- పెరుగుతున్న ఆదరణ
- గతేడాది కంటే 2వేలు అధికంగా దరఖాస్తులు
- మొత్తం సీట్లు మూడువేలు
- సీటొస్తే ఆరేళ్లవరకూ అన్నీఫ్రీయే
నూజివీడు : ట్రిపుల్‌ఐటీలో అందిస్తున్న ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ కోర్సులో చేరడానికిగాను 35,877 దరఖాస్తులు అంది నట్లు ట్రిపుల్‌ఐటీ వర్గాలు తెలిపాయి. గతేడాది కంటే రెండువేల దరఖాస్తులు అధికంగా రావడం గమనార్హం. రాష్ట్రంలోని నూజివీడు, బాసర, కడప జిల్లాలోని ఇడుపులపాయలో ఉన్న ట్రిపుల్‌ఐటీలలో ఒక్కొక్క దానిలో వెయ్యి సీట్ల చొప్పున మొత్తం మూడువేల సీట్లు ఉన్నాయి.
ఈ కోర్సులో చేరడానికి గాను దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఆర్జీయూకేటీ అధికారులు గత నెల 24న నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈనెల 16వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌లు పంపడానికి గడువు విధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ట్రిపుల్‌ఐటీలో సీటు కోసం భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో పంపిన దరఖాస్తుల ప్రింట్‌అవుట్‌లను ఈనెల 21 సాయంత్రం 5గంటల లోపు ఆర్జీయూకేటీకి అందాలి.
ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులలో సక్రమంగా ఉన్నవి ఎన్ని, ఇన్‌వేలిడ్ దరఖాస్తులు ఏమైనా ఉన్నాయా అనే అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ట్రిపులఐటీలోని ఆరు సంవత్సరాల ఇంజినీరింగ్ కోర్సులో భాగంగా మొదటి రెండు సంవత్సరాల పీయూసీ, తరువాత నాలుగు సంవత్సరాలు ఇంజినీరింగు విద్యను బోధించారు. వచ్చిన దరఖాస్తుల నుంచి సెలక్షన్ జాబితాను జులై 7న ఆర్జీయూకేటీ ఉన్నతాధికారులు ప్రకటించనున్నారు. జులై 23, 24వతేదీలలో కౌన్సెలింగ్ నిర్వహించి 28నుంచి తరగతులు ప్రారంభించనున్నారు.
ట్రిపుల్ ఐటీలపై ఆసక్తి ఎందుకంటే
ఏడాదికేడాది ట్రిపుల్‌ఐటీలపై విద్యార్థులలోను,వారి తల్లిదండ్రులలోను ఆసక్తి పెరుగుతుండడంతో ఏటా దరఖాస్తుల సంఖ్య పెరుగుతోంది. గతేడాది 32వేల దరఖాస్తులు రాగా, అంతకుముందు 28వేలువచ్చాయి. ఈ ఏడాది 35వేలు దాటాయి. ట్రిపుల్‌ఐటీలో సీటు లభిస్తే ఆరేళ్లపాటు ఎలాంటి ఫీజులు చెల్లించకుండా నాణ్యమైన ఇంజినీరింగ్ విద్యను పూర్తిచేయవచ్చు. అంతేగాకుండా పీయూసీ నుంచే ఏసీ తరగతి గదులుతోపాటు విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు సైతం ఇస్తారు. భోజన, వసతి సదుపాయాలతో పాటు డ్యూయల్ డిగ్రీలు, మైనర్‌కోర్సులు సైతం ఇక్కడ అందుబాటులో ఉంటాయి.
ఇవేగాక విద్యార్థులకు సంగీతం, నృత్యం, యోగాలలో కూడా ప్రతి రోజూ శిక్షణ ఇస్తుంటారు. ఇన్ని అవకాశాలు వేరే ఎక్కడా లేని నేపథ్యంలో ట్రిపుల్‌ఐటీలపై విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది.