సాక్షి, ముంబై: ఎన్నికలు సమీపించడంతో బరిలో దిగిన అభ్యర్థుల్లో కొందరు పుణ్యక్షేత్రాల బాట పట్టారు. ఈ ఎన్నికల్లో తమకు విజయం తప్పకుండా వరించాలని, ఎలాంటి విఘ్నాలు ఎదురుకాకుండా చూడాలని కోరుతూ పూజలు, హోమాలు చేస్తున్నారు. మరికొందరు తమ పరువు పోకుండా కనీసం డిపాజిట్ దక్కేలా చూడు స్వామి అని వేడుకుంటున్నారు.
లోక్‌సభ, శాసన సభ, స్థానిక సంస్థలకు ఇలా ఎలాంటి ఎన్నికలు జరిగినా అభ్యర్థులను గెలిపించేది ఓటరు మహాశయులే. అయినప్పటికీ అభ్యర్థులు రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు అప్పుడే బయలుదేరారు. కొందరు స్థానికంగా ఉన్న గుళ్లు, గోపురాల్లో పూజలుచేయగా మరికొందరు సాధు, సంతువులు, సన్యాసుల ఆశీర్వాదం పొందేందుకు వారు బసచేసిన మఠాలకు బయలుదేరారు.
ముంబైలోని ప్రముఖ సిద్ధివినాయక, మహాలక్ష్మి మందిరాలతోపాటు రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీలోని సాయిబాబాను, తిరుపతిలోని బాలాజీ, కొల్హొపూర్‌లోని మహాలక్ష్మి ఆలయం, వాషి, శేగావ్, యావత్మాల్, నాగపూర్‌లోని దుర్గమాత మందిరాలు, బుల్డాణ జిల్లాలో ప్రముఖ ఆలయం, మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని భయ్యూజీ మహారాజ్ కొందరైతే దర్గాను కూడా వదలడం లేదు. అందులోని ముస్లీం మత గురువులకు మొక్కుతున్నారు. కాని ఎన్ని గుళ్లకు, గోపురాలకు మొక్కుకున్న, పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు చేసిన చివరకు ఎన్నికల్లో అంతిమ తీర్పునిచ్చేది ఓటర్లు మాత్రమేనని వీరు గుర్తించకపోవడం గమనార్హం.
పుణ్యక్షేత్రాల బాటపట్టిన అభ్యర్థులు
Published Mon, Sep 29 2014 11:25 PM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM
Advertisement