టీఎస్ పాలిటెక్నిక్ కౌన్సెలింగ్
పాలిటెక్నిక్ కోర్సులతో ప్రయోజనం ఏమిటి?
పదో తరగతితోనే ఇంజనీరింగ్ కోర్సుల్లో అడుగుపెట్టాలనుకుంటే దానికి మార్గం.. పాలిటెక్నిక్. ఈ డిప్లొమాల వ్యవధి మూడు/మూడున్నరేళ్లు. కోర్సు పూర్తి చేస్తే వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో సూపర్‌వైజరీ స్థాయి ఉద్యోగాలు పొందొచ్చు. ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఈసెట్) రాసి నేరుగా బీటెక్ సెకండియర్‌లో ప్రవేశించొచ్చు. డిప్లొమా స్థాయిలో నేర్చుకున్న ప్రాక్టికల్ అంశాలతో సొంతంగా ఏదైనా పరిశ్రమను స్థాపించి పదిమందికి ఉద్యోగాలు కల్పించవచ్చు.
టీఎస్‌లో కాలేజీలు, సీట్ల వివరాలు?
టీఎస్‌పాలిసెట్‌లో మొత్తం 1,03,001 మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ కాలేజీల సంఖ్య 56 (సీట్లు: 12,000) కాగా, ప్రైవేటు కళాశాలల సంఖ్య 169 (సీట్లు: 46,000).
15% అన్‌రిజర్వ్‌డ్ సీట్లకు అర్హులు ఎవరు?
మొత్తం సీట్లలో 85 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లకు తెలంగాణవారితోపాటు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా అర్హులే.
పాలిటెక్నిక్‌లో ఎన్ని బ్రాంచ్‌లున్నాయి? ప్రధాన బ్రాంచ్‌లేవి?
పాలిటెక్నిక్‌లో మొత్తం 36 బ్రాంచ్‌లున్నాయి. వీటిలో ప్రధానంగా.. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, కెమికల్ ఇంజనీరింగ్ వంటివి ప్రధాన బ్రాంచ్‌లుగా పేర్కొనవచ్చు.
ఉద్యోగావకాశాలు లభిస్తున్న ఇతర బ్రాంచ్‌ల వివరాలు తెలపండి?
సివిల్, మెకానికల్, సీఎస్‌ఈ, ఈఈఈ, ఈసీఈ, కెమికల్ కాకుండా మరికొన్ని బ్రాంచ్‌ల్లో కూడా మంచి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఉదాహరణకు ప్యాకేజింగ్ టెక్నాలజీ, షుగర్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ, ఫుట్‌వేర్ టెక్నాలజీ, మైనింగ్ ఇంజనీరింగ్ వంటి కోర్సులు అభ్యసించినవారికి ఆయా రంగాల్లో జాబ్స్ ఉన్నాయి.
మంచి పాలిటెక్నిక్ కళాశాల ఎంపిక ఎలా?
గతేడాది పాలిటెక్నిక్ కౌన్సెలింగ్‌లో ఓసీ కేటగిరీలో పదివేల లోపు క్లోజింగ్ ర్యాంకులతో సీట్లు లభించిన కళాశాలలను మంచి కళాశాలలుగా భావించవచ్చు. దీనికోసం గతేడాది కటాఫ్ ర్యాంకులను విద్యార్థులు పరిశీలించాలి. వాటి ఆధారంగా ప్రాధాన్యత క్రమంలో కళాశాలల జాబితా రూపొందించుకోవాలి. గతేడాది టాపర్స్ చేరిన కాలేజీలతోపాటు కాలేజ్ ఏర్పాటు చేసిన సంవత్సరం, మౌలిక సదుపాయాలు (క్యాంపస్, తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, లేబొరేటరీలు, లైబ్రరీ, క్రీడా మైదానాలు, హాస్టల్స్, క్యాంటీన్ తదితర), ఫ్యాకల్టీ-వారి అర్హతలు, గత ఐదారేళ్లుగా కళాశాలల ఉత్తీర్ణతశాతం, కమ్యూనికేషన్‌స్కిల్స్-స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ, అన్నిటికంటే ముఖ్యంగా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వంటి అంశాలను కాలేజీ ఎంపికలో పరిశీలించాలి. కళాశాల ఎంత దూరంలో ఉందో తెలుసుకోవాలి.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ప్రాసెసింగ్ ఫీజు ఏమైనా చెల్లించాలా?
ధ్రువీకరణ పత్రాల వెరిఫికేషన్ కోసం హెల్ప్‌లైన్ సెంటర్‌లో ప్రాసెసింగ్ ఫీజు కింద ఓసీ/బీసీ విద్యార్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీలు రూ.250 ఫీజు చెల్లించాలి.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఏయే ధ్రువీకరణ పత్రాలు కావాలి?
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్దేశిత తేదీల్లో.. నిర్దేశించిన ర్యాంకుల వారికి జరుగుతుంది. వెళ్లేటప్పుడు టీఎస్ పాలిసెట్ ర్యాంక్ కార్డ్, టీఎస్ పాలిసెట్ హాల్‌టికెట్, పదో తరగతి మార్కుల మెమో, నాలుగు నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, నివాస ధ్రువీకరణ పత్రం, జనవరి 1, 2016 తర్వాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డ్, కుల ధ్రువీకరణ పత్రం, వికలాంగులు/ఎన్‌సీసీ/స్పోర్ట్స్/సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్/మైనారిటీస్/ఆంగ్లో ఇండియన్స్ సంబంధిత అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకుకోవాలి. అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకువెళ్లాలి.
వెబ్ కౌన్సెలింగ్‌పై నాకు అవగాహన లేదు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఏయే తేదీల్లో నిర్వహిస్తారు? వెరిఫికేషన్‌కు ఏ హెల్ప్‌లైన్ సెంటర్‌కు వెళ్లాలి?
సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను మే 20 నుంచి 28వ తేదీ వరకు నిర్వహిస్తారు. మధ్యలో 22వ తేది ఒక్కరోజు మినహాయింపు ఉంటుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 21 హెల్ప్‌లైన్ సెంటర్లను కేటాయించారు. మీకు దగ్గరలో ఉన్న ఏదైనా హెల్ప్‌లైన్ సెంటర్‌కు మీ ర్యాంకుకు నిర్దేశించిన తేదీల్లో వెళ్లాలి. అక్కడ కౌన్సెలింగ్ అధికారులు అన్ని వివరాలు అందిస్తారు. అయితే ఎస్టీ విద్యార్థులు వారికి నిర్దేశించిన కేంద్రాలకు మాత్రమే వెళ్లాలి. అదేవిధంగా ఎన్‌సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఆంగ్లో-ఇండియన్స్, శారీరక వికలాంగులు, చిల్డ్రన్స్ ఆఫ్ ఆర్మ్‌డ్‌ఫోర్సెస్ విద్యార్థులు.. హైదరాబాద్‌లోని మాసాబ్‌ట్యాంక్‌లో ఉన్న సాంకేతిక విద్యా భవన్‌కు హాజరుకావాలి. వీరికి అక్కడ మాత్రమే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. వీరికి మే 20, 21 తేదీల్లో వెరిఫికేషన్ జరుగుతుంది.
వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు అనుసరించాల్సిన విధివిధానాలేమిటి?
సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన విద్యార్థులు మే 23 నుంచి మే 30 వరకు చేరాలనుకుంటున్న కళాశాలలను, బ్రాంచ్‌లను http://tspolycet.nic.in లో యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌తో లాగినై ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసుకోవాలి. అయితే కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ర్యాంకులను, తేదీలను పరిగణనలోకి తీసుకోవాలి. నిర్దేశిత తేదీల్లో మీకు వచ్చిన ర్యాంకు ఆధారంగా ఆప్షన్స్ ఎంట్రీ ఇవ్వొచ్చు. అయితే ముందుగా మీరు ఏ కళాశాలల్లో, ఏ బ్రాంచ్‌ల్లో చేరాలనుకుంటున్నారో వాటికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ తర్వాత మిగిలినవాటిని ఎంపిక చేసుకోవాలి. వీలైనన్ని కళాశాలలకు ఆప్షన్స్ ఇవ్వాలి.
ఆప్షన్స్ ఎంట్రీకి తప్పనిసరిగా హెల్ప్‌లైన్ సెంటర్‌కు వెళ్లాలా?
కళాశాలల ఎంపిక కోసం తప్పనిసరిగా హెల్ప్‌లైన్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. దగ్గరలో ఉన్న ఏదైనా ఇంటర్‌నెట్ సెంటర్ లేదంటే ఇంట్లో నెట్ సౌకర్యమున్న సిస్టమ్ అవసరం. ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరర్ 9.0 ఉన్న బ్రౌజర్ మాత్రమే ఓపెన్ అవుతుంది. మీకు ఏ మాత్రం వెబ్ కౌన్సెలింగ్‌పై అవగాహన లేకుంటే హెల్ప్‌లైన్ సెంటర్‌కు వెళ్లడం మంచిది.
ఒకసారి ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మార్చుకునే వీలుందా?
మీరు ఎంపిక చేసుకున్న కళాశాలలను, బ్రాంచ్‌లను మార్చుకునే వీలు కూడా ఉంది. మే 31న ఫస్ట్ ర్యాంకర్ నుంచి చివరి ర్యాంకర్ వరకు తాము ఇచ్చిన ఆప్షన్స్‌ను మార్చుకునే వీలుంది. ఆ తర్వాత ఇక కుదరదు.
సీటు వచ్చిన సంగతి ఎలా తెలుస్తుంది?
ఆప్షన్స్ ఎంట్రీ తర్వాత జూన్ 1న మీకు ఏ కళాశాలలో, ఏ బ్రాంచ్‌లో సీటు లభించిందో తెలుసుకోవచ్చు. దీని కోసం https://tspolycet.nic.inలో క్యాండిడేట్స్ లాగిన్‌ను క్లిక్ చేసి ఐసీఆర్ ఫామ్ నంబర్, హాల్‌టికెట్ నంబర్, పాస్‌వర్డ్, పుట్టినతేది ఎంటర్ చేసి సీట్ ఎలాట్‌మెంట్ ఆర్డర్‌ను జూన్ 1 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
సీటు లభించినవారు ఫీజు ఎంత చెల్లించాలి?
కళాశాలలో సీటు లభించినవారు.. ఆయా కళాశాలను బట్టి రూ.3800 నుంచి 15,500 మధ్యలో ట్యూషన్ ఫీజు చెల్లించాలి. సీటు ఎలాట్‌మెంట్ ఆర్డర్‌లో పేర్కొన్న ఫీజును నిర్దేశిత కళాశాలలో పే చేయాలి.
నాకు ఆర్థిక స్థోమత లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుందా?
ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు నిర్దేశిత సంవత్సర ఆదాయానికి తక్కువగా ఉన్న ఓసీ/బీసీ/ఎస్సీ/ఎస్టీలు ట్యూషన్ ఫీజు నుంచి మినహాయింపు పొందొచ్చు. ఇందుకోసం మీసేవ కార్యాలయాల నుంచి జనవరి 1, 2016 తర్వాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని పొందాలి. ఫీజురీయింబర్స్‌మెంట్ వివరాల కోసం ఎప్పటికప్పుడు ప్రభుత్వం జారీ చేసే నిబంధనలను తెలుసుకుంటుండాలి.