ఈ నగరానికేమయింది...
ఆధ్యాత్మిక కోటలో అలజడి
ఆందోళన కలిగిస్తున్న హత్యలు
యథేచ్ఛగా దొంగతనాలు... రౌడీయిజం
బెంబేలెత్తిస్తున్న కిడ్నాపర్ల ఆగడాలు
మహిళలకు పగలే కరువైన రక్షణ
వాడవాడలా విజృంభిస్తున్న వ్యభిచారం
తిరుపతి ఆధ్యాత్మిక నగరంగానూ, ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగానూ అందరికీ పరిచయమే. ఒకప్పుడు ఇక్కడ ఎక్కడా లభించని ప్రశాంతత, ఆనందం దక్కేవి. వాడవాడలా గోవింద నామస్మరణే. తండోప తండాలుగా కొండపైకి తరలి వెళ్లే భక్తుల సందడి...వీనుల విందుగా తన్మయత్వానికి గురిచేసే మంగళ వాయిద్యాల హోరు. బస్టాండ్‌లో దిగింది మొదలు...ఎటు చూసినా కల్మషం లేని మనుషులు, స్వార్థం ఎరుగని అధికారులతో నగర వాతావరణం ప్రశాంతతకు పట్టుగొమ్మగా ఉండేది. ఇప్పుడు ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఏడాది కాలంగా నేరాలు పెరిగాయి. రౌడీయిజం, దొంగతనాలు, కిడ్నాప్‌లు, ఆస్తి గొడవలు, వరకట్నపు చావులు పోలీసులకు సవాల్‌గా మారాయి. ఇటీవల పెరిగిన హత్యోదంతాలు, హత్యాయత్నాలు నగర ప్రజానీకాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. శాంతి భద్రతలు పూర్తిగా గాడి తప్పాయి. పోలీసులు ఉన్నా లేనట్లేనన్న భావన కనిపిస్తోంది. కారణాలు ఏమైనప్పటికీ పెరిగిన నేర ప్రవత్తి నగర జీవనాన్ని అతలాకుతలం చేస్తోంది.
తిరుపతి/తిరుపతి క్రైం : రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్లపై నడుస్తుందన్న సామెత తిరుపతిని చూస్తే నిజమన్న భావన కలుగుతోంది. ఇక్కడున్న పోలీస్ వ్యవస్థలో సరైన ప్రణాళికలు కొరవడం, నిబద్ధత లోపించడం, భయపెట్టే తత్వం తగ్గడం వంటివి శాంతిభద్రల విఘాతానికి కారణంగా కనిపిస్తోంది. దీన్ని అలుసుగానూ, అదునుగానూ తీసుకున్న నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. కళ్లాలు లేని గుర్రాల్లా నేర సామ్రాజ్యంలో పరుగులు తీస్తున్నా రు. విలాసాల మోజులో ఇష్టారాజ్యంగా అక్రమార్జనకు పాల్పడుతున్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్ల సెంటర్లలో మెల్లమెల్లగా రౌడీయిజం పెరుగుతోంది. యువకులు రోడ్లపైనే మద్యం సేవిస్తూ నిమ్మకాయల వీధిలో గొడవలు పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను బెదిరించే చోటా మోటా నేరగాళ్లకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. తుడా కార్యాలయం పక్కనే ఉన్న మార్కెట్ ప్రాంతంలోనూ రాత్రిళ్లు రౌడీల ఆగడాలు పెరుగుతున్నాయి. వీరి తీరుకు రైతులు బెంబేలెత్తిపోతున్నారు. శివారు ప్రాంతాల్లో భూ ఆక్రమణలకు అంతు లేకుండా పోతుంది. ఉన్న కొద్దిపాటి జాగాను కోల్పోయిన సామాన్యుడిది అరణ్య రోదనవుతోంది. భక్తులను ఏమార్చి బ్యాగులతో పరారయ్యే చిన్నచిన్న దొంగలు రాత్రిళ్లు చోరీలకు పాల్పడుతున్నారు. ఇటీవల శ్రీదేవీ కాంప్లెక్సు, హరేరామ హరేకృష్ణ ఆలయాల సమీపంలో దొంగతనాలు జరిగాయి. నగరంలో హత్యలు పెరిగాయి. నాలుగు రోజుల కిందట తిరుపతి రూరల్ పరిధిలోని సీ మల్లవరంలో భార్య తల నరికిన ఉదం తం గగుర్భాటుకు గురిచేసింది. దీన్ని మరవక ముందే బుధవారం నగరంలోని అబ్బన్నకాలనీలో మరో దారుణం జరిగింది. ఉన్మాదిగా మారిన సాత్విక్‌కుమార్ భార్య, కుమార్తెలపై కత్తితో దాడిచేశాడు. గురువారం అలిపిరి బస్టాండ్ దగ్గర మరో హత్య వెలుగు చూసింది.
