prakash district
-
హత్యలు చేసి... పుణ్యక్షేత్రాల్లో మకాం!
మార్కాపురం: అనుమానంతో భార్యను, ఆపై ఆమె తల్లిని హత్య చేసిన నిందితుడు పరారై.. పోలీసులకు దొరక్కుండా ఎనిమిది నెలలుగా పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ముప్పు తిప్పలు పెట్టాడు. చివరికి పోలీసులకు పట్టుబడ్డాడు. ప్రకాశం జిల్లా మార్కాపురం డీఎస్పీ డాక్టర్ యు.నాగరాజు శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం యర్రగొండపాలెం మండలం యల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రేళ్ల శ్రీనుకు, వేములకోట గ్రామానికి చెందిన కన్నెసాని నారాయణమ్మ కుమార్తె సునీతతో వివాహమైంది.భార్యపై అనుమానంతో తరచుగా వేధింపులకు గురిచేసేవాడు. ఈ నేపథ్యంలో 2023 మార్చి 14న వేములకోటలోని తన అత్తగారింట్లో ఉన్న భార్య సునీతను రోకలిబండతో హత్యచేసి పరారయ్యాడు. పోలీసులు అరెస్టుచేసి జైలుకు పంపగా బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే శ్రీను తన అత్త నారాయణమ్మను కూడా హతమార్చాలని నిర్ణయించుకుని గతేడాది జూన్ 30వ తేదీ రాత్రి వేములకోటలోని తన ఇంటిలో నిద్రపోతున్న ఆమెను కత్తితో విచక్షణా రహితంగా నరికి చంపి పారిపోయాడు. ఈ సంఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పుణ్యక్షేత్రాల్లో నివాసం..నిందితుడైన శ్రీను హత్య కేసుల నుంచి తప్పించుకునేందుకు పుణ్యక్షేత్రాల్లో నివాసమున్నట్లు పోలీసులు గుర్తించారు. సెల్‌ఫోన్ వాడితే తనను పోలీసులు పట్టుకుంటారని భావించి దారిన పోయేవారి సెల్‌ఫోన్ తీసుకుని తెలిసిన వారికి ఫోన్‌చేస్తూ సమాచారం కనుక్కుంటూ ఉండేవాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు శ్రీనుకు తెలిసిన వారి ఫోన్నంబర్లపై నిఘా పెట్టారు. సీఐ సుబ్బారావు, రూరల్ ఎస్సై అంకమరావు ప్రత్యేక టీమును ఏర్పాటు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు.నిందితుడైన శ్రీను షిరిడీ, కాశీ, వేములవాడ, రామేశ్వరం, చెన్నై, పూణే తదితర ప్రాంతాల్లో ఉంటూ ఒక చోట టీ మాస్టరుగా, మరోచోట దోసె మాస్టరుగా హోటల్లో పనిచేస్తూ ఎక్కడా పట్టుమని 10 రోజులు కూడా ఉండకుండా మకాంలు మారుస్తూ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతూ వచ్చాడు. కాగా నిందితుడు ఎక్కడ ఉన్నా శివాలయానికి వెళ్తాడని పోలీసులు గుర్తించి మాటు వేశారు. తిరుత్తణి దగ్గర త్రుటిలో తప్పించుకున్న శ్రీను శ్రీశైలం నుంచి త్రిపురాంతకం వెళ్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగా శనివారం దేవరాజుగట్టు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద గాలింపు చర్యలు చేపట్టగా నిందితుడు పట్టుబడ్డాడు. అరెస్ట్ అనంతరం నిందితుడిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. పోలీసు సిబ్బందికి రివార్డులు.. ఎనిమిది నెలలలుగా తప్పించుకుని తిరుగుతూ ముప్పుతిప్పలు పెట్టిన శ్రీనును అరెస్టు చేసే విషయంలో కీలకంగా వ్యవహరించిన డీఎస్పీ నాగరాజు, సీఐ సుబ్బారావు, రూరల్ ఎస్సై అంకమరావు, ఏఎస్సైలు ఎస్కే జిలానీ, డీ శ్రీనివాసరావు, సిబ్బంది వెంకటేశ్వర్లు, అరుణగిరి ఆంజనేయులు, జె వెంకటేశ్వర్లును ఎస్పీ దామోదర్ అభినందించారు. డీఎస్పీ నాగరాజు పలువురికి నగదు బహుమతి అందజేశారు. ప్రెస్మీట్లో సీఐ సుబ్బారావు, ఎస్సైలు అంకమరావు, సైదుబాబు పాల్గొన్నారు. -
లైంగికంగా వేధించారా.. సాక్ష్యం ఉందా!?
