మంచి ఇంజనీర్‌గా పేరుతెచ్చుకోవడం.. కోరుకున్న కంపెనీలో ఉద్యోగం సంపాదించడం.. ఇవీ ఇంజనీరింగ్‌లో చేరిన ప్రతి విద్యార్థి కనే కలలు.. శ్రమ, పట్టుదల, అంకిత భావం వంటి సద్గుణాలను ఆయుధాలుగా మల్చుకున్నప్పుడే అనుకున్న కలలను సాకారం చేసుకోవచ్చు.. ఈ క్రమంలో ఇంజనీరింగ్‌లో ప్రతి ఏడాది కీలకం అనే అంశాన్ని గమనించాలి.. ఒక సంవత్సరం బాగా చదివి, మరో ఏడాదిని నిర్లక్ష్యం చేయడానికి కుదరదు.. ఒకరకంగా నాలుగేళ్లు ఒకదానికొకటి ఇంటర్‌లింక్‌డ్‌గా ఉంటాయి.. ముఖ్యంగా రెండో ఏడాదిలో అడుగుపెట్టిన విద్యార్థులు.. మొదటి సంవత్సరానికి రెండో సంవత్సరానికి తేడాను గుర్తించి తదనుగుణంగా అడుగులు వేయాలి.. అప్పుడే కోర్సులోని మూడు, నాలుగు సంవత్సరాలను విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు చక్కని కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు.. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం విద్యార్థులు అనుసరించాల్సిన వ్యూహాలు..
ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో అన్ని బ్రాంచ్‌ల విద్యార్థులకు సబ్జెక్టులు కామన్‌గా ఉంటాయి. ఇందులో హ్యుమానిటీస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ క్రమంలో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ అంశాలను బోధిస్తారు. ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్‌ను కూడా మొదటి సంవత్సరంలోనే పరిచయం చేస్తారు. ఇంటర్మీడియెట్‌తో పోల్చితే.. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం సబ్జెక్ట్‌లు అడ్వాన్స్‌డ్‌గా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్మీడియెట్‌కు కొనసాగింపుగా ఇంజనీరింగ్ మొదటి సంవత్సరాన్ని పేర్కొనవచ్చు. కాబట్టి ద్వితీయ సంవత్సరం నుంచే ఎంచుకున్న బ్రాంచ్‌కు అనుగుణంగా ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడడం ప్రారంభమవుతుందని చెప్పొచ్చు.
కోర్-ఇంటర్ డిసిప్లినరీ:
ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ఎంచుకున్న ఇంజనీరింగ్ బ్రాంచ్‌కు అనుగుణంగా.. ఆయా బ్రాంచ్‌లలోని ప్రాథమిక అంశాలతోపాటు, ఇతర బ్రాంచ్‌కు సంబంధించిన కొన్ని అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఉదాహరణకు కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్సులో కంప్యూటర్ ప్రోగ్రామ్, లాంగ్వేజ్ ప్రోగ్రామ్, డిజిటల్ లాజిక్ డిజైన్ వంటి సబ్జెక్ట్‌లు ఉంటాయి. అంతేకాకుండా కోర్ సబ్జెక్ట్‌లు, ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్‌లు ఉంటాయి. అంటే ఒక బ్రాంచ్ విద్యార్థికి మరో బ్రాంచ్‌కు సంబంధించిన కొన్ని అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఉదాహరణకు మెకానికల్ విద్యార్థికి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అంశాలను బోధిస్తారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి.. రెండో సంవత్సరంలో థియరీ ఎక్కువగాను, ప్రాక్టికల్ వర్క్ తక్కువగా ఉంటుంది.
ఇంటరాక్షన్:
రెండో సంవత్సరంలో ప్రతి రోజూ తరగతులకు హాజరు కావాలి. ఏరోజు పాఠాలను ఆరోజే సాధన చేయాలి. ఇక్కడ ఒక విషయం గమనించాలి.. సాధారణంగా మొదటి సంవత్సరం అంతా కామన్ సబ్జెక్ట్‌లు ఉంటాయి. అంటే రెండో సంవత్సరంలో మాత్రమే విద్యార్థులు తాము ఎంచుకున్న బ్రాంచ్‌ల్లోకి అడుగుపెడతారని చెప్పొచ్చు. ఇక్కడే బ్రాంచ్‌ల వారీగా ఆయా సబ్జెక్ట్‌ల ప్రొఫెసర్స్ చెప్పే లెక్చర్స్ వినే, వారితో మాట్లాడే అవకాశం లభిస్తుంది. కాబట్టి సంబంధిత ప్రొఫెసర్స్‌తో ఇంటరాక్షన్ పెంచుకోవడానికి ప్రయత్నించాలి. ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి. సందేహాలను ఎప్పటికప్పుడూ నివృత్తి చేసుకోవాలి.
కాన్సెప్ట్-ప్రాక్టికల్:
తరగతి గదిలో చెప్పిన పాఠాలను ఎప్పటికప్పుడు ల్యాబ్స్‌లో కాన్సెప్ట్ ఓరియంటెడ్‌గా సాధన చేస్తేనే పరీక్షల్లో ఎక్కువ స్కోరింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. కేవలం తరగతులకు హాజరైతే సరిపోతుంది.. ప్రాక్టికల్స్ అవసరం లేదనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఏదైనా అంశాన్ని ప్రాక్టికల్‌గా నేర్చుకుంటేనే సంపూర్ణ విషయ పరిజ్ఞానం సొంతమవుతుంది. ప్రయోగాత్మక పరిజ్ఞానం లేకుండా కేవలం పుస్తక విజ్ఞానం ఎటువంటి ప్రయోజనం చేకూర్చదు. కాబట్టి పరీక్షలకు పక్కాగా సిద్ధం కావాలంటే ఈరెండు విభాగాల్లోనూ పట్టు సాధించాలి. ఒకరకంగా చెప్పాలంటే.. ద్వితీయ సంవత్సరంలోని ఆరు సబ్జెక్టులు, రెండు ల్యాబ్స్‌పై సరైన ప్రణాళిక రూపొందించుకోవాలి.
అన్నీ ముఖ్యమే:
మరో విషయం.. ఇంజనీరింగ్‌లో ఒక సబ్జెక్టు తేలిక, మరొకటి కష్టంగా ఉండదు. అన్ని సబ్జెక్టులూ ముఖ్యమే. దేనికీ తక్కువ ప్రాధాన్యత ఇవ్వలేం. అందుకే ద్వితీయ సంవత్సరంలోని సబ్జెక్టులపై పట్టు సాధిస్తే.. తృతీయ సంవత్సరాన్ని సులువుగానే గట్టెక్కవచ్చు. ఒకరకంగా ల్యాబ్స్‌లో విద్యార్థి ప్రాక్టికల్స్‌ను ఎంత సమర్థంగా నేర్చుకుంటే ఇంటర్నల్స్, మిడ్ ఎగ్జామ్స్‌లో అంత మంచి స్కోరింగ్ చేయవచ్చు. అంతేకాకుండా భవిష్యత్తులో నైపుణ్యం కలిగిన ఇంజనీర్‌గా రూపొందవచ్చు.
అవగాహనకు ప్రాధాన్యత:
ఇంజనీరింగ్‌లో స్కోరింగ్‌లో ఇంటర్నల్స్‌దీ ప్రధానపాత్ర. కోర్సు మధ్యలో నిర్వహించే ఇంటర్నల్స్‌లో విద్యార్థులు సులువుగా మార్కులు సాధించొచ్చనే ధోరణితో వ్యవహరించొద్దు. ఇంటర్నల్స్‌ను పక్కాగా ప్రిపేరైతేనే సెమిస్టర్ పరీక్షల్లోనూ సులువుగా రాణించడానికి అవకాశం ఉంటుంది. ప్రతి సబ్జెక్టులో ఇంటర్నల్స్, ఎక్స్‌టర్నల్ మార్కులపై దృష్టిసారించి తద్వారా మంచి మార్కుల శాతాన్ని పొందడానికి కృషిచేయాలి. ఇంటర్నల్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వీటిని తేలిగ్గా తీసుకోరాదు. ప్రాబ్లమ్ ఓరియంటెడ్‌గా ప్రిపరేషన్ సాగిస్తే వీటిల్లో విజయం సాధించడం సులభం. ఒకరకంగా చెప్పాలంటే ద్వితీయ సంవత్సరంలోని సబ్జె
క్టులను చదవడం కంటే.. ఆయా పాఠ్యాంశాల మూల భావన (కాన్సెప్ట్)ను అవగాహన చేసుకోవడానికి ప్రాధాన్యతనివ్వాలి. ఎందుకంటే.. బీటెక్‌లో ప్రశ్నలను మార్చిమార్చి అడుగుతుంటారు. మనకు బాగా అవగాహన ఉన్న అంశాన్ని సైతం జటిలం (ట్విస్ట్) చేసే విధంగా ప్రశ్నలు సంధిస్తుంటారు. అందుకే సబ్జెక్టును చదివి అవగాహన చేసుకోవడంతోపాటు ల్యాబ్‌లో ఎక్కువసేపు ప్రాక్టీస్ చేస్తేనే ద్వితీయ సంవత్సరంలోని రెండు సెమిస్టర్లలో మంచి స్కోరింగ్ చేయవచ్చు. మౌలిక సదుపాయాలు, ఇంటర్నెట్, ఇంజనీరింగ్ మ్యాగజైన్లను చదువుతూ సబ్జెక్టుపై పట్టు సాధించాలి.