కలవరపెడుతున్న కిడ్నాప్‌లు..
నగరంలో వేళ్లూనుకుంటున్న కిడ్నాప్‌లు జనాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. పల్లెవీధిలోని ఓ ఫైనాన్స్‌ర్‌ను తమిళనాడుకు చెందిన ముఠాతో కలిసి స్థానికులు కిడ్నాప్‌నకు పాల్పడి రూ.2 కోట్లు డిమాండ్ చేశారు. విచ్చలవిడిగా తిరుగుతున్న కిడ్నాపర్లు అమాయకుల అప్రమత్తంగా లేని సమయంలో పిల్లల్ని సైతం కిడ్నాప్ చేస్తున్నారు. వారం కిందట తిరుమలలో జరిగిన బాలిక నవ్యశ్రీ ఉదంతమే ఇందుకు నిదర్శనం. పోలీసులు నేరస్థులను అరెస్టు చేసినప్పటికీ ప్రజల్లోని భయాందోళనలను మాత్రం తొలగించలేకపోయారు.
విస్తరిస్తున్న వ్యభిచారం..
పవిత్రతకు నెలవైన నగరంలో వ్యభిచారం వేళ్లూనుకుంటోంది. కీలక ప్రాంతాల్లోనూ, కొన్ని లాడ్జీల్లోనూ హైటెక్ వ్యభిచారం విస్మయాన్ని కలిగి స్తోంది. బెంగళూర్, చెన్నై, పూనే ప్రాంతాల నుంచి యువతులను రప్పించి యువతకు ఎర వేసే బ్రోకర్లు పెరిగారు. వరకట్న వేధింపులు, గల్ఫ్ మోసాలు కూడా బయటపడుతున్నాయి. అమాయకులు రోడ్లపాలై గగ్గోలు పెడుతున్నారు. పోలీసు స్టేషన్ల చుట్టూ తిరిగి విసిగిపోతున్న జనం గోడు పట్టించుకున్న వారే కరువయ్యారు. స్పెషల్ బ్రాంచి అధికారులు కూడా పట్టించుకోవడంలేదు.
బందోబస్తు డ్యూటీలే ఎక్కువ..
తిరుపతి అర్బన్ పరిధిలోని పోలీసులకు, అధికారులకు బందోబస్తు డ్యూటీలు, ప్రోటోకాల్ విధులే ఎక్కువగా ఉంటున్నాయి. ప్రధానమైన ఈవెంట్లు తిరుపతిలోనే జరుగుతుండటంతో ఆయా కార్యక్రమాలకు హాజర య్యే వీవీఐపీలకు బందోబస్తు నిర్వహించడంతోనే పోలీసులకు సరిపోతుంది. నేరాలను ముందే పసిగట్టి, నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకునే వెసులుబాటే ఉండటం లేదు. దీంతో నేరాల సంఖ్య పెరుగుతోంది.