ఇంజనీరింగ్‌లో.. అమ్మాయిలు | Focus on Engineering Course | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌లో.. అమ్మాయిలు

Published Wed, May 11 2016 12:26 AM | Last Updated on Sun, Sep 3 2017 11:48 PM

ఇంజనీరింగ్‌లో.. అమ్మాయిలు

ఇంజనీరింగ్‌లో.. అమ్మాయిలు

టాప్ స్టోరీ
 పాలిసెట్‌లో అమ్మాయిలకు మంచి ర్యాంకులు.. ఎంసెట్ ఫలితాల్లో పెరిగిన అమ్మాయిల ఉత్తీర్ణత శాతం.. జేఈఈ మెయిన్‌లో రాణించిన అమ్మాయిలు..ఇవి ఇంజనీరింగ్, టెక్నికల్ కోర్సుల వైపు అమ్మాయిలు మొగ్గుచూపుతున్నారనడానికి నిదర్శనం! ఒకప్పుడు ఇంజనీరింగ్ కోర్సులంటే.. అబ్బాయిలే కింగ్‌లు..ఆ ట్రెండ్ మారింది.. నేడు మేము సైతం అంటూ అమ్మాయిలు దూసుకుపోతున్నారు! ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత.. కోర్సులో అకడమిక్‌గా  రాణించడం.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో విజయం సాధించే దశ వరకు అమ్మాయిలు దీటుగా ముందడుగు వేస్తున్నారు.
 
 త్వరలో ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. అమ్మాయిలు కోరుకుంటున్న బ్రాంచ్‌లు.. కెరీర్ అవకాశాలపై ఫోకస్..
 
  జాతీయస్థాయిలో మెరుగవుతున్న తీరు
 ఇటీవల కాలంలో సాంకేతిక విద్యా సంస్థల్లో మహిళల సంఖ్య ఏటా క్రమేణా పెరుగుతోంది.  పదేళ్ల క్రితం వరకు ఇంజనీరింగ్ అంటే అబ్బాయిలే అనే భావన ఉండేది. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. బీటెక్ కోర్సుల్లో అమ్మాయిలు అబ్బాయిలకు దీటుగా పోటీపడుతున్నారు. జాతీయస్థాయిలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో గత ఐదేళ్ల కాలంలో పురుషులు, మహిళల మధ్య నిష్పత్తి పరంగా వ్యత్యాసం తగ్గుతుండటం విశేషం. 2005 నుంచి 2010 వరకు ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌లలో పురుషులు-మహిళల నిష్పత్తి సగటున 10:1గా ఉండగా.. ఆ తర్వాత కాలంలో ఆ నిష్పత్తి 7:1కు చేరడమే ఇంజనీరింగ్‌లో అమ్మాయిల సంఖ్య పెరుగుతోందనడానికి నిదర్శనం.  
 
 ప్రోత్సాహంతో ఉత్సాహంగా
 ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో అమ్మాయిలు చేరేలా ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్, సైన్స్ వంటి కోర్సుల్లో ప్రత్యేక స్కాలర్‌షిప్స్;  మేనేజ్‌మెంట్ కోర్సుల్లో జండర్ డైవర్సిటీ వెయిటేజీ  పేరిట ప్రత్యేక విధానాలు అమలు  చేస్తుండటం అమ్మాయిలు ఆయా కోర్సుల్లో చేరేలా ప్రోత్సాహాన్ని ఇస్తోంది. అంతేకాకుండా 33శాతం రిజర్వేషన్ విధానం కూడా ఇంజనీరింగ్ వంటి సాంకేతిక విద్యా కోర్సుల్లో మహిళల సంఖ్య క్రమేణా పెరగడానికి తోడ్పడుతోంది.  తల్లిదండ్రుల నుంచి లభిస్తున్న మద్దతు కూడా అమ్మాయిలు ప్రొఫెషనల్ కోర్సుల్లో దూసుకుపోయేలా చేస్తోంది.
 
