- రూ. 25 వేలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన పీసీ టెక్నాలజీస్ కంపెనీ
- పోలీసులను ఆశ్రయించిన బాధిత ఇంజినీరింగ్ విద్యార్థులు
భవ్య (పేరు మార్చాం) బీటెక్ ఈసీఈ 2016లో పూర్తి చేసింది. జేఎన్‌టీయూ పరిధిలోని అనుబంధ ఇంజనీరింగ్ కళాశాల వారు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించడానికి పీసీ టెక్నాలజీస్ అనే కంపెనీని ఆహ్వానించారు. ఏకంగా 18 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు కంపెనీ ప్రతి నిధులు ప్రకటించారు. మొదట రూ. 25 వేలు కంపెనీ పేరుతో డిపాజిట్ చే యాలని సూచించారు. అనంతరం మూడు నెలలు ట్రెనింగ్ ఉంటుంది. అందులో సై్టఫండ్ నెలకు రూ. 18 వేలు ఇస్తామన్నారు. ట్రైనింగ్ అనంతరం ఉద్యోగంలో నెలకు రూ. 25వేల జీతం చెల్లిస్తామని పేర్కొన్నారు. దీంతో అందరూ డిపాజిట్ చేశారు. జూన్ 9న ట్రైనింగ్‌కు హాజరయ్యారు. అప్పటి నుంచి సై్టఫండ్ అదిగో.. ఇదిగో అంటూ ఊరడించారు. వారం రోజులు మీకు సెలవు ఇస్తున్నామని కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. తిరిగి వచ్చే సరికి బోర్డు తిప్పేశారు. కంపెనీ వెబ్‌సైట్ పనిచేయలేదు. సీఈఓ నుంచి మేనేజర్ వరకు ఎవరి సెల్‌ఫోన్‌లు పనిచేయలేదు. దీంతో తాము మోసపోయామని విద్యార్థులకు అర్థమైంది. కళాశాల యాజామాన్యాన్ని ప్రశ్నిస్తే‘ మిమ్మిల్ని ఉద్యోగాల్లో చేరాలని ఒత్తిడి చేశామా? మీరు కంపెనీ గురించి ఆలోచించుకొని జాయిన్ కావాల్సింది?’ అంటూ మాటమార్చేశారు. రూ. 25 వేలతో పాటు సమయం వృథా అయిందని విద్యార్థులు వాపోయారు.
బెంగుళూర్ పోలీసులకు ఫిర్యాదు
పీసీ టెక్నాలజీ కంపెనీ తమను మోసం చేసిందని బెంగుళూర్‌లోని అశోక్‌నగర్ పోలీస్‌స్టేçÙన్‌లో బాధిత ఇంజినీరింగ్ విద్యార్థులు ఫిర్యాదు చేశారు. డిపాజిట్ కట్టించుకొని కంపెనీని మూసేశారని పేర్కొన్నారు. తమ సర్టిఫికెట్లు కళాశాల వద్దే ఉండడంతో ఫిర్యాదు నేపథ్యంలో తమకు ఇబ్బందులు కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. పీసీ టెక్నాలజీస్ కంపెనీ 15 బ్రాంచుల్లో ఇదే తరహాలో మోసం చేసినట్లు బెంగళూర్ పోలీసులు చెప్పారని విద్యార్థులు తెలిపారు.