చేనేతకు సలాం | Sakshi Exclusive Story On Handloom Weavers | Sakshi
Sakshi News home page

చేనేతకు సలాం

Published Wed, Aug 7 2019 1:43 PM | Last Updated on Wed, Aug 7 2019 1:43 PM

Sakshi Exclusive Story On Handloom Weavers

పద్మశ్రీ అవార్డు అందుకుంటున్న అంజయ్య (ఫైల్‌)

సాక్షి, యాదాద్రి: నాడు అగ్గిపెట్టెలో ఇమిడే చీరను తయారు చేసి అందరి మన్ననలను పొందారు మన చేనేత కార్మికులు. మారుతున్న కాలానికి అనుగుణంగా వారి వృత్తిలో నైపుణ్యం పెంచుకొని ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. చేనేత పరిశ్రమలను బలోపేతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక పథకాలు ప్రవేశపెట్టాయి.  నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా 'సాక్షి' ప్రత్యేక కథనం.

కళా నైపుణ్యానికి కేరాఫ్‌ పుట్టపాక
సంస్థాన్‌ నారాయణపురం: పుట్టపాక చేనేత కళాకారుల కళా నైపుణ్యాన్ని ప్రపంచమే కీర్తిస్తుంది. ఇక్కడి చేనేత కార్మికుల ప్రాచీన కళ అయిన తేలియా రుమాల్‌ అనే వస్త్రంతో తయారు చేసిన వస్త్రాలు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నాయి. ఇక్కడి చేనేత కళా నైపుణ్యానికి రెండు పద్మశ్రీ అవార్డులతో పాటు ఎన్నో జాతీయ అవార్డులు ఈ గ్రామాన్నే వరించాయి. రెండు రోజుల క్రితం చేనేత జౌళీ శాఖ ప్రకటించిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ అవార్డులు పుట్టపాక గ్రామానికి చెందిన ఆనందం పరమేష్, గూడ శ్రీను బుధవారం అందుకోనున్నారు. యాదాద్రి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలంలోని పుట్టపాక అనే మారుమూల పల్లె చేనేత పరంగా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. ఉమ్మడి జిల్లాలో ప ట్టు వస్త్రం తయారీ ప్రారంభమయింది ఇక్కడి నుంచే.  గ్రామంలో చేనేత క ళాకారుల తయారు చేసిన చేనేత వస్త్రాలు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ గ్రామ జనాభా 4, 550 ఉంటే, అందులో 3వేల జనాభా చేనేత కార్మికులదే. 

సాంకేతికతకు అందని డిజైన్లు..
సాంకేతికతలో కూడా గుర్తించని డిజైన్లు పుట్టపాక చేనేత కళాకారుల సృజనాత్మకతలో కనిపిస్తుంది. ఇక్కడ తయారు చేసిన వస్త్రాలకు లండన్‌ మ్యూజియం, అమెరికా అధ్యక్షుడి భవనంతో పాటు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, సోనియాగాంధీలతో పాటు ఎందరో ప్రముఖ మహిళలు, ఎందరో విదేశీ మహిళలు ఫిదా అయ్యారు.  చేనేత కళాకారులు తమ కళా నైపుణ్యానికి పదును పెడుతూ, సృజనాత్మకతను వెలికి తీస్తూ, పోటీతత్వంతో అనేక కొత్త కొత్త డిజైన్లను రూపొందిస్తున్నారు.

చేనేత కార్మికుడు గజం నర్సింహ కుమారుడు అంజయ్య తన తండ్రి చేసిన తేలియా రుమాళ్ల వస్త్రాలను ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త డిజైన్లను రూపొందించాడు. ఈయనతో పాటు గజం గోవర్ధన్, అంజయ్య, గోలి సాంబయ్య తదితరులు తమ హస్తకళా నైపుణ్యంతో వస్త్రాలను తయారు చేస్తున్నారు. గజం గోవర్ధన్, గజం అంజయ్యకు పద్మశ్రీ అవార్డు దక్కించుకున్నారు. గజం రాములు, రాంబాయమ్మ, గజం భగమహాఋషి, గూడ శ్రీను, గజం భద్రయ్య, పున్న కష్ణయ్య, ఏ.నాగరాజు, గజం యాదగిరి, కొలను బుచ్చిరాములు, పిల్లలమర్రి రాధాకృష్ణమూర్తి జాతీయ స్థాయి అవార్డులను అందుకున్నారు. వీరే కాక ఈ గ్రామానికి చెందిన 30 మందికి పైగా చేనేత కార్మికులు రాష్ట్రపతి సంతు కబీర్‌ అవార్డు, కమలా అవార్డు, అష్టకళా నైపుణ్య అవార్డు, జాతీయ అవార్డులతో, వ్యక్తిగతంగా చేనేత కళానైపుణ్యంతో పాటు పలు ప్రశంసలు అందుకున్నారు.

చేనేత రంగంలో చేసిన సేవలకు గాను...
చేనేతకు పుట్టపాక గ్రామానికి చెందిన గజం గోవర్ధన్‌ చేనేత పరిశ్రమకు జాతీయ స్థాయిలోనే గుర్తింపు తెచ్చాడు. ఈయన చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం 2011 పద్మశ్రీ అవార్డును అందజేసింది. చేనేత రంగంలో పద్మశ్రీ అవార్డు అందుకున్న మొట్టమొదటి వ్యక్తి ఈయనే. ఈయన 1949 సెప్టెంబర్‌ 1న గజం వీరయ్య, నర్సమ్మ దంపతులకు జన్మించాడు. తేలియా రుమాళ్లను ప్రకృతిసిద్ధ రంగులతో తయారు చేయడంతో ఇతని ప్రతిభ బయటపడింది. తన 21వ ఏటే ఇంట్లో మగ్గం నేయడం ప్రారంభించాడు. ఉమ్మడి జిల్లాలోనే మొదటిసారిగా రసాయన రంగుల వాడకాన్ని ప్రారంభించాడు. ప్రభుత్వ సహాయంతో 1988నుంచి విదేశాల్లో ఎగ్జిబిషన్లు నిర్వహించాడు. ఇతను చేసిన సేవలకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును అందించింది.

16 ఆకారాలు ఒకే వస్త్రంపై...
ప్రకృతి రంగులతో 16 ఆకారాలు ఒకే వస్త్రంపై వేసిన గజం అంజయ్య కళా నైపుణ్యానికి 2013లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. గ్రామానికి చెంది న గజం నర్సింహ కుమారుడు అంజయ్య 6వ తరగతి వరకు చదువుకున్నాడు. తండ్రి నుంచి చేనేత కళలో మెలకువలు నేర్చుకున్నాడు. ఈయన రూపొం దించిన డిజైన్లకు అనేక రాష్ట్ర, జాతీయ అవార్డులు, ప్రశంసలు అందుకున్నాడు. డబుల్‌ ఇక్కత్‌తో తేలియా రూమాల్‌ అనే వస్త్రంపై అనేక కొత్త డిజైన్లు, వివిధ రకాలు తయారు చేయడంలో ఆరితేరాడు.

డబుల్‌ ఇక్కత్‌లో భారతీయత సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఓకే వస్త్రంపై పూర్ణకుంభం, పుష్పం, పూలహరం, ముగ్గు, సూర్యుడు, చంద్రడు, ఏనుగులు, సింహాలు, గోమాత, చేపలు, పల్లకి ఇలా 16రకాల ఆకారాలను రూ పొందించాడు. ప్రకృతి రంగులతో అద్దిన ప్రత్యేక చీరను 2011లో జరిగిన ప్రపంచ క్రాప్ట్‌ సెమినార్‌లో ప్రదర్శిం చారు. అంజయ్య ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం 2013లో పద్మశ్రీ అవార్డు అందజేసి సత్కరించింది.

శిక్షణ ఇవ్వాలి
యువతి, యువకులకు చేనేత రం గంపై ప్రభుత్వం శిక్షణ ఇవ్వాలి. అదే విధంగా పని కల్పించాలి. ఆధునిక పద్ధతులపై శిక్షణ ఇవ్వడం వల్ల నైపుణ్యం పెరుగుతుంది. కొత్త డిజైన్ల రూపకల్పన జరుగుతుంది.
– గంజి కోటేశ్వర్, కళాకారుడు

  ప్రభుత్వం ప్రోత్సహించాలి
చేనేత కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహించాలి. అప్పుడే కళాకారులు కాలనుగుణంగా నూతన డిజైన్లు రూపొందించగలరు. అవసరమైన ముడి పదార్థాలు ప్రభుత్వం ఇవ్వాలి. అప్పుడే కళాకారుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది.
– గజం యాదగిరి, చేనేత కళాకారుడు

 చేనేతబంధు ప్రవేశపెట్టాలి
రైతుల శ్రేయస్సు కోసం రైతుబంధు ప్రవేశపెట్టినట్లుగా, చేనేత కళాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేనేతబంధును పెట్టి ఆర్థికంగా ప్రోత్సాహం అందించాలి.
 – ఆనందం నాగరాజు, కళాకారుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement