వారు ఇంజనీరింగ్ పాఠాలు చెప్పొచ్చు
ఎంటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణులకు ఏఐసీటీఈ ఊరట
విజయవాడ (గుణదల): ఎంటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏ విద్యార్హత ఉన్నవారు ఇంజనీరింగ్ పాఠాలు బోధించవచ్చని జాతీయ సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) సోమవారం ప్రకటించింది. ఎంటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ విద్యార్హత ఉన్నవారికి ఇంజనీరింగ్ చదువులు బోధించే సామర్థ్యం లేదని ఈ ఏడాది జనవరి 6న ఏఐసీటీఈ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఇటీవల విజయవాడకు వచ్చిన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఇంజనీరింగ్ కళాశాలల ఫ్యాకల్టీ అసోసియేషన్ వినతిపత్రం సమర్పించింది.
ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఆయా విద్యార్హత కలిగిన ఫ్యాక ల్టీలు రోడ్డున పడతారని ఆమె దృష్టికి తీసుకెళ్లింది. ఈ క్రమంలో సోమవారం ఢిల్లీలో జరిగిన ఏఐసీటీఈ సమావేశం.. ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంటెక్ విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఇంజనీరింగ్ పాఠాలు బోధించవచ్చని తీర్మానిస్తూ వివరాలను ఏఐసీటీఈ వెబ్‌సైట్లో పొందుపరిచింది.