అమరావతి, సాక్షి: చంద్రబాబు మరోసారి తన మార్క్ ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో 24 మంత్రి స్థానాలకుగానూ.. ఏకంగా 17 మంది కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చారు. అయితే జనసేనకు 3, బీజేపీ 1 మంత్రి పదవి ఇచ్చి మిగిలినవన్నీ తన పార్టీకే కేటాయించుకున్నారు. అయితే..
మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని ఆశలో ఉన్న మాజీలకు, ఆశావహులకు చంద్రబాబు మాత్రం మొండిచేయి చూపించారు. గత అర్ధరాత్రి కేబినెట్ జాబితా వెలువడ్డాక వాళ్లు పూర్తిగా నిరాశలో కూరుకుపోయారు. ఈ జాబితాను పరిశీలిస్తే చాలా పెద్దదిగానే ఉంది.
మూడు పార్టీలకు చెందిన సీనియర్ల జాబితా పరిశీలిస్తే.. కళా వెంకట్రావ్, గంటా శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అయ్యన్న పాత్రుడు,ధూళిపాళి నరేంద్ర, గద్దె రామ్మోహన్, చింతమనేని ప్రభాకర్‌లకు కేబినెట్‌లో చోటు దక్కలేదు. అలాగే.. కన్నా లక్ష్మీనారాయణ, విష్ణుకుమార్ రాజు, రఘురామ కృష్ణంరాజు, మండలి బుద్ధప్రసాద్, కూన రవికుమార్, నక్కా కోటంరెడ్డి, బోండా ఉమా, కొలికిపూడి, జీవీ, వేమిరెడ్డి, అఖిలప్రియ, మాధవిరెడ్డి, పరిటాల సునీతకు చంద్రబాబు అవకాశం ఇవ్వలేదు. అయితే.. ఈ జాబితా నుంచే స్పీకర్‌గా ఒకరికి అవకాశం దక్కేలా కనిపిస్తోంది.
మరోవైపు వైఎస్సార్‌సీపీ నుంచి చేరి పోటీ చేసి నెగ్గిన ఆనం నారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథిలకు మాత్రం అవకాశం ఇచ్చారు. అదే పార్టీ నుంచి వచ్చిన కోటంరెడ్డి, గుమ్మనూరు జయరాం మాత్రం ఛాన్స్ దక్కలేదు. మంత్రి పదవులపై గంపెడు ఆశలు పెట్టుకున్న వీళ్లలో కొందరు నిరాశలో ఉన్నట్లు వాళ్ల వాళ్ల అనుచర గణాలు చెబుతున్నాయి. మరి వీళ్ల అసంతృప్తిని చంద్రబాబు ఎలా చెరిపేస్తారో చూడాలి.
ఇదీ చదవండి: ఆ ఒక్క మంత్రి పదవి కూడా టీడీపీకేనా?
Comments
Please login to add a commentAdd a comment