యాంత్రీకరణ నేపథ్యంలో కుదేలైన నేత పరిశ్రమకు ప్రభుత్వం ఊతమిస్తోంది. కోవిడ్ మహమ్మారి ధాటికి కొడిగట్టిన చేనేత రంగానికి ప్రభుత్వం యూనిఫాం ఆర్డర్లు అందించి ఊపిరి పోసింది. సంక్షేమ పథకాలతో నేత కార్మికుల జీవన ప్రమాణాలు పెంచింది. విద్యుత్ చార్జీల రాయితీలతో మరమగ్గానికి పూర్వ వైభవం తీసుకొచ్చింది. తాజాగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధించి, వస్త్ర ఫ్లెక్సీలు వినియోగించాలన్న నిర్ణయంతో చేనేతకు పట్టాభిషేకం చేసింది.
సాక్షి, చిత్తూరు: నేతన్నకు మంచి రోజులు వచ్చా యి. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు రద్దు చేస్తూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. వాటి స్థానంలో పర్యావరణానికి అనుకూలమైన వస్త్రాలతో తయారు చేసిన ఫ్లెక్సీలు వినియోగించాలని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం నేత కార్మికుల్లో నూతనోత్సాహం నింపింది. అక్టోబరు 1వ తేదీ నుంచి ఈ కొత్త నిర్ణయం అమల్లోకి వచ్చింది.
నగరి నేత పరిశ్రమకు వందేళ్ల చరిత్ర
వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన నగరి నేత పరిశ్రమలో పదివేలకు పైగా మరమగ్గాలు ఉన్నాయి. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఈ పరిశ్రమపై ఆధారపడి 40 వేల మందికి పైగా జీవనం సాగిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఆర్కే రోజా నేతన్నల పరిస్థితి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆదుకోవాలని విన్నవించారు. ఫలితంగా నేత కార్మికుల నుంచి 20 లక్షల మీటర్లు ప్రభుత్వ పాఠశాలకు అవసరమైన యూనిఫామ్ దుస్తుల తయారీ ఆర్డర్ వచ్చింది. దీంతో నగరి నేత కార్మికుల జీవనానికి ఏపీ ప్రభుత్వం ఊతమిచ్చినట్లయింది. కార్మికులు తమకు వచ్చిన ఆర్డర్లను సద్వినియోగం చేసుకుని సకాలంలో దుస్తులు సరఫరా చేయడంలో సఫలీకృతులయ్యారు.
విదేశాల్లో మంచి గిరాకీ
ఒకప్పుడు పుష్కలమైన విదేశీ ఆర్డర్లతో నగరి నేత పరిశ్రమ వర్ధిల్లింది. జిల్లాలోని నగరి పరిసర ప్రాంతాల్లో తయారు చేసే చొక్కాలకు విదేశాల్లో మంచి గిరాకీ ఉండేది. ఇటు తమిళనాడు, అటు కర్ణాటక నుంచి టోకు వర్తకులు నగరికి గుంపులు గుంపులుగా వచ్చి కొనుగోలు చేసేవారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో క్రమేణా విదేశీ ఆర్డర్లు తగ్గాయి. ప్రత్యామ్నాయంగా స్వదేశంలో తయారు చేసే వస్త్రాల తయారీపైనే నేత కార్మికులు ఆధారపడాల్సి వస్తోంది. తాజాగా ప్లాస్టిక్ బ్యానర్లను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాటి స్థానంలో వస్త్రాలతో తయారు చేసిన బ్యానర్లనే వాడాలని సూచించింది. ప్రభుత్వ నిర్ణయంతో నేత కార్మికుల్లో ఆనందం వెల్లివెరిసింది.
పర్యావరణానికి మేలు
ప్లాస్టిక్ ఫ్లెక్సీల వాడకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించడంతో పర్యావరణ సమతుల్యతకు ఊపిరి వచ్చింది. గ్లోబల్ వార్మింగ్ పెరుగుదలకు ప్లాస్టిక్ కూడా కారణమేనని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన ప్లాస్టిక్ ఫ్లెక్సీల వాడకాన్ని నిషేధించి, పర్యావరణానికి హానిలేని వస్త్రాలతో తయారు చేసే బ్యానర్లు వాడాలని ఆదేశాలివ్వటం శుభ పరిణామమని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
నేతన్నలకు సర్కారు వెన్నుదన్ను
నేత, మరమగ్గం కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోంది. ఇటు సంక్షేమ పథకాలతోపాటు ప్రభుత్వ నిర్ణయాలు కూడా నేతన్న ఉపాధికి ఊతమిస్తున్నాయి. చేనేత కార్మికులకు నేతన్న నేస్తం పథకం కింద ఏడాదికి రూ.24 వేలు, చేనేత పెన్షన్ల కింద 50 ఏళ్లు పైబడిన కార్మికులకు నెలకు రూ.2,500, చేయూత కింద యేడాదికి రూ.18,750 అందజేస్తున్నారు. తాజాగా బ్యానర్లకు వస్త్రాలు వాడాలని ఆదేశించడంతో నేతన్నలకు ఉపాధి మరింత పెరగనుంది.
వస్త్ర బ్యానర్లతో ఉపాధి
గతంలో ఆర్డర్లు లేకుండా వివాహ విందులో సప్లయర్లుగా వెళ్లేవాళ్లం. ఈ దశలో ప్రభుత్వం అందించిన యూనిఫామ్ ఆర్డర్లు నా కుటుంబంతో పాటు నేత పరిశ్రమను ఆదుకుంటున్నాయి. వస్త్రాలతో బ్యానర్లు వేయడం ప్రారంభిస్తే, నేయాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో నేతన్నకు పని దొరుకుతుంది.
– ఎజి.దేవన్, నేత కార్మికుడు, సత్రవాడ
రక్షణతో పాటు ఉపాధి
నేతపరిశ్రమలో ప్రధానమైన డైయింగ్ యూనిట్ల వారికి శాశ్వత పరిష్కారం చూపే ఎఫ్లూయంట్ ట్రీట్‌మెంట్ ప్లాంటు నిర్వహణకు వచ్చింది. ప్రస్తుతం ప్లాస్టిక్ బ్యానర్లు బ్యాన్ చేసి వస్త్ర బ్యానర్లు వేయాలంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పర్యావరణ రక్షణకు ఉపయోగపడటంతో పాటు నేత పరిశ్రమకు ఉపాధి కల్పిస్తుంది.
– భూపాళన్, ఏకాంబరకుప్పం
మంచి నిర్ణయం
ప్లాస్టిక్‌ను నిషే«ధించాలన్న నిర్ణయం మంచిది. ఏటా ప్రతి మనిషి దాదాపు 12 కిలోల ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నట్లు అంచనా. దీనివల్ల దేశవ్యాప్తంగా రోజూ నలుగురు క్యాన్సర్‌తో చనిపోతున్నారు. ఇప్పటికే ప్రతి ఆవు, చేప కడుపులో ప్లాస్టిక్ ఉంది. మనిషి కడుపులో దాదాపు 20 గ్రాముల వరకు ప్లాస్టిక్ ఉన్నట్లు తెలుస్తోంది.
– మురళి, పర్యావరణ ప్రేమికుడు
Comments
Please login to add a commentAdd a comment