బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంజినీరింగ్ కోర్సులలో ప్రవేశానికి కౌన్సెలింగ్‌తోపాటు సీట్ల ఎలాట్‌మెంట్ మొదటి దశ ప్రక్రియ కూడా పూర్తయింది. వీటిలో తొలి ప్రాధాన్యంగా కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ద్వితీయ ప్రాధాన్యంగా ఈసీఈ, తృతీయ ప్రాధాన్యంలో మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ఎక్కువ మంది చేరారు. జిల్లాలోని 32 ఇంజినీరింగ్ కళాశాలల్లో దాదాపు 11వేల సీట్లుండగా ఇప్పటివరకూ 3 వేల 900 సీట్ల వరకూ భర్తీ అయ్యాయి. వీటిలో దాదాపు 800 మంది సీఎస్‌ఈకు ఎంచుకున్నారు. తొలిమూడు ప్రాధాన్యాలుగా నిలిచిన బ్రాంచీల్లో ఉన్న కోర్సులు ప్రాధాన్యం తెలుసుకుందాం...
ఈసీఈ
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌ను సంక్షిప్తంగా ఈసీఈ అంటారు. ఇంజినీరింగ్ కోర్సులోనే దీనిని రాయల్ బ్రాంచ్‌గా చెప్పుకోవచ్చు. టెలి కమ్యూనికేషన్, మొబైల్ డెవలప్‌మెంట్ ఇండస్ట్రీలు కొన్ని సంవత్సరాలుగా సుస్థిర వృద్ధి సాధించడంతో ఈ రంగం ఎంచుకున్నవారి ఉపాధికి ఢోకాలేదు. ప్రారంభంలోనే రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వార్షిక ప్యాకేజీ అందుకోవచ్చు. డిజైన్ ఇంజినీరింగ్ ప్రాజెక్టు మేనేజర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ వంటి హోదాలు పొందవచ్చు. బీటెక్ పూర్తి చేశాక ఎంటెక్‌లో మొబైల్ వైర్‌లెస్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, గ్లోబల్ నేవిగేషన్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, టెలీమెటిక్ ఇంజినీరింగ్, బీఎల్‌ఎస్‌ఐ వంటి సబ్జెక్టుల్లో ఎంఎస్ చేయవచ్చు. ఈసీఈ బ్రాంచ్‌లో ఎలక్ట్రానిక్ డివైజ్ అండ్ సర్క్యూట్స్, స్విచ్చింగ్ థియరీ అండ్ లాజిక్ డిజైనింగ్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ అనాలిసిస్, పల్స్ అండ్ డిజిటల్ సర్క్యూట్, ఎలక్ట్రో మ్యాగ్నటిక్ థియరీ, కంట్రోల్ సిస్టమ్ ఇంజినీరింగ్, యాంటినాస్ అండ్ వేవ్ ప్రోపగేషన్, ఎలక్ట్రానిక్ మేజర్‌మెంట్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, అనలాగ్ కమ్యూనికేషన్స్, రాడార్ సిస్టమ్స్, కమ్యూనికేషన్స్ నెట్‌వర్క్స్ ప్రధాన సబ్జెక్టులుగా ఉంటాయి. ఈ బ్రాంచ్ చేసినవారు సీఎస్, ఈఈఈ వంటి రంగాల్లో రాణించవచ్చు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇంటెల్, శ్యామ్‌సంగ్, సోనీ, ఎల్‌జీ వంటి ప్రముఖ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.
సీఎస్‌ఈ...
సీఎస్‌ఈ విభాగం పూర్తిగా కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ రంగానికి సంబంధించింది. ఉత్తమ శ్రేణిలో ఈ కోర్సు పూర్తి చేసినవారికి భారీ వేతనాలతో కొలువు ఖాయం. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ సాఫ్ట్‌వేర్ రంగంలో రాణించవచ్చు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్, మ్యాథ్ మెటికల్ ఫౌండేషన్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, డేటా స్ట్రక్చర్, డిజిటల్ లాజిక్ డిజైన్, ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్, జావా ప్రోగ్రామింగ్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇన్ఫ్‌ర్మేటింగ్ సెక్యూరిటీ, కంప్యూటర్ నెట్‌వర్క్స్, వెబ్ టెక్నాలజీ, లైనెక్స్ ప్రోగ్రామింగ్, క్రౌడ్ కంప్యూటింగ్, డేటా వేర్‌హౌస్ సబ్జెక్టులు ఉంటాయి. ఈ కోర్సు పూర్తి చేసినవారు గూగుల్, అమెజాన్, ఐబీఎం, టీసీఎస్, విప్రో వంటి సంస్థలలో ఉద్యోగ అవకాశాలుంటాయి.
మెకానికల్...
విస్తృత ఉద్యోగ అవకాశాలకు ఆస్కారం ఉన్న బ్రాంచ్ మెకానికల్. మానవుని శారీరక శ్రమను తగ్గించే ప్రతి యంత్రం మెకానికల్ ఇంజినీరింగ్ ద్వారా తయారవుతుంది. ప్రతిభ చూపే మెకానికల్ ఇంజినీర్లకు ప్రారంభంలో రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు వార్షిక వేతనం ఉంటుంది. మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్, ధర్మో డైనమిక్స్, మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్స్, ౖకైనెటిక్స్ ఆఫ్ మెషినరీ, మెకానిక్స్ ఆఫ్ ప్లూయిడ్ అండ్ హైడ్రాలిక్ మెషిన్, డైనమిక్స్ ఆఫ్ మెషినరీ, డిజైనర్ మెషిన్ మెంబర్స్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ తదితర సబ్జెక్టులుంటాయి. ఇస్రో, ఇండియన్ రైల్వే, మిథానీ, టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, మహేంద్రవంటి సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment