఫ్రెండ్స్ ఈ పుస్తకం చదివి దీన్ని సినిమా తీస్తే బాగుంటుందన్నారు. హీరో ఎవరైనా, ఈ కథ ప్రకారం గుండు చేయించుకోవాలి. అయితే ఆ క్యారెక్టర్ ఎవరు వేయాలంటే మాత్రం ఆలోచించాల్సిందే. ఇందులో హీరో పేరు రణవీర్.. సో హీరోగా రణ్‌వీర్‌సింగ్ అయితే బాగుంటుందనుకుంటున్నాను.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement