చేనేతల కోసం చేతులు కలిపారు
‘హ్యాండ్‌లూమ్ సోయిరీ’ సంస్థ ఏర్పాటుకు శ్రీకారం
ఈవెంట్లు, ఫ్యాషన్ షోలతో నిధుల సేకరణ
వృత్తిదారులకు సహకారం అందించేలా ప్రణాళిక
సాక్షి, సిటీబ్యూరో: జీవితాన్ని కాచివడబోసి మరెందరి జీవితాలనో తీర్చిదిద్దుతున్న లైఫ్ కోచ్ ఒకరు.. పల్లెటూరు నుంచి వచ్చినా ప్రముఖులకు సైతం డ్రెస్సింగ్ నేర్పుతున్న సెలబ్రిటీ డిజైనర్ మరొకరు... జెండర్ మార్చుకున్న వండర్ ఉమెన్ ఒకరైతే... ఆర్గానిక్ ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు మరొకరు... క్యాట్‌వాక్ చేసేవారిని మోడల్స్ అంటారు. కానీ, క్వీన్ వాక్ చేసేవారిని విజేతలు అంటారు.. చేనేత కళాకారుల కలల సాకారం కోసం ఇలా కాంతలంతా... విజయకాంతులై కళకళలాడారు.. వీరి విజయాలెంత ఉన్నతమైనవో.. వీరి నడక వెనుక చేనేతలకు చేయూతనివ్వాలనే లక్ష్యం అంతే సమున్నతమైనది. ‘హ్యాండ్‌లూమ్ సోయిరీ’ ఈవెంట్ నగర శివార్లలోని కోకాపేట్‌లో ఉన్న కేసీయార్ కన్వెన్షన్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకుల తరపున శాంతికృష్ణ తదితరులు ‘సాక్షి’తో తమ ఆలోచనలను పంచుకున్నారు. అవి వారి మాటల్లో...
చేనేత.. చేయూత..
గతంలో దేశవ్యాప్తంగా ఉన్న ఒక శారీ లవర్స్ గ్రూప్‌లో మేం సభ్యులుగా ఉండేవాళ్లం. ఆన్ లైన్ వేదికగా నడిచే ఆ సంస్థ ద్వారా వైవిధ్యభరితమైన చీరకట్టుతో పాటు ఆలోచనలు కూడా పంచుకునేవాళ్లం. ఆ క్రమంలోనే నగరానికి చెందిన కొందరం కలిసి, చేనేత, హస్త కళాకారుల పరిస్థితులపై చర్చించాం. వారికి ఏదో విధంగా అండగా ఉండాలని, దీన్ని ఒక సొసైటీగా మార్చాలని అనుకున్నాం. 16 మంది కమిటీ మెంబర్స్, ముగ్గురు అపెక్స్ మెంబర్స్‌తో హ్యాండ్లూమ్‌కి సాయం అందించే సొసైటీగా ఏర్పడాలని భావించాం. ఈ కార్యక్రమాలను ప్రకటించడం కోసమే ఈ ఈవెంట్ నిర్వహించాం.
ఈ సొసైటీలోని సభ్యులు అంతా తలా కొంతడబ్బు వేసుకోవడంతో పాటు విభిన్న రకాల ఈవెంట్ల నిర్వహణ ద్వారా నిధి సేకరించాలని నిర్ణయించుకున్నాం. ఆ నిధితో చేనేత హస్తకళాకారుల మరమగ్గాలు, ఇతర పరికరాల మరమ్మతుకు చేయూత అందించడం, స్కిల్ డెవలప్‌మెంట్‌లో భాగంగా కోర్సులు తయారు చేయించడం, కార్పొరేట్ కంపెనీల సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్)తో నిర్వహించే కార్యక్రమాలకు వీటిని అనుసంధానించడం, చేనేత కళాకారుల పిల్లలు ఎవరైనా తమ కళలో శిక్షణ పొందాలంటే స్కాలర్íÙప్‌లు అందించడం వంటివి చేపట్టాలని నిర్ణయించుకున్నాం.
నిధి.. సేవకు పెన్నిధి..
తరచూ మెంబర్స్ మీట్స్, గెట్ టు గెదర్స్ నిర్వహించడం కూడా ఈ సొసైటీ కార్యక్రమాల్లో భాగమే. అందులో పాల్గొన్నవారు చేనేత చీరలు ధరించి ర్యాంప్ వాక్ చేయడంతో పాటు రోజంతా ఆటపాటలు, నృత్యాలతో సందడి చేస్తారు. ఇది విభిన్న వృత్తులు, వ్యాపకాల్లో బిజీబిజీగా గడిపే మహిళలకు ఆటవిడుపుగా ఉండటంతోపాటు దీని ద్వారా సేకరించిన నిధులను ఓ మంచి సేవా కార్యక్రమానికి వినియోగించాలనేదే మా ఆలోచన.
కళ.. కళకళలాడాలనే...
మా జీవితాలతో చేనేత చీరలు, దుస్తులది విడదీయలేని అనుబంధం. ఆయా రంగాల్లో మేం ముందడుగు వేసే క్రమంలో అవి హుందాతనాన్ని అందిస్తూ, సంప్రదాయ వైభవాన్ని పెంచాయి. అలాంటి చేనేత కళ భావితరాలకు సైతం అందాలనే ఆలోచనతోనే ఈ సొసైటీకి రూపకల్పన చేశాం. ఈ ఫస్ట్ ఈవెంట్ సక్సెస్ అవడం మాకు సంతోషాన్ని ఇచి్చంది. ఇకపై కూడా వీలున్నన్ని ఈవెంట్స్ నిర్వహించి చేనేత కళాకారులకు చేయూత అందిస్తాం. మాతో చేతులు కలపాలని
అనుకునేవారిని ఆహా్వనిస్తున్నాం. – శాంతికృష్ణ, నిర్వాహకురాలు
Comments
Please login to add a commentAdd a comment