ప్రతీ రూపాయి నేతన్నకు అందాలి
అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: చేనేత, జౌళి శాఖకు బడ్జెట్లో కేటాయించిన రూ.1200 కోట్లలో ప్రతీ రూపాయి పారదర్శకంగా, నేరుగా చేనేత కార్మికులకు చేరాలని రాష్ట్ర పరిశ్రమలు, చేనేత శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పకడ్బందీగా మార్గదర్శకాలను రూపొందించాలని సూచించారు. చేనేత, జౌళి శాఖ అధికారులతో మంత్రి కేటీఆర్ బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. చేనేత రంగానికి ఇచ్చే ప్రత్యేక ప్రొత్సాహకాలకు అనుసరించాల్సిన విధానంపై మంత్రి చర్చించారు.
చేనేత మగ్గాల గుర్తింపునకు నిర్వహిస్తున్న సర్వే గురించి మంత్రి ఆరా తీశారు. ఒకటి, రెండు రోజుల్లో సర్వే పూర్తికానుందని, ఇప్పటికే 17 వేల చేనేత మగ్గాలను గుర్తించి, జియో ట్యాగింగ్ చేశామని అధికారులు తెలిపారు. వీటిలో సొసైటీల కింద ఉన్న సంఘాలు, లేని సంఘాల వివరాలు తెలుసుకోవాలని మంత్రి ఆదేశించారు. మొత్తం ఉత్పాదక సామర్థ్యాన్ని అంచనా వేయాలని, మగ్గాలపై ఆధారపడిన చేనేత కార్మికులకు ప్రయోజనాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, ముడి పదార్థాల సమీకరణ కోసం పరిశ్రమలతో చర్చించాలని మంత్రి పేర్కొన్నారు. చేనేత వస్త్రాల కోనుగోలు ప్రక్రియను పకడ్బందీగా రూపొందించాలని, టెస్కో సంస్థాగత నిర్మాణంలో మార్పులు తీసుకురావాలని సూచించారు.
టెస్కో డివిజనల్ కార్యాలయాలను పునర్వవ్యస్థీకరించాలని, స్వతంత్రంగా, పారదర్శకంగా చేనేత వస్త్రాల సమీకరణ జరిగేలా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, చేనేత సొసైటీల పనితీరుపై రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్‌తో తనిఖీలు చేపట్టాలని అన్నారు. సొసైటీ నిర్వహణపైన 15 రోజుల్లో ప్రత్యేక సర్వే చేపట్టి, పనిచేయని సొసైటీలపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. సమీక్షలో పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, చేనేత శాఖ డైరెక్టర శైలజా రామయ్యర్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.