సవ్యసాచి అర్జునుడు. రెండు చేతులతో బాణాలను సంధించాడు! చేతిలో మంత్రమున్న నేతకారుడు భరత్. రెండు వైపుల డిజైన్‌తో దుపట్టాను నేశాడు! మగ్గంపై ప్రయోగాలు చేస్తున్నాడు. వెండితెరపై ఆర్ట్ డైరెక్షన్ ఇస్తున్నాడు. అర్జునుడు.. మత్స్యయంత్రాన్ని ఛేదించాడు. భరత్ ‘ఇకత్ ’లో నైపుణ్యాన్ని సాధించాడు.
మన జాతీయ పతాకంతో పాటు చేనేతను కాన్వాస్‌గా చేసుకుని అనేకమంది నాయకులను ఆవిష్కరించినప్పుడు తొలిసారిగా భరత్ ఎవరో, భరత్ ఏమిటో రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలిసింది. దేశపటంలో మహాత్మాగాంధీ, నాలుగు సింహాల జాతీయ చిహ్నం, భగత్‌సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, స్వామి వివేకానంద, నరేంద్రమోదీ చిత్రాలను నేశారు. అలాగే మదర్‌థెరిసా, సచిన్ టెండుల్కర్, నెల్సన్ మండేలా, చెగువేరాలకు కూడా యధాతథంగా రూపమిచ్చారు.
వచ్చే ఏడాది జూన్‌లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల ముగింపు నాటికి ఆయన చిత్రాన్ని ఇకత్‌లో తీసుకురావడానికి ఇప్పటి నుంచే నేతలో నిమగ్నమయ్యారు భరత్. ఒక వ్యక్తి ఫొటోను రూపురేఖలు మారకుండా మగ్గం మీద ఆవిష్కరించడానికి కనీసం నెల రోజులు పడుతుంది. ఆ తరువాత రవివర్మ చిత్రాలను పట్టు వస్త్రం మీద ఇకత్ నేతలో రూపొందించాలనేది భరత్ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించడానికి కనీసంగా రెండేళ్లయినా శ్రమించాలి. భరత్ ఇలాగే ఒక ప్రయోగం పూర్తయిన తర్వాత మరో ప్రయోగానికి సిద్ధమవుతుంటారు. తన ప్రయోగాల కోసం చిన్న మగ్గాన్ని కూడా తయారు చేసుకున్నారు.
డిజైన్‌లు మారుస్తుండాలి
చేనేతలో ప్రముఖుల చిత్రాలను ఆవిష్కరించడమే కాదు, చేనేతకారుల జీవితాలను తెరకెక్కించడంలోనూ భరత్ చొరవ తీసుకుంటున్నారు. ‘మల్లేశం’ సినిమాతోపాటు ‘తమసోమా జ్యోతిర్గమయ’ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఈ సినిమాల్లో మహిళలు ధరించిన చీరలను భరతే డిజైన్ చేశారు. ప్రపంచంలోని ప్రధానమైన ఉపాధి రంగాల్లో వస్త్రపరిశ్రమ ముఖ్యమైందని, ఈ రంగాన్ని అర్థం చేసుకోలేకపోవడంతోనే ఇతర ఉపాధి మార్గాల వైపు మరలిపోతున్నారని చెప్పారు భరత్. ఇక ఆయన చీరల మీద చేస్తున్న ప్రయోగాలకు వస్తే... రాజ్‌కోట్– పటోలా కలయిక, జాకార్డ్, బ్రొకేడ్, ట్విల్ డిజైన్‌లను ఇకత్ మీదకు తెచ్చారు. అహింసా సిల్క్‌తో కూడా పని చేస్తున్నారు. నల్లి, కంకటాల, బ్రాండ్ మందిర్ వంటి ప్రముఖ వస్త్ర దుకాణాలలో ఇవన్నీ దర్శనమిస్తాయి.
‘‘గతంలో హ్యాండ్‌లూమ్ విలువ పెద్దగా తెలిసేది కాదు, కానీ ఇప్పుడు తెలుసుకున్నారు. హ్యాండ్‌లూమ్ వస్త్రాలు హుందాగా ఉంటాయి. ఈ వస్త్రధారణ వల్ల హోదా పెరుగుతుంది. మా పోచంపల్లిలో నాలుగేళ్ల కిందట ఐదువందల చేనేత మగ్గాలుండేవి, ఇప్పుడు పదిహేను వందలకు పెరిగాయి. ఇప్పుడు మార్కెట్ బాగుందని ఇక సృజనకు పని చెప్పకుండా ఇదే డిజైన్‌లతో కొనసాగించేయవచ్చనుకుంటే పరిశ్రమ తిరిగి మాంద్యంలోకి వెళ్లిపోతుంది. మూడేళ్లకోసారి పూర్తి భిన్నత్వం కనిపించాలి. హ్యాండ్‌లూమ్ మీద ఎంత ఇష్టం ఉన్నా సరే... తన బీరువాలో ఉన్న డిజైన్ చీరనే మళ్లీ కొనడానికి ఇష్టపడరు కదా’’ అన్నారు భరత్.
‘కొండంత నేత బాపూజీ
ఇరవై ఏడేళ్ల భరత్ సివిల్ ఇంజనీరింగ్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్. ఒక ప్రైవేట్ విద్యాసంస్థలో అసిస్టెంట్ ప్రొఫెసర్. ఉద్యోగం చేస్తూనే ఇన్ని ప్రయోగాలు చేస్తున్నారు. చేతినిండా డబ్బుంటే ఇకత్ చేనేతలో అద్భుతాలు సృష్టించగలనని, భారతదేశం చేనేత కళ విశిష్టత ప్రపంచవేదిక మీద ప్రదర్శితం చేయాలనేదే తన ఆకాంక్ష అనీ అన్నారు భరత్. ‘‘మా నాన్న నాకు, మా అన్నకు పదేళ్ల వయసు నుంచి మగ్గం మీద పని చేయడం నేర్పించాడు. అన్నకు తపాలా శాఖలో ఉద్యోగం. ఇద్దరమూ ఉద్యోగం చేస్తూ మాకు సాధ్యమైనంత సమయం ఇకత్ ప్రయోగాలకే కేటాయిస్తున్నాం. ఇక్కడ మీరు చూస్తున్న ఇకత్ దుపట్టాను జాతీయ అవార్డుకు పంపించాను. అయితే నా వయసు ముప్పై ఏళ్లు లేని కారణంగా యంగ్ డిజైనర్ కేటగిరీలో అప్లయ్ చేశాను.
కోవిడ్ కారణంగా పరిశీలన, ఎంపిక ప్రక్రియ వాయిదా పడింది’’ అని చెప్పారు భరత్. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అందుకున్న భరత్‌ను ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రత్యేకంగా ప్రశంసించారు. భరత్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ’ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. లక్ష్మణ్ బాపూజీతో ఉన్న ఫొటోను, ఆయన తదనంతరం ఆయన పేరు మీద అవార్డు అందుకుంటున్న ఫొటోను చూస్తూ ‘‘నా జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలవి. ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం కూడా’’ అన్నారు భరత్.
ఆగిపోకూడదు
ఇకత్ నేత పూర్తిగా సృజనతో కూడిన కళ. నిరంతర ప్రయోగాలతో కొత్త ఆవిష్కరణలను తీసుకువస్తూ ఉండాలి. అప్పుడే ఈ ఉపాధిరంగం మనుగడలో ఉంటుంది. మా నేతకారులు ఆ దశాబ్దాలపాటు ఒకేరకమైన డిజైన్‌లకు పరిమితం అవడంతో ఈ చీరలకు ఆదరణ తగ్గిపోయింది. ఇప్పటికి మేము ప్రయోగాలకు సిద్ధమయ్యాం. ఇది ఎలాంటిదంటే... ఒక సినిమా హిట్ అయిందని అదే మూసలో వరుసగా అనేక సినిమాలు వస్తే ప్రేక్షకులు ఆదరించరు. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్తదనం కనిపించాలి. అలాగే ఇకత్ దుస్తులు కూడా. – సాయిని భరత్, నేత కళాకారుడు
Comments
Please login to add a commentAdd a comment