 కొన్ని బ్రాంచ్‌లపై ఆసక్తి
 బీటెక్ దిశగా అడుగులు వేస్తున్న విద్యార్థినులు కొన్ని బ్రాంచ్‌లపైనే ఆసక్తి చూపుతున్నారు. సీఎస్‌ఈ, ఈసీఈ, కెమికల్ ఇంజనీరింగ్, ఐటీ వంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ బ్రాంచ్‌లనే తమ తొలి ప్రాథమ్యాలుగా పేర్కొంటున్నారు. వీటి ద్వారా కెరీర్ పరంగానూ మంచి జాబ్స్ లభిస్తాయని, కార్యాలయం దాటి బయటకు వచ్చే అవసరం లేకుండానే విధులు నిర్వహించొచ్చని ఆశిస్తున్నారు. గత ఐదేళ్లుగా ఐఐటీల నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ వరకు అమ్మాయిలు ఎంపిక చేసుకున్న బ్రాంచ్‌ల ఆధారంగా ఇది ప్రస్ఫుటమవుతోంది. సీఎస్‌ఈ, ఈసీఈ, కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల ద్వారా మంచి జీతభత్యాలు అందే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ల్యాబ్ ఎక్స్‌పరిమెంట్ సంబంధిత ఉద్యోగాలు పొందొచ్చు అనే అభిప్రాయం నెలకొంది. అందుకే ఎక్కువ శాతం ఈ బ్రాంచ్‌లకు ఓటేస్తున్నారు.
 
 కోర్ బ్రాంచ్‌లపై అనాసక్తి
 కోర్ బ్రాంచ్‌లైన సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ వంటి బ్రాంచ్‌లలో చేరేందుకు అమ్మాయిలు నేటికీ అంతగా ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయం ఉంది. సివిల్ ఇంజనీరింగ్; మెకానికల్ ఇంజనీరింగ్; ఆటోమొబైల్; మైనింగ్ తదితర బ్రాంచ్‌ల్లో రాణించాలంటే.. అకడమిక్ స్థాయి నుంచే  ప్రాక్టికల్స్, ప్రాజెక్ట్ వర్క్ విషయంలో ప్రాక్టికాలిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఫీల్డ్ వర్క్‌కు ఎక్కువ స్కోప్ ఉన్న బ్రాంచ్‌లు ఇవి.  అంతేకాకుండా కోర్ బ్రాంచ్‌ల ద్వారా లభించే జాబ్ నేచర్ కూడా అధిక శాతం మంది అమ్మాయిలు కోరుకునే ఇన్‌హౌస్ జాబ్‌కు భిన్నంగా ఉంటుందనే కారణంతో ఈ బ్రాంచ్‌ల్లో చేరే అమ్మాయిల శాతం ఏడు నుంచి పది శాతం మధ్యలోనే ఉంటోంది.
 
  కోర్ బ్రాంచ్‌లు.. ఫీల్డ్ వర్క్ తప్పనిసరా?
 కోర్ బ్రాంచ్‌లలో ఫీల్డ్ వర్క్ ఎక్కువగా ఉంటుందా.. అంటే పరిస్థితులు మారాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మెకానికల్, సివిల్ వంటి వాటిలో సైతం ఆటోమేషన్ అమలవుతోంది. సాఫ్ట్‌వేర్స్ ఆధారంగా కంప్యూటర్స్ వినియోగిస్తూ కాలు కదపకుండా విధులు నిర్వర్తించే అవకాశముంది. ఆ సాఫ్ట్‌వేర్స్ వినియోగానికి సంబంధించిన నైపుణ్యాలు కూడా ఇప్పుడు అకడమిక్‌గానే లభిస్తున్నాయి. ఏసీ గదుల్లో పని చేయొచ్చనుకునే సీఎస్‌ఈ, ఐటీ వంటి బ్రాంచ్‌ల విషయంలోనూ ఇప్పుడు ఒక్కోసారి క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
 
  మొబిలిటీ సమస్య
 ఎక్కువ మంది ఇబ్బందిగా భావిస్తున్న ‘మొబిలిటీ’ సమస్య సాంకేతికంగా అన్ని విభాగాల్లో సహజంగా మారింది. కాబట్టి మహిళలు సాఫ్ట్‌వేర్, సీఎస్‌ఈ వంటివి అనుకూల బ్రాంచ్‌లు.. సివిల్, మెకానికల్ వంటివి క్లిష్టమైన బ్రాంచ్‌లు అనే ధోరణి వీడాలనేది నిపుణుల అభిప్రాయం. ఆసక్తి ఉంటే కోర్ బ్రాంచ్‌ల్లోనైనా రాణించొచ్చని సూచిస్తున్నారు. ఆధునిక యుగంలో సానుకూల దృక్పథంతో అన్నిటా రాణించగలమనే మానసిక స్థైర్యంతో అమ్మాయిలు ముందడుగు వేయాలని సలహా ఇస్తున్నారు.
 
 ఇంతకీ అమ్మాయిలకు బెస్ట్ బ్రాంచ్ ఏది!
 ఫలానా బ్రాంచ్ అమ్మాయిలకు బెస్ట్ బ్రాంచ్ అని తే ల్చలేం అంటున్నారు నిపుణులు. బ్రాంచ్ ఎంపికలో ఆసక్తికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ తర్వాతే జాబ్ మార్కెట్ అవకాశాలు, నేచర్ ఆఫ్ జాబ్‌ను, జీతభత్యాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి అన్నది నిపుణుల అభిప్రాయం. ఏ బ్రాంచ్ విద్యార్థులైనా.. సబ్జెక్ట్ నాలెడ్జ్, నైపుణ్యాలుండి ప్లేస్‌మెంట్స్ ప్రక్రియలో ప్రతిభను చూపడం ద్వారా మంచి అవకాశాలు అందుకోవచ్చు. ప్రస్తుతం సీఎస్‌ఈ బ్రాంచ్ వేతనాల విషయంలో కొంత ముందంజలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, సివిల్ తదితర బ్రాంచ్‌లు నిలుస్తున్నాయి. ఆయా బ్రాంచ్‌ల్లోనే ఎన్నో స్పెషలైజ్డ్ విభాగాలు, దానికి అనుగుణంగా జాబ్ నేచర్ ఉంటోంది. సాధారణంగా సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ ఇంజనీర్‌లు ఇన్‌హౌస్‌లోనే పనిచేస్తుంటే.. సివిల్ ఇంజనీర్‌కు సైట్‌లో ఎక్కువ పని ఉంటుంది. ఇప్పుడు సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్‌లలో విద్యార్థినుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. కాబట్టి ఆసక్తి, అవకాశాల ఆధారంగా బ్రాంచ్‌ను ఎంపిక చేసుకోవడం మేలు అంటున్నారు నిపుణులు!!
 
 ఇంజనీరింగ్ కోర్సుల్లో విద్యార్థినుల సంఖ్య క్రమేణా పెరుగుతుండటం ఆహ్వానించదగ్గ పరిణామం. ప్రస్తుతం ఇంజనీరింగ్‌లో ప్రవేశిస్తున్న విద్యార్థినులు ఉన్నత విద్య, పరిశోధన వంటి విషయాల్లో ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగానే వీటికి ఆస్కారం కల్పించే కెమికల్ ఇంజనీరింగ్, బయో టెక్నాలజీ, నానో టెక్నాలజీ వంటి కోర్సులను ఎంపిక చేసుకుంటున్నారు. వాళ్లు లేబొరేటరీల్లో రాత్రి ఏడు, ఎనిమిది గంటల వరకు ఉండి తమ ల్యాబ్ వర్క్ పూర్తి చేసుకున్నాకే ఇంటికి వెళుతున్నారు.  వారు ఇంజనీరింగ్‌లో నైపుణ్యాలు ప్రదర్శిస్తున్నారనడానికి ఇవే నిదర్శనాలు.   - ప్రొఫెసర్ ఎ.జయశ్రీ, డెరైక్టర్, ఐఎస్‌టీ, జేఎన్‌టీయూహెచ్.
 
 అమ్మాయిలు
 ఆసక్తి చూపుతున్న
 బ్రాంచ్‌లివే

 
  ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్
  కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
  బయోటెక్నాలజీ
  కెమికల్ ఇంజనీరింగ్.

 
 వీటిలో  అబ్బాయిలకు దాదాపు సమానంగా అంటే.. 45 నుంచి 50 శాతం మధ్యలో విద్యార్థినుల సంఖ్య ఉంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement