Handloom Department
-
నో ప్లాస్టిక్.. ఓన్లీ క్లాత్! జీవనాదారానికి పట్టాభిషేకం
యాంత్రీకరణ నేపథ్యంలో కుదేలైన నేత పరిశ్రమకు ప్రభుత్వం ఊతమిస్తోంది. కోవిడ్ మహమ్మారి ధాటికి కొడిగట్టిన చేనేత రంగానికి ప్రభుత్వం యూనిఫాం ఆర్డర్లు అందించి ఊపిరి పోసింది. సంక్షేమ పథకాలతో నేత కార్మికుల జీవన ప్రమాణాలు పెంచింది. విద్యుత్ చార్జీల రాయితీలతో మరమగ్గానికి పూర్వ వైభవం తీసుకొచ్చింది. తాజాగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధించి, వస్త్ర ఫ్లెక్సీలు వినియోగించాలన్న నిర్ణయంతో చేనేతకు పట్టాభిషేకం చేసింది. సాక్షి, చిత్తూరు: నేతన్నకు మంచి రోజులు వచ్చా యి. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు రద్దు చేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. వాటి స్థానంలో పర్యావరణానికి అనుకూలమైన వస్త్రాలతో తయారు చేసిన ఫ్లెక్సీలు వినియోగించాలని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం నేత కార్మికుల్లో నూతనోత్సాహం నింపింది. అక్టోబరు 1వ తేదీ నుంచి ఈ కొత్త నిర్ణయం అమల్లోకి వచ్చింది. నగరి నేత పరిశ్రమకు వందేళ్ల చరిత్ర వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన నగరి నేత పరిశ్రమలో పదివేలకు పైగా మరమగ్గాలు ఉన్నాయి. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఈ పరిశ్రమపై ఆధారపడి 40 వేల మందికి పైగా జీవనం సాగిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఆర్కే రోజా నేతన్నల పరిస్థితి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆదుకోవాలని విన్నవించారు. ఫలితంగా నేత కార్మికుల నుంచి 20 లక్షల మీటర్లు ప్రభుత్వ పాఠశాలకు అవసరమైన యూనిఫామ్ దుస్తుల తయారీ ఆర్డర్ వచ్చింది. దీంతో నగరి నేత కార్మికుల జీవనానికి ఏపీ ప్రభుత్వం ఊతమిచ్చినట్లయింది. కార్మికులు తమకు వచ్చిన ఆర్డర్లను సద్వినియోగం చేసుకుని సకాలంలో దుస్తులు సరఫరా చేయడంలో సఫలీకృతులయ్యారు. విదేశాల్లో మంచి గిరాకీ ఒకప్పుడు పుష్కలమైన విదేశీ ఆర్డర్లతో నగరి నేత పరిశ్రమ వర్ధిల్లింది. జిల్లాలోని నగరి పరిసర ప్రాంతాల్లో తయారు చేసే చొక్కాలకు విదేశాల్లో మంచి గిరాకీ ఉండేది. ఇటు తమిళనాడు, అటు కర్ణాటక నుంచి టోకు వర్తకులు నగరికి గుంపులు గుంపులుగా వచ్చి కొనుగోలు చేసేవారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో క్రమేణా విదేశీ ఆర్డర్లు తగ్గాయి. ప్రత్యామ్నాయంగా స్వదేశంలో తయారు చేసే వస్త్రాల తయారీపైనే నేత కార్మికులు ఆధారపడాల్సి వస్తోంది. తాజాగా ప్లాస్టిక్ బ్యానర్లను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాటి స్థానంలో వస్త్రాలతో తయారు చేసిన బ్యానర్లనే వాడాలని సూచించింది. ప్రభుత్వ నిర్ణయంతో నేత కార్మికుల్లో ఆనందం వెల్లివెరిసింది. పర్యావరణానికి మేలు ప్లాస్టిక్ ఫ్లెక్సీల వాడకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించడంతో పర్యావరణ సమతుల్యతకు ఊపిరి వచ్చింది. గ్లోబల్ వార్మింగ్ పెరుగుదలకు ప్లాస్టిక్ కూడా కారణమేనని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన ప్లాస్టిక్ ఫ్లెక్సీల వాడకాన్ని నిషేధించి, పర్యావరణానికి హానిలేని వస్త్రాలతో తయారు చేసే బ్యానర్లు వాడాలని ఆదేశాలివ్వటం శుభ పరిణామమని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేతన్నలకు సర్కారు వెన్నుదన్ను నేత, మరమగ్గం కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోంది. ఇటు సంక్షేమ పథకాలతోపాటు ప్రభుత్వ నిర్ణయాలు కూడా నేతన్న ఉపాధికి ఊతమిస్తున్నాయి. చేనేత కార్మికులకు నేతన్న నేస్తం పథకం కింద ఏడాదికి రూ.24 వేలు, చేనేత పెన్షన్ల కింద 50 ఏళ్లు పైబడిన కార్మికులకు నెలకు రూ.2,500, చేయూత కింద యేడాదికి రూ.18,750 అందజేస్తున్నారు. తాజాగా బ్యానర్లకు వస్త్రాలు వాడాలని ఆదేశించడంతో నేతన్నలకు ఉపాధి మరింత పెరగనుంది. వస్త్ర బ్యానర్లతో ఉపాధి గతంలో ఆర్డర్లు లేకుండా వివాహ విందులో సప్లయర్లుగా వెళ్లేవాళ్లం. ఈ దశలో ప్రభుత్వం అందించిన యూనిఫామ్ ఆర్డర్లు నా కుటుంబంతో పాటు నేత పరిశ్రమను ఆదుకుంటున్నాయి. వస్త్రాలతో బ్యానర్లు వేయడం ప్రారంభిస్తే, నేయాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో నేతన్నకు పని దొరుకుతుంది. – ఎజి.దేవన్, నేత కార్మికుడు, సత్రవాడ రక్షణతో పాటు ఉపాధి నేతపరిశ్రమలో ప్రధానమైన డైయింగ్ యూనిట్ల వారికి శాశ్వత పరిష్కారం చూపే ఎఫ్లూయంట్ ట్రీట్మెంట్ ప్లాంటు నిర్వహణకు వచ్చింది. ప్రస్తుతం ప్లాస్టిక్ బ్యానర్లు బ్యాన్ చేసి వస్త్ర బ్యానర్లు వేయాలంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పర్యావరణ రక్షణకు ఉపయోగపడటంతో పాటు నేత పరిశ్రమకు ఉపాధి కల్పిస్తుంది. – భూపాళన్, ఏకాంబరకుప్పం మంచి నిర్ణయం ప్లాస్టిక్ను నిషే«ధించాలన్న నిర్ణయం మంచిది. ఏటా ప్రతి మనిషి దాదాపు 12 కిలోల ప్లాస్టిక్ను వినియోగిస్తున్నట్లు అంచనా. దీనివల్ల దేశవ్యాప్తంగా రోజూ నలుగురు క్యాన్సర్తో చనిపోతున్నారు. ఇప్పటికే ప్రతి ఆవు, చేప కడుపులో ప్లాస్టిక్ ఉంది. మనిషి కడుపులో దాదాపు 20 గ్రాముల వరకు ప్లాస్టిక్ ఉన్నట్లు తెలుస్తోంది. – మురళి, పర్యావరణ ప్రేమికుడు -
ట్రెండ్కు అనుగుణంగా చేనేత పురోగమించాలి
సాక్షి, అమరావతి: కళాత్మకత, సంస్కృతి సంప్రదాయాలకు చేనేత వస్త్రం జీవం పోస్తుందని, గాంధీజీ స్వయంగా రాట్నం ఒడికి స్వదేశీ ఉద్యమానికి నాంది పలికి బ్రిటిష్ వారిని తిప్పికొట్టారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. 7వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఆప్కో భవన్లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఘన చరిత్ర కలిగిన చేనేత కొత్త ట్రెండ్లకు అనుగుణంగా పురోగమించాలని, అంతర్జాతీయ మార్కెటింగ్ కల్పించి నేత వస్త్రాలను శాశ్వతంగా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేనేత కార్మికుల అభివృద్ధికి పాటుపడ్డారని, మళ్లీ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేనేతకు ఊతమిస్తున్నారన్నారు. పాదయాత్రలో నేత కార్మికుల కష్టాలను కళ్లారా చూసిన వైఎస్ జగన్ ‘నేతన్న నేస్తం’ పథకం ద్వారా రూ.24 వేల ఆర్థిక సాయాన్ని నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నారని చెప్పారు. చేనేత వంటి అనేక చేతి వృత్తులతో మన సంస్కృతిని సుసంపన్నం చేసి వెనకబడిన వర్గాలు నిలదొక్కుకునేలా సీఎం జగన్ విప్లవాత్మక చర్యలు చేపడుతున్నారన్నారు. ప్రపంచ స్థాయిలో ఆదరణ పొందేలా చేనేత కార్మికులకు ఆధునిక డిజైన్ వస్త్రాల తయారీ శిక్షణకు చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే ఆర్గానిక్ వస్త్రాల నేత, రసాయన రహిత వస్త్రాలు, కొత్త డిజైన్లు, రెడీమేడ్ వస్త్రాల తయారీపై రాష్ట్రంలో గట్టి కృషి జరుగుతోందని రామకృష్ణారెడ్డి అభినందించారు. మాట నిలబెట్టుకున్న సీఎం జగన్: మంత్రి గౌతమ్రెడ్డి చేనేత జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఉపాధి లేక ధర్మవరం ప్రాంతంలో 48 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడితే పట్టించుకున్న నాథుడే లేడన్నారు. సీఎం జగన్ తన పాదయాత్రలో ప్రతి చేనేత కుటుంబాన్ని ఆదుకుంటానని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారన్నారు. నేత కార్మికులను ఆదుకునేందుకు గతేడాది రూ.600 కోట్లు ఖర్చు చేశారని, ఈనెల 10న మరో రూ.200 కోట్లు నేత కార్మికులకు అందజేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఖాదీ, చేనేత, పొందూరు తదితర బ్రాండ్ వస్త్రాలను నవతరానికి చేరువ చేస్తామన్నారు. సీఎం జగన్ చొరవతో ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి వెబ్ పోర్టల్ ద్వారా చేనేత వస్త్రాలకు ఆన్లైన్ మార్కెటింగ్ అందుబాటులో ఉందన్నారు. దీన్ని మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తద్వారా చేనేత కార్మికులకు బాసటగా నిలుస్తామన్నారు. ఏపీ చేనేత వస్త్రాలకు ఒక బ్రాండ్ క్రియేట్ చేసి ప్రపంచంలోనే గుర్తింపు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామని గౌతమ్రెడ్డి అన్నారు. ఆప్కో చైర్మన్ చిల్లపల్లి నాగ వెంకట మోహనరావు మాట్లాడుతూ చేనేత కుటుంబాలను ఆదుకుంటున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ అన్నారు. 11 మందికి సత్కారం.. చేనేత వస్త్రాల తయారీలో నూతన ఒరవడి సృష్టించి జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న 11 మందిని సత్కరించారు. మృతి చెందిన 13 మంది చేనేత కార్మికులకు సంబంధించిన కుటుంబాలకు రూ.12,500 చొప్పున ఆర్థిక సాయం అందించారు. చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిశిభూషణ్ కుమార్, చేనేత జౌళి శాఖ డైరెక్టర్ పి.అర్జునరావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ పోతుల సునీత, డీసీఎంఎస్ చైర్పర్సన్ స్నిగ్ధ తదితరులు పాల్గొన్నారు. ధర్మవరం పట్టు వస్త్రాల డిజైన్తో తపాలా కవర్ ధర్మవరం పట్టు చీరలు, పావడాలపై రూపొందించిన ప్రత్యేక తపాలా కవర్ను ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రి మేకపాటి శనివారం ఆవిష్కరించారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని తపాలా శాఖ ఈ కవర్ను విడుదల చేసింది. విజయవాడలోని ఆప్కో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ధర్మవరం పట్టు వస్త్రాల ప్రత్యేకత అయిన పెద్ద బోర్డర్, కాంట్రాస్ట్ రంగులను ప్రతిబింబిస్తూ తపాలా కవర్ ఒక జరీ బుటను కలిగి ఉండటం ప్రత్యేకత. పోస్టాఫీసుల అసిస్టెంట్ సూపరిండెంట్ శ్రీనివాస్తదితరులు పాల్గొన్నారు. -
భరత్ అనే ఇతడు
సవ్యసాచి అర్జునుడు. రెండు చేతులతో బాణాలను సంధించాడు! చేతిలో మంత్రమున్న నేతకారుడు భరత్. రెండు వైపుల డిజైన్తో దుపట్టాను నేశాడు! మగ్గంపై ప్రయోగాలు చేస్తున్నాడు. వెండితెరపై ఆర్ట్ డైరెక్షన్ ఇస్తున్నాడు. అర్జునుడు.. మత్స్యయంత్రాన్ని ఛేదించాడు. భరత్ ‘ఇకత్ ’లో నైపుణ్యాన్ని సాధించాడు. మన జాతీయ పతాకంతో పాటు చేనేతను కాన్వాస్గా చేసుకుని అనేకమంది నాయకులను ఆవిష్కరించినప్పుడు తొలిసారిగా భరత్ ఎవరో, భరత్ ఏమిటో రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలిసింది. దేశపటంలో మహాత్మాగాంధీ, నాలుగు సింహాల జాతీయ చిహ్నం, భగత్సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, స్వామి వివేకానంద, నరేంద్రమోదీ చిత్రాలను నేశారు. అలాగే మదర్థెరిసా, సచిన్ టెండుల్కర్, నెల్సన్ మండేలా, చెగువేరాలకు కూడా యధాతథంగా రూపమిచ్చారు. వచ్చే ఏడాది జూన్లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల ముగింపు నాటికి ఆయన చిత్రాన్ని ఇకత్లో తీసుకురావడానికి ఇప్పటి నుంచే నేతలో నిమగ్నమయ్యారు భరత్. ఒక వ్యక్తి ఫొటోను రూపురేఖలు మారకుండా మగ్గం మీద ఆవిష్కరించడానికి కనీసం నెల రోజులు పడుతుంది. ఆ తరువాత రవివర్మ చిత్రాలను పట్టు వస్త్రం మీద ఇకత్ నేతలో రూపొందించాలనేది భరత్ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించడానికి కనీసంగా రెండేళ్లయినా శ్రమించాలి. భరత్ ఇలాగే ఒక ప్రయోగం పూర్తయిన తర్వాత మరో ప్రయోగానికి సిద్ధమవుతుంటారు. తన ప్రయోగాల కోసం చిన్న మగ్గాన్ని కూడా తయారు చేసుకున్నారు. డిజైన్లు మారుస్తుండాలి చేనేతలో ప్రముఖుల చిత్రాలను ఆవిష్కరించడమే కాదు, చేనేతకారుల జీవితాలను తెరకెక్కించడంలోనూ భరత్ చొరవ తీసుకుంటున్నారు. ‘మల్లేశం’ సినిమాతోపాటు ‘తమసోమా జ్యోతిర్గమయ’ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్గా పని చేశారు. ఈ సినిమాల్లో మహిళలు ధరించిన చీరలను భరతే డిజైన్ చేశారు. ప్రపంచంలోని ప్రధానమైన ఉపాధి రంగాల్లో వస్త్రపరిశ్రమ ముఖ్యమైందని, ఈ రంగాన్ని అర్థం చేసుకోలేకపోవడంతోనే ఇతర ఉపాధి మార్గాల వైపు మరలిపోతున్నారని చెప్పారు భరత్. ఇక ఆయన చీరల మీద చేస్తున్న ప్రయోగాలకు వస్తే... రాజ్కోట్– పటోలా కలయిక, జాకార్డ్, బ్రొకేడ్, ట్విల్ డిజైన్లను ఇకత్ మీదకు తెచ్చారు. అహింసా సిల్క్తో కూడా పని చేస్తున్నారు. నల్లి, కంకటాల, బ్రాండ్ మందిర్ వంటి ప్రముఖ వస్త్ర దుకాణాలలో ఇవన్నీ దర్శనమిస్తాయి. ‘‘గతంలో హ్యాండ్లూమ్ విలువ పెద్దగా తెలిసేది కాదు, కానీ ఇప్పుడు తెలుసుకున్నారు. హ్యాండ్లూమ్ వస్త్రాలు హుందాగా ఉంటాయి. ఈ వస్త్రధారణ వల్ల హోదా పెరుగుతుంది. మా పోచంపల్లిలో నాలుగేళ్ల కిందట ఐదువందల చేనేత మగ్గాలుండేవి, ఇప్పుడు పదిహేను వందలకు పెరిగాయి. ఇప్పుడు మార్కెట్ బాగుందని ఇక సృజనకు పని చెప్పకుండా ఇదే డిజైన్లతో కొనసాగించేయవచ్చనుకుంటే పరిశ్రమ తిరిగి మాంద్యంలోకి వెళ్లిపోతుంది. మూడేళ్లకోసారి పూర్తి భిన్నత్వం కనిపించాలి. హ్యాండ్లూమ్ మీద ఎంత ఇష్టం ఉన్నా సరే... తన బీరువాలో ఉన్న డిజైన్ చీరనే మళ్లీ కొనడానికి ఇష్టపడరు కదా’’ అన్నారు భరత్. ‘కొండంత నేత బాపూజీ ఇరవై ఏడేళ్ల భరత్ సివిల్ ఇంజనీరింగ్లో పోస్ట్గ్రాడ్యుయేట్. ఒక ప్రైవేట్ విద్యాసంస్థలో అసిస్టెంట్ ప్రొఫెసర్. ఉద్యోగం చేస్తూనే ఇన్ని ప్రయోగాలు చేస్తున్నారు. చేతినిండా డబ్బుంటే ఇకత్ చేనేతలో అద్భుతాలు సృష్టించగలనని, భారతదేశం చేనేత కళ విశిష్టత ప్రపంచవేదిక మీద ప్రదర్శితం చేయాలనేదే తన ఆకాంక్ష అనీ అన్నారు భరత్. ‘‘మా నాన్న నాకు, మా అన్నకు పదేళ్ల వయసు నుంచి మగ్గం మీద పని చేయడం నేర్పించాడు. అన్నకు తపాలా శాఖలో ఉద్యోగం. ఇద్దరమూ ఉద్యోగం చేస్తూ మాకు సాధ్యమైనంత సమయం ఇకత్ ప్రయోగాలకే కేటాయిస్తున్నాం. ఇక్కడ మీరు చూస్తున్న ఇకత్ దుపట్టాను జాతీయ అవార్డుకు పంపించాను. అయితే నా వయసు ముప్పై ఏళ్లు లేని కారణంగా యంగ్ డిజైనర్ కేటగిరీలో అప్లయ్ చేశాను. కోవిడ్ కారణంగా పరిశీలన, ఎంపిక ప్రక్రియ వాయిదా పడింది’’ అని చెప్పారు భరత్. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అందుకున్న భరత్ను ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రత్యేకంగా ప్రశంసించారు. భరత్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ’ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. లక్ష్మణ్ బాపూజీతో ఉన్న ఫొటోను, ఆయన తదనంతరం ఆయన పేరు మీద అవార్డు అందుకుంటున్న ఫొటోను చూస్తూ ‘‘నా జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలవి. ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం కూడా’’ అన్నారు భరత్. ఆగిపోకూడదు ఇకత్ నేత పూర్తిగా సృజనతో కూడిన కళ. నిరంతర ప్రయోగాలతో కొత్త ఆవిష్కరణలను తీసుకువస్తూ ఉండాలి. అప్పుడే ఈ ఉపాధిరంగం మనుగడలో ఉంటుంది. మా నేతకారులు ఆ దశాబ్దాలపాటు ఒకేరకమైన డిజైన్లకు పరిమితం అవడంతో ఈ చీరలకు ఆదరణ తగ్గిపోయింది. ఇప్పటికి మేము ప్రయోగాలకు సిద్ధమయ్యాం. ఇది ఎలాంటిదంటే... ఒక సినిమా హిట్ అయిందని అదే మూసలో వరుసగా అనేక సినిమాలు వస్తే ప్రేక్షకులు ఆదరించరు. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్తదనం కనిపించాలి. అలాగే ఇకత్ దుస్తులు కూడా. – సాయిని భరత్, నేత కళాకారుడు -
చేనేతకు సలాం
సాక్షి, యాదాద్రి: నాడు అగ్గిపెట్టెలో ఇమిడే చీరను తయారు చేసి అందరి మన్ననలను పొందారు మన చేనేత కార్మికులు. మారుతున్న కాలానికి అనుగుణంగా వారి వృత్తిలో నైపుణ్యం పెంచుకొని ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. చేనేత పరిశ్రమలను బలోపేతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక పథకాలు ప్రవేశపెట్టాయి. నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా 'సాక్షి' ప్రత్యేక కథనం. కళా నైపుణ్యానికి కేరాఫ్‌ పుట్టపాక సంస్థాన్‌ నారాయణపురం: పుట్టపాక చేనేత కళాకారుల కళా నైపుణ్యాన్ని ప్రపంచమే కీర్తిస్తుంది. ఇక్కడి చేనేత కార్మికుల ప్రాచీన కళ అయిన తేలియా రుమాల్‌ అనే వస్త్రంతో తయారు చేసిన వస్త్రాలు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నాయి. ఇక్కడి చేనేత కళా నైపుణ్యానికి రెండు పద్మశ్రీ అవార్డులతో పాటు ఎన్నో జాతీయ అవార్డులు ఈ గ్రామాన్నే వరించాయి. రెండు రోజుల క్రితం చేనేత జౌళీ శాఖ ప్రకటించిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ అవార్డులు పుట్టపాక గ్రామానికి చెందిన ఆనందం పరమేష్, గూడ శ్రీను బుధవారం అందుకోనున్నారు. యాదాద్రి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలంలోని పుట్టపాక అనే మారుమూల పల్లె చేనేత పరంగా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. ఉమ్మడి జిల్లాలో ప ట్టు వస్త్రం తయారీ ప్రారంభమయింది ఇక్కడి నుంచే. గ్రామంలో చేనేత క ళాకారుల తయారు చేసిన చేనేత వస్త్రాలు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ గ్రామ జనాభా 4, 550 ఉంటే, అందులో 3వేల జనాభా చేనేత కార్మికులదే. సాంకేతికతకు అందని డిజైన్లు.. సాంకేతికతలో కూడా గుర్తించని డిజైన్లు పుట్టపాక చేనేత కళాకారుల సృజనాత్మకతలో కనిపిస్తుంది. ఇక్కడ తయారు చేసిన వస్త్రాలకు లండన్‌ మ్యూజియం, అమెరికా అధ్యక్షుడి భవనంతో పాటు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, సోనియాగాంధీలతో పాటు ఎందరో ప్రముఖ మహిళలు, ఎందరో విదేశీ మహిళలు ఫిదా అయ్యారు. చేనేత కళాకారులు తమ కళా నైపుణ్యానికి పదును పెడుతూ, సృజనాత్మకతను వెలికి తీస్తూ, పోటీతత్వంతో అనేక కొత్త కొత్త డిజైన్లను రూపొందిస్తున్నారు. చేనేత కార్మికుడు గజం నర్సింహ కుమారుడు అంజయ్య తన తండ్రి చేసిన తేలియా రుమాళ్ల వస్త్రాలను ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త డిజైన్లను రూపొందించాడు. ఈయనతో పాటు గజం గోవర్ధన్, అంజయ్య, గోలి సాంబయ్య తదితరులు తమ హస్తకళా నైపుణ్యంతో వస్త్రాలను తయారు చేస్తున్నారు. గజం గోవర్ధన్, గజం అంజయ్యకు పద్మశ్రీ అవార్డు దక్కించుకున్నారు. గజం రాములు, రాంబాయమ్మ, గజం భగమహాఋషి, గూడ శ్రీను, గజం భద్రయ్య, పున్న కష్ణయ్య, ఏ.నాగరాజు, గజం యాదగిరి, కొలను బుచ్చిరాములు, పిల్లలమర్రి రాధాకృష్ణమూర్తి జాతీయ స్థాయి అవార్డులను అందుకున్నారు. వీరే కాక ఈ గ్రామానికి చెందిన 30 మందికి పైగా చేనేత కార్మికులు రాష్ట్రపతి సంతు కబీర్‌ అవార్డు, కమలా అవార్డు, అష్టకళా నైపుణ్య అవార్డు, జాతీయ అవార్డులతో, వ్యక్తిగతంగా చేనేత కళానైపుణ్యంతో పాటు పలు ప్రశంసలు అందుకున్నారు. చేనేత రంగంలో చేసిన సేవలకు గాను... చేనేతకు పుట్టపాక గ్రామానికి చెందిన గజం గోవర్ధన్‌ చేనేత పరిశ్రమకు జాతీయ స్థాయిలోనే గుర్తింపు తెచ్చాడు. ఈయన చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం 2011 పద్మశ్రీ అవార్డును అందజేసింది. చేనేత రంగంలో పద్మశ్రీ అవార్డు అందుకున్న మొట్టమొదటి వ్యక్తి ఈయనే. ఈయన 1949 సెప్టెంబర్‌ 1న గజం వీరయ్య, నర్సమ్మ దంపతులకు జన్మించాడు. తేలియా రుమాళ్లను ప్రకృతిసిద్ధ రంగులతో తయారు చేయడంతో ఇతని ప్రతిభ బయటపడింది. తన 21వ ఏటే ఇంట్లో మగ్గం నేయడం ప్రారంభించాడు. ఉమ్మడి జిల్లాలోనే మొదటిసారిగా రసాయన రంగుల వాడకాన్ని ప్రారంభించాడు. ప్రభుత్వ సహాయంతో 1988నుంచి విదేశాల్లో ఎగ్జిబిషన్లు నిర్వహించాడు. ఇతను చేసిన సేవలకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును అందించింది. 16 ఆకారాలు ఒకే వస్త్రంపై... ప్రకృతి రంగులతో 16 ఆకారాలు ఒకే వస్త్రంపై వేసిన గజం అంజయ్య కళా నైపుణ్యానికి 2013లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. గ్రామానికి చెంది న గజం నర్సింహ కుమారుడు అంజయ్య 6వ తరగతి వరకు చదువుకున్నాడు. తండ్రి నుంచి చేనేత కళలో మెలకువలు నేర్చుకున్నాడు. ఈయన రూపొం దించిన డిజైన్లకు అనేక రాష్ట్ర, జాతీయ అవార్డులు, ప్రశంసలు అందుకున్నాడు. డబుల్‌ ఇక్కత్‌తో తేలియా రూమాల్‌ అనే వస్త్రంపై అనేక కొత్త డిజైన్లు, వివిధ రకాలు తయారు చేయడంలో ఆరితేరాడు. డబుల్‌ ఇక్కత్‌లో భారతీయత సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఓకే వస్త్రంపై పూర్ణకుంభం, పుష్పం, పూలహరం, ముగ్గు, సూర్యుడు, చంద్రడు, ఏనుగులు, సింహాలు, గోమాత, చేపలు, పల్లకి ఇలా 16రకాల ఆకారాలను రూ పొందించాడు. ప్రకృతి రంగులతో అద్దిన ప్రత్యేక చీరను 2011లో జరిగిన ప్రపంచ క్రాప్ట్‌ సెమినార్‌లో ప్రదర్శిం చారు. అంజయ్య ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం 2013లో పద్మశ్రీ అవార్డు అందజేసి సత్కరించింది. శిక్షణ ఇవ్వాలి యువతి, యువకులకు చేనేత రం గంపై ప్రభుత్వం శిక్షణ ఇవ్వాలి. అదే విధంగా పని కల్పించాలి. ఆధునిక పద్ధతులపై శిక్షణ ఇవ్వడం వల్ల నైపుణ్యం పెరుగుతుంది. కొత్త డిజైన్ల రూపకల్పన జరుగుతుంది. – గంజి కోటేశ్వర్, కళాకారుడు ప్రభుత్వం ప్రోత్సహించాలి చేనేత కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహించాలి. అప్పుడే కళాకారులు కాలనుగుణంగా నూతన డిజైన్లు రూపొందించగలరు. అవసరమైన ముడి పదార్థాలు ప్రభుత్వం ఇవ్వాలి. అప్పుడే కళాకారుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. – గజం యాదగిరి, చేనేత కళాకారుడు చేనేతబంధు ప్రవేశపెట్టాలి రైతుల శ్రేయస్సు కోసం రైతుబంధు ప్రవేశపెట్టినట్లుగా, చేనేత కళాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేనేతబంధును పెట్టి ఆర్థికంగా ప్రోత్సాహం అందించాలి. – ఆనందం నాగరాజు, కళాకారుడు -
ప్రతీ రూపాయి నేతన్నకు అందాలి
అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: చేనేత, జౌళి శాఖకు బడ్జెట్లో కేటాయించిన రూ.1200 కోట్లలో ప్రతీ రూపాయి పారదర్శకంగా, నేరుగా చేనేత కార్మికులకు చేరాలని రాష్ట్ర పరిశ్రమలు, చేనేత శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పకడ్బందీగా మార్గదర్శకాలను రూపొందించాలని సూచించారు. చేనేత, జౌళి శాఖ అధికారులతో మంత్రి కేటీఆర్ బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. చేనేత రంగానికి ఇచ్చే ప్రత్యేక ప్రొత్సాహకాలకు అనుసరించాల్సిన విధానంపై మంత్రి చర్చించారు. చేనేత మగ్గాల గుర్తింపునకు నిర్వహిస్తున్న సర్వే గురించి మంత్రి ఆరా తీశారు. ఒకటి, రెండు రోజుల్లో సర్వే పూర్తికానుందని, ఇప్పటికే 17 వేల చేనేత మగ్గాలను గుర్తించి, జియో ట్యాగింగ్ చేశామని అధికారులు తెలిపారు. వీటిలో సొసైటీల కింద ఉన్న సంఘాలు, లేని సంఘాల వివరాలు తెలుసుకోవాలని మంత్రి ఆదేశించారు. మొత్తం ఉత్పాదక సామర్థ్యాన్ని అంచనా వేయాలని, మగ్గాలపై ఆధారపడిన చేనేత కార్మికులకు ప్రయోజనాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, ముడి పదార్థాల సమీకరణ కోసం పరిశ్రమలతో చర్చించాలని మంత్రి పేర్కొన్నారు. చేనేత వస్త్రాల కోనుగోలు ప్రక్రియను పకడ్బందీగా రూపొందించాలని, టెస్కో సంస్థాగత నిర్మాణంలో మార్పులు తీసుకురావాలని సూచించారు. టెస్కో డివిజనల్ కార్యాలయాలను పునర్వవ్యస్థీకరించాలని, స్వతంత్రంగా, పారదర్శకంగా చేనేత వస్త్రాల సమీకరణ జరిగేలా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, చేనేత సొసైటీల పనితీరుపై రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్తో తనిఖీలు చేపట్టాలని అన్నారు. సొసైటీ నిర్వహణపైన 15 రోజుల్లో ప్రత్యేక సర్వే చేపట్టి, పనిచేయని సొసైటీలపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. సమీక్షలో పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, చేనేత శాఖ డైరెక్టర శైలజా రామయ్యర్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.