కొడుకుకు తల్లి భారమా? - సాగుతున్న తీర్థయాత్ర
ఆ అభినవ శ్రవణకుమారుడి పేరు కైలాస్‌గిరి. ఎవరీ కైలాస్‌గిరి? ఆయన చేస్తున్న పని ఏమిటి? ఆయనపై ఎందుకీ ప్రశంసల జల్లులు..? వివరాలు తెలుసుకోవాలంటే... కైలాస్ గిరి వెళ్లే దారిలో మనమూ ఆయనతో పాటే కాసేపు ప్రయాణించాలి. నలభై ఎనిమిదేళ్ల ఏళ్ల కైలాస్‌గిరి బ్రహ్మచారి. ఇరవై ఏళ్ల కిందటి వరకు మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ సమీపంలోని స్వగ్రామమైన పిపరియాలో జీవించేవాడు. తొంభై ఏళ్ల అంధురాలైన తల్లి కేతకీదేవీ తప్ప అతనికి మరో బంధం లేదు. పెళ్లి చేసుకోమని ఊళ్లో చాలామందే చెప్పి చూశారు.
తల్లి కూడా ఎంతగానో చెప్పింది ‘అంధురాలైన నన్ను చూసుకోవడానికి ఒకరు తోడుంటారు’ కదా! అని. కైలాస్‌గిరి వినలేదు. పైగా తను చేయాలనుకుంటున్న పని ఒకటుందని చెప్పాడు. ఆ మాట విన్న తల్లి మొదట ఆశ్చర్యపోయింది. ఎందుకంత కష్టం? అని బాధపడింది. అమ్మకు మెల్లగా నచ్చజెప్పాడు కైలాశ్. ఆమె అప్పటికి సరేనంది. కానీ, ఆ తర్వాత ఎన్నో సందేహాలు వెలిబుచ్చింది. తీర్థయాత్రలు అంటే బోలెడంత డబ్బు కావాలి.
అంతంత దూరం నడకమార్గం అంటే... ఏడు పదుల వయసులో తన వల్ల అయ్యే పని కాదని, పైగా తన అంధత్వం ఈ ప్రయాణానికి అడ్డంకి అని చెప్పింది. కైలాస్ బాగా ఆలోచించాడు. ఓ ఆలోచన అతడికి ఎంతో ఆనందాన్నిచ్చింది. మందపాటి వెదురు కర్రకు రెండువైపులా బుట్టలు ఏర్పాటు చేశాడు. ముందు బుట్టలో తల్లిని కూర్చోమన్నాడు. వెనక బుట్టలో కావల్సిన వస్తువులను కట్టుకున్నాడు. అలా తయారుచేసుకున్న కావడిని భుజానికెత్తుకున్నాడు.
ఇలా 20 ఏళ్ల కిందట భుజానికెత్తుకున్న కావడితో అలుపులేకుండా ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించాడు. దారి పొడవునా కనిపించిన విశేషాలను, దర్శించుకున్న క్షేత్రాల ప్రశస్తిని అమ్మకు కళ్లకు కట్టినట్టు చెబుతూనే ఉన్నాడు.
తల్లి ఆకాంక్షే పెట్టుబడిగా!
జన్మనిచ్చిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వదిలించుకుంటున్న బిడ్డలున్న మన సమాజంలో కన్నతల్లిని 20 ఏళ్లుగా మోస్తూ ప్రముఖ దేవాలయాలను దర్శింపజేస్తూ తల్లి ఆకాంక్షను నెరవేరుస్తున్న ఈ అభివన శ్రవణ కుమారుడిని అంతా ప్రశంసిస్తున్నారు. ఇప్పటి వరకు భుజాన కావడిలో తల్లిని మోసుకుంటూ కాలినడకన 36,582 కిలోమీటర్లు ప్రయాణించాడు. దారిలో మీడియా ప్రతినిధులు పలకరించిన ప్రతీసారి అతను వినమ్రంగా వివరాలు తెలుపుతూనే ఉన్నాడు.
‘‘నా పదేళ్ల వయసులో మా నాన్న, అన్న, అక్క చనిపోయారు. నాకు 14 ఏళ్ల వయసున్నప్పుడు చెట్టు మీద నుంచి పడిపోయాను. స్థోమత లేకపోయినా అప్పులు చేసిన నాకు వైద్యం చేయించింది అమ్మ. అయినా నేను బతకడం కష్టమన్నారు వైద్యులు. మా అమ్మ ఎన్నో పూజలు చేసింది. ఎంతోమంది దేవుళ్లకు, ఎన్నో పుణ్యతీర్థాలకు నడిచి వస్తానని మొక్కుకుంది.
ఆమె ప్రార్థనల ఫలితంగానే నేను బతికాను. కానీ, ఈ పుణ్యక్షేత్రాలను దర్శించాలంటే తను పుట్టు అంధురాలు. తోడు ఎవరూలేనిదే ఎటూ వెళ్లలేదు. నేను కాకపోతే ఆమె మొక్కులను, ఆకాంక్షలను ఇంకెవరు తీరుస్తారు’’ అంటూనే దించిన కావడిని మళ్లీ భుజానికెత్తుకుంటూ ముందుకు సాగుతాడు కైలాస్‌గిరి. ఈ దేశవ్యాప్త పర్యటన తనకెంతో సంతోషం కలిగించిందని, దారిలో ఎంతోమంది తమకు సాయం చేశారని, వారిందరికీ కృతజ్ఞతులు తెలుపుతుంటాడు ఈ బాటసారి.
ఆశీస్సులే జీవితం
దారిలో వెళుతుంటే ఎవరో ఒకరు ఆ రోజుకి తల్లీ, కొడుక్కి ఆహారం పెట్టడం, చేతి ఖర్చులకు ఎంతో కొంత పైకం ఇవ్వడం ఇస్తుంటారు. లేదంటే, కైలాస్ తానే వంట చేసి తల్లికి తినిపిస్తాడు. ఆమెకు ఇష్టమైన రోటీలను చేస్తాడు. ‘‘నా కొడుకు చాలా గొప్పవాడు. వాడి కష్టం నాకు అర్థమవుతోంది. నేనూ అవసాన దశలో ఉన్నాను. త్వరగా అలసిపోతున్నాను.
కొన్నిసార్లు ఇంకెప్పుడు ఇంటికెళ్లిపోతామని అడుగుతుంటాను’ తలమీదుగా తెల్లటి పైటకొంగును ముందు జరుపుకుంటూ చెబుతుంది కేతకీదేవి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోని ప్రధాన పుణ్యక్షేత్రాలన్నింటికీ కైలాస్‌గిరి తన తల్లిని తీసుకుపోయాడు. ‘ఇప్పటికే చాలా క్షేత్రాలను దర్శించుకున్నాను. ఇక భగవంతుడిలో ఐక్యం కావడమే మిగిలి ఉంది’ సంతృప్తిగా అంటారు కేతకీదేవి.