ట్రెండ్‌కు అనుగుణంగా చేనేత పురోగమించాలి | Gautam Reddy Says handloom should progress with trend | Sakshi
Sakshi News home page

ట్రెండ్‌కు అనుగుణంగా చేనేత పురోగమించాలి

Published Sun, Aug 8 2021 2:22 AM | Last Updated on Sun, Aug 8 2021 2:22 AM

Gautam Reddy Says handloom should progress with trend - Sakshi

చేనేత వస్త్రంపై నేసిన బొమ్మను పరిశీలిస్తున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రి మేకపాటి

సాక్షి, అమరావతి: కళాత్మకత, సంస్కృతి సంప్రదాయాలకు చేనేత వస్త్రం జీవం పోస్తుందని, గాంధీజీ స్వయంగా రాట్నం ఒడికి స్వదేశీ ఉద్యమానికి నాంది పలికి బ్రిటిష్‌ వారిని తిప్పికొట్టారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. 7వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఆప్కో భవన్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఘన చరిత్ర కలిగిన చేనేత కొత్త ట్రెండ్‌లకు అనుగుణంగా పురోగమించాలని, అంతర్జాతీయ మార్కెటింగ్‌ కల్పించి నేత వస్త్రాలను శాశ్వతంగా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేనేత కార్మికుల అభివృద్ధికి పాటుపడ్డారని, మళ్లీ మన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేనేతకు ఊతమిస్తున్నారన్నారు.

పాదయాత్రలో నేత కార్మికుల కష్టాలను కళ్లారా చూసిన వైఎస్‌ జగన్‌ ‘నేతన్న నేస్తం’ పథకం ద్వారా రూ.24 వేల ఆర్థిక సాయాన్ని నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నారని చెప్పారు. చేనేత వంటి అనేక చేతి వృత్తులతో మన సంస్కృతిని సుసంపన్నం చేసి వెనకబడిన వర్గాలు నిలదొక్కుకునేలా సీఎం జగన్‌ విప్లవాత్మక చర్యలు చేపడుతున్నారన్నారు. ప్రపంచ స్థాయిలో ఆదరణ పొందేలా చేనేత కార్మికులకు ఆధునిక డిజైన్‌ వస్త్రాల తయారీ శిక్షణకు చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే ఆర్గానిక్‌ వస్త్రాల నేత, రసాయన రహిత వస్త్రాలు, కొత్త డిజైన్లు, రెడీమేడ్‌ వస్త్రాల తయారీపై రాష్ట్రంలో గట్టి కృషి జరుగుతోందని రామకృష్ణారెడ్డి అభినందించారు.

మాట నిలబెట్టుకున్న సీఎం జగన్‌: మంత్రి గౌతమ్‌రెడ్డి
చేనేత జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఉపాధి లేక ధర్మవరం ప్రాంతంలో 48 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడితే పట్టించుకున్న నాథుడే లేడన్నారు. సీఎం జగన్‌ తన పాదయాత్రలో ప్రతి చేనేత కుటుంబాన్ని ఆదుకుంటానని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారన్నారు. నేత కార్మికులను ఆదుకునేందుకు గతేడాది రూ.600 కోట్లు ఖర్చు చేశారని, ఈనెల 10న మరో రూ.200 కోట్లు నేత కార్మికులకు అందజేయనున్నట్టు తెలిపారు.  రాష్ట్రంలో ఖాదీ, చేనేత, పొందూరు తదితర బ్రాండ్‌ వస్త్రాలను నవతరానికి చేరువ చేస్తామన్నారు. సీఎం జగన్‌ చొరవతో ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వంటి వెబ్‌ పోర్టల్‌ ద్వారా చేనేత వస్త్రాలకు ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ అందుబాటులో ఉందన్నారు. దీన్ని మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తద్వారా చేనేత కార్మికులకు బాసటగా నిలుస్తామన్నారు. ఏపీ చేనేత వస్త్రాలకు ఒక బ్రాండ్‌ క్రియేట్‌ చేసి ప్రపంచంలోనే గుర్తింపు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామని గౌతమ్‌రెడ్డి అన్నారు. ఆప్కో చైర్మన్‌ చిల్లపల్లి నాగ వెంకట మోహనరావు మాట్లాడుతూ చేనేత కుటుంబాలను ఆదుకుంటున్న ఏకైక సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. 

11 మందికి సత్కారం..
చేనేత వస్త్రాల తయారీలో నూతన ఒరవడి సృష్టించి జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న 11 మందిని సత్కరించారు. మృతి చెందిన 13 మంది చేనేత కార్మికులకు సంబంధించిన కుటుంబాలకు రూ.12,500 చొప్పున ఆర్థిక సాయం అందించారు. చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శిశిభూషణ్‌ కుమార్, చేనేత జౌళి శాఖ డైరెక్టర్‌ పి.అర్జునరావు, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ పోతుల సునీత, డీసీఎంఎస్‌ చైర్‌పర్సన్‌ స్నిగ్ధ తదితరులు పాల్గొన్నారు. 

ధర్మవరం పట్టు వస్త్రాల డిజైన్‌తో తపాలా కవర్‌
ధర్మవరం పట్టు చీరలు, పావడాలపై రూపొందించిన ప్రత్యేక తపాలా కవర్‌ను ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రి మేకపాటి శనివారం ఆవిష్కరించారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని తపాలా శాఖ ఈ కవర్‌ను విడుదల చేసింది. విజయవాడలోని ఆప్కో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ధర్మవరం పట్టు వస్త్రాల ప్రత్యేకత అయిన పెద్ద బోర్డర్, కాంట్రాస్ట్‌ రంగులను ప్రతిబింబిస్తూ తపాలా కవర్‌ ఒక జరీ బుటను కలిగి ఉండటం ప్రత్యేకత. పోస్టాఫీసుల అసిస్టెంట్‌ సూపరిండెంట్‌ శ్రీనివాస్‌తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement