దాదాపు ముప్పయ్యేళ్ల కిందటి సంఘటన. అవి నేను వాకాడులో ఇంజనీరింగ్ కోర్సులో జాయినయ్యాను. ర్యాగింగ్ ఎక్కవనే చెప్పాలి. ఇంకా ఫ్రెషర్స్ డే జరగకపోవడంతో సీనియర్స్ కంట కనబడటానికి భయపడే వాళ్లం. ఆ సంవత్సరం సీట్లు పెంచడంతో పాటు ఉన్న కాలేజీలకు కొత్త బ్రాంచెస్‌కు అనుమతి రావడంతో కౌన్సెలింగ్ ఆగకపోవడంతో నాలాంటి వారికి ఏదో మూల ఆశ. కౌన్సెలింగ్ కోసం హైదరాబాద్‌కు వెళ్లాలి. కారణం కంప్యూటర్స్ కోర్సుపై ఉన్న క్రేజ్ అలాంటిది. అందుకోసం కాలేజీ క్లాసులు ముగిసిన తర్వాత అతి కష్టం మీద సీనియర్స్ కంట కనబడకుండా తప్పించుకుని గూడూరు వెళ్లే బస్సులో కూర్చున్నాను. డబ్బులు బొటాబొటిగా మాత్రమే ఉండటంతో గూడూరులో బస్సు దిగిన తర్వాత రైల్వేస్టేషన్‌కు నడుచుకుంటూ వెళ్లాను. ట్రైన్ రావడానికి ఇంకా సమయం ఉండటంతో టికెట్ తీసుకుని మొదటి నంబర్ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చి పచార్లు ప్రారంభించాను రేపటి కౌన్సెలింగ్ గురించి ఆలోచిస్తూ. ఎందుకు వచ్చారో తెలియదు, కాని అక్కడకు వచ్చిన మా సీనియర్స్ కంటబట్టాను సరిగ్గా ఐస్‌క్రీమ్ షాపు ముందు. అది ప్లాట్‌ఫామ్‌పైనే. అంతే నా పైప్రాణాలు పైనే పోయాయి. తప్పించుకుని పారిపోదామా అనిపించింది.
వారు ఒక్కసారిగా నా మీద పడ్డంత పని చేశారు. ‘ఇంకా ఫ్రెషర్స్ డే కాలేదు. అప్పుడే సినిమాలకు తయారయ్యావా?’ అని ఒకరు.. ‘గూడురుకు రావద్దని తెలియదా?’ అని మరొకరు.. ఈలోగా సెల్యూట్ చెయ్యబోతే వారించి, అతి వినయం పనికిరాదని గదమాయించారు. వారు నార్మల్ అయ్యాక అసలు విషయం వివరించి చెప్పాను. ‘సరే గూడురు వచ్చినందుకు నీకు జరిమానా.. అందరికీ ఐస్‌క్రీమ్స్ ఇప్పించు’ అన్నారు. అంతే నా గుండె గుభేల్‌మంది. కారణం డబ్బులు తక్కువగా ఉండటమే. ఐస్‌క్రీమ్ షాపులో పది కప్పులు ఇవ్వమని చెప్పాను. కానీ అందులో ఉన్న ఒక సీనియర్‌కి ఇంకా కోపం తగ్గలేదు కాబోలు. అందుకే నా కప్పు తీసుకుని, దాంతో తినడానికి ఇచ్చిన వెదురు స్పూన్‌ను పట్టాలపైకి విసిరేసి, కప్పు మాత్రమే ఇచ్చాడు. ఐస్‌క్రీమ్ కరగకముందే తినమన్నాడు. చేతివేళ్లు ఉపయోగించవద్దని షరతు విధించాడు. ఒకవేళ నేను అలా తినకపోతే బిల్లు నేనే చెల్లించాలని, తింటే తాను చెల్లిస్తానని ఆఫర్ కూడా ఇచ్చాడు.
షాపతను, సీనియర్స్ ఆసక్తిగా చూస్తున్నారు. ఒక్కక్షణం ఆలోచించి, కప్పు మీదనున్న మూత తీసి, దాన్ని స్పూన్‌లా మలచి తినడం మొదలుపెట్టాను. వారు కాస్త కంగుతిన్నట్టనిపించింది.
‘నువ్వు కంప్యూటర్స్ కోర్సుకి బాగా సూటవుతావు’ అని మెచ్చుకున్నారు. సీనియర్ బిల్లు పే చేయక తప్పలేదు. ర్యాగింగ్ గురించి విన్నప్పుడల్లా ఈ సంఘటన గుర్తుకొచ్చి, నవ్వొస్తుంది. కొసమెరుపు ఏమిటంటే.. నాకు కంప్యూటర్స్ కోర్సులో సీటు రాకపోవడం.
– కె. వెంకటరమణారావు, కరీంనగర్
ఐస్‌క్రీమ్ ర్యాగింగ్
Published Sun, Apr 21 2019 12:07 AM | Last Updated on Sun, Apr 21 2019 12:07 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment