
చిత్తూరు : చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఓ ఇంజినీర్‌ను దుండగులు దారుణంగా హత్య చేసి ఇంటిని దోచుకున్నారు. మున్సిపాలిటీ ఇంజినీర్ రామనాధ (28)ను దుండగులు హత్య చేసి ఆయన మెడలోని చైన్ తోపాటు 4 తులాల బంగారం, రూ.10 వేల నగదు దోచుకెళ్లారు. తంబళ్లపల్లె మండలం రేణుమాకులపల్లి పంచాయతీ తిమ్మయ్యగారిపల్లికు చెందిన కందల నరసింహులు రెండవ కుమారుడు కందల రామనాధ మదనపల్లె పట్డణం గొల్లపల్లి సిమెంట్ రోడ్డులో సొంతిల్లు తీసుకుని నివాసం ఉంటున్నారు. రామనాధ భార్య మదనపల్లి విశ్వకిరణ్ ఆర్థో ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఐదుగురు దుండగులు శనివారం వేకువజామున ఇంటిలోకి చొరబడి తన భర్తను చంపారని రామనాధ భార్య పోలీసులకు తెలిపింది. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి వుంది. సంఘటన స్థలాన్ని సీఐ సురేష్ కుమార్, ఎస్ఐ నాగేశ్వరరావు పరిశీలించారు.