విద్యార్థులు మొదటి సంవత్సరంలో సీ- ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్, రెండో సంవత్సరంలో ఇంజనీరింగ్ డ్రాయింగ్ సబ్జెక్ట్‌లలో ఎక్కువగా ఫెయిల్ అవుతుంటారు. కాబట్టి ప్రారంభం నుంచే ఈ సబ్జెక్ట్‌లపై దృష్టి సారించి.. ఎక్కువ శ్రమ చేయడం లాభిస్తుంది. పరీక్షలలో మంచి మార్కులు సాధించాలంటే..
గత ప్రశ్నపత్రాలను పరిశీలించి ఏ టాపిక్ మీద ఎటు వంటి ప్రశ్నలు వస్తున్నాయో క్షుణ్నంగా తెలుసుకోవాలి.
కనీసం 60 శాతం సిలబస్‌ను క్షుణ్నంగా చదవాలి.
ప్రణాళిక ప్రకారం:
ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో చేరడంతోనే అపరిమిత స్వేచ్ఛ వచ్చినట్లుగా భావిస్తుంటారు. దాంతో చదువు ద్వితీయ ప్రాధాన్యతగా మారిపోతుంది. దీంతో కొన్ని బ్యాక్‌లాగ్స్ మిగిలి పోతాయి. దాంతో రెండో సంవత్సరం ప్రారంభమయ్యేసరికి ఈ బ్యాక్‌లాగ్స్ కారణంగా విద్యార్థులు ఒత్తిడికి లోనవుతుంటారు. ఏకాగ్రత, ఆత్మవిశ్వాసంతో ఒత్తిడిని అధిగమించాలి. మరో ప్రధాన సమస్య ర్యాగింగ్. రెండో సంవత్సరానికి చేరడంతో సీనియర్ అయిపోయామనే భావంతో వ్యవహరిస్తుంటారు. జూనియర్లను ర్యాగింగ్ చేయాలని ఉత్సాహపడుతుంటారు.
సుప్రీంకోర్‌ట జడ్జిమెంట్ ప్రకారం ర్యాగింగ్ చేయడం శిక్షార్హం. కాబట్టి ఈ అంశానికి దూరంగా ఉండడం మంచిది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించి ప్రణాళిక ప్రకారం ముందుకు సాగితే.. ద్వితీయ సంవత్సరాన్ని ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా పూర్తి చేసుకుని తృతీయ సంవత్సరంలోకి అడుగుపెట్టొచ్చు. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి. మొదటి రెండు సంవత్సరాలు తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను ఒక కంట కనిపెడుతూ ఉండాలి. వారిని మార్గదర్శనం చేస్తుండాలి.
పునాది:
మరో కీలకాంశం.. ఇంజనీరింగ్ కోర్సులోని చివరి రెండేళ్లూ (మూడు, నాలుగు సంవత్సరాలకు) చదివే పాఠ్యాంశాలకు.. ద్వితీయ సంవత్సరంలోని సబ్జెక్ట్‌లు పునాదుల వంటివని చెప్పొచ్చు. కాబట్టి రెండో సంవత్సరం సబ్జెక్ట్‌లపై ఎంత పట్టు సాధిస్తే.. మిగతా రెండేళ్లు రాణించడం అంత సులభమవుతుంది. దాంతోపాటు కోర్సు పూర్తయ్యాక హాజరయ్యే వివిధ పోటీ పరీక్షల్లో అడిగే ప్రశ్నల్లో అధిక శాతం ప్రశ్నలకు ఆధారం ద్వితీయ సంవత్సరం పాఠ్యాశాలు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
కాబట్టి రెండో సంవత్సరాన్ని మొత్తం నాలుగేళ్ల ఇంజనీరింగ్ విద్యకే తలమానికంగా పేర్కొనవచ్చు. రెండో సంవత్సరం కోర్ సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. ఈ దశలో విద్యార్థులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సబ్జెక్టులను లోతుగా అధ్యయనం చేసేందుకు ప్రయత్నించాలి. కోర్సు మొత్తానికి దిశానిర్దేశం జరిగేది ఇక్కడే. మంచి మార్కులు సాధించాలన్నా..పూర్తి కోర్సుపై అవగాహన ఏర్పడాలన్నా ఈ ద్వితీయ సంవత్సరమే కీలకమనే విషయాన్ని గమనించాలి.
ఇక్కడే ప్రారంభించాలి:
చాలా మంది విద్యార్థులు నాలుగో సంవత్సరం వచ్చే వరకు కూడా కెరీర్ పట్ల ఒక అవగాహనను ఏర్పర్చుకోరు. ఉద్యోగం.. ఉన్నత విద్య అనే రెండు అంశాల్లో ఎప్పుడూ సందిగ్ధతలో ఉంటారు. అలా కాకుండా రెండో సంవత్సరం నుంచే భవిష్యత్ దిశగా ఆలోచనలు చేయడం శ్రేయస్కరం. స్వదేశం, విదేశాల్లో పీజీ చేయడమా? మేనేజ్‌మెంట్ కోర్సులను ఎంచుకోవడమా? ఉద్యోగం దిశగా ప్రయత్నం చేయడమా? ఇలా ఒక అంశంపై స్పష్టత తెచ్చుకోవాలి. తర్వాత దానికనుగుణంగా సన్నాహాలను ఈ రెండో సంవత్సరం నుంచే మొదలు పెట్టాలి.
ఎందుకంటే.. మూడో సంవత్సరంలో ఇంటర్న్‌షిప్, నాలుగో సంవత్సరంలో ప్రాజెక్ట్ వర్క్, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వంటి అంశాలతో సమయం సరిపోదు. విదేశాల్లో పీజీ చేసే ఉద్దేశం ఉంటే మూడో సంవత్సరంలోనే అందుకు సంబంధించిన పరీక్షలను పూర్తి చేయడం మంచిది. ఎందుకంటే విదేశీ వర్సిటీల్లో చేరేందుకు నిర్వర్తించాల్సిన సన్నాహాలకు ఏడాదికి పైగా పడుతుంది. కాబట్టి సదరు పరీక్షల ప్రిపరేషన్, కోచింగ్ వంటి వ్యవహారాలను రెండో ఏడాది నుంచే ప్రారంభించాలి. గేట్, ఐఈఎస్, క్యాట్ తదితర పోటీ పరీక్షల గురించి కూడా ఈ సంవత్సరంలోనే దృష్టి సారించడం మంచిది. అకడమిక్ కార్యకలాపాలతో సమాంతరంగా వీటికి సమయం కేటాయించాలి. సాఫ్ట్ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్, ఆంగ్ల భాషపై పట్టు సాధించడం వంటి అంశాలను మెరుగుపరుచుకోవడానికి తగినంత ప్రాధాన్యతనివ్వాలి.
వృథా కాకుండా :
ప్రతీ యూనివర్సిటీలో రెండో సంవత్సరం లేదా మూడో సంవత్సరంలో మూడు లేదా ఆరు వారాల పాటు ఏదైనా పరిశ్రమలో శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. దీన్నే ఇండస్ట్ట్రియల్ ట్రైనింగ్‌గా వ్యవహరిస్తారు.
ఈ నేపథ్యంలో తనకు ఆసక్తి ఉన్న పరిశ్రమ గురించి ఇంటర్నెట్ లేదా మరే మాధ్యమం ద్వారానైనా అవగాహన ఏర్పర్చుకుని అందులో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేయడం మంచిది. చాలా మంది విద్యార్థులు ఈ అంశానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వరు. ఒకవేళ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ లేకపోయినా వేసవి సెలవులను వృథా కానీయకుండా ఏదో ఒక చిన్న ప్రాజెక్ట్ వర్క్ చేయడం మంచిది. దీని వల్ల చదివిన సబ్జెక్ట్‌లపై పట్టు చిక్కుతుంది. ఇంజనీరింగ్ విద్యకే కీలకమైన అన్వయించే సామర్థ్యం (అప్లికేషన్ స్కిల్స్) అలవడుతుంది.
తరగతిలో చెప్పిన పాఠాలను ఎప్పటికప్పుడు ల్యాబ్స్‌లో కాన్సెప్ట్ ఓరియంటెడ్‌గా సాధన చేయాలి.
ఉద్యోగం.. ఉన్నత విద్య అనే రెండు అంశాల్లో రెండో సంవత్సరంలోనే ఒక స్పష్టతకు రావాలి.
రెండేళ్లూ (3, 4 సంవత్సరాలకు) చదివే పాఠ్యాంశాలకు.. ద్వితీయ సంవత్సరంలోని సబ్జెక్ట్‌లు పునాదుల వంటివి.
ఇంజనీరింగ్ పోటీ పరీక్షల్లోని అధిక శాతం ప్రశ్నలకు ఆధారం ద్వితీయ సంవత్సరం పాఠ్యాంశాలే.
బ్యాక్‌లాగ్స్ లేకుండా, ర్యాగింగ్ వంటి అంశాలకు దూరంగా ఉండాలి.
ప్రొ. పి.ఎస్. అవధాని,
ప్లేస్‌మెంట్ ఆఫీసర్, ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్,
విశాఖపట్నం.