ఒంగోలు టౌన్: ‘ఏంటి.. లైంగికంగా వేధించారా.. సాక్ష్యం ఏమైనా ఉందా’.. న్యాయం కోసం పోలీస్‌స్టేషన్ గడప తొక్కిన బాధిత మహిళకు బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్న సీఐ నుంచి ఎదురైన ప్రశ్న ఇది. సాక్ష్యం ఉంటేనే కేసు పెడతామని పోలీసు అధికారి చెప్పడంతో ఆమె బిత్తరపోయింది. పోలీసులు, అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయిన బాధితురాలు చివరికి మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. బాధితురాలి కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని రాజీవ్ గృహకల్ప సముదాయంలోని ప్రభుత్వ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఓ మహిళ పనిచేస్తోంది. అదే ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న సురేంద్రబాబు, డీఈఓ మహమ్మద్ అన్సారీలు లైంగికంగా వేధిస్తున్నారంటూ సదరు మహిళ అక్టోబరు 18న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ ఏఆర్ దామోదర్‌కు ఫిర్యాదు చేసింది. ఆయన తాలుకా పోలీసుస్టేషన్‌కు రిఫర్ చేశారు. విచారణ కోసం రమ్మంటూ మరుసటి రోజు తాలుకా పోలీసుస్టేషన్ నుంచి పిలుపు రాగా.. ఆమె వెళ్లి సీఐ అజయ్‌కుమార్‌కు తన సమస్య చెప్పుకుంది. వారిరువురూ ద్వంద్వార్ధాలతో కామెంట్ చేస్తున్నారని వాపోయింది. సీఐ స్పందిస్తూ.. ‘నీ మాటలు నమ్మశక్యంగా లేవు, నీ వద్ద వీడియోలు ఉంటే తీసుకురా’.. అని చెప్పారు.తన దగ్గర ఎలాంటి వీడియోల్లేవని, ఒక మహిళ సిగ్గు విడిచి తనను లైంగికంగా వేధిస్తున్నారని ఊరికే ఎలా చెబుతుందని ప్రశ్నించింది. ఇది జరిగి నెలరోజులైనా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఆమెపై వేధింపులు ఎక్కువయ్యాయి. ఆస్పత్రిలో పనిచేసే మహిళలతో డీఎంహెచ్ఓకు ఫిర్యాదు చేయించారు. అలాగే, స్థానిక టీడీపీ నేతలు చంద్రశేఖర్, భాస్కర్ బెదిరిస్తున్నారు. దీంతో బాధిత మహిళ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌కు కలిసి తన గోడు చెప్పుకుంది. అయినా ప్రయోజనం లేకపోయేసరికి ఎస్పీని కలిసేందుకు జిల్లా పోలీసు కార్యాలయానికి వెళితే అక్కడ సిబ్బంది ఆమెను ఎస్పీ వద్దకు వెళ్లనీయలేదు.ఇక దిక్కుతోచని స్థితిలో మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్, డీజీపీలకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపింది. పైనుంచి వచ్చిన కేసులు విచారించి నివేదిక పైకి పంపిస్తామని, బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు తప్పని తేలిందని సీఐ అజయ్‌కుమార్ చెబుతున్నారు. -
రెవెన్యూ శాఖలో భారీ బదిలీలు
నెల్లూరు (కలెక్టరేట్),న్యూస్‌లైన్: జిల్లాలో రెవెన్యూ శాఖలో భారీ బదిలీలు జరిగాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో 29 మంది తహశీల్దార్లను గుంటూరు, ప్రకాశం జిల్లాలకు బదిలీ చేస్తూ మంగళవారం కలెక్టర్ శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో 20 మంది గుంటూరుకు తొమ్మిది మంది ప్రకాశం జిల్లాకు బదిలీ అయ్యారు. గుంటూరుకు బదిలీ అయిన వారిలో నెల్లూరు తహశీల్దార్ నరసింహులు, వెంకటాచలం తహశీల్దార్ శ్రీనివాసులురెడ్డి, పొదలకూరు తహశీల్దార్ రామకృష్ణ, గూడూరు తహశీల్దార్ మైత్రేయ, విడవలూరు తహశీల్దార్ కేవీ రమణయ్య, ఆత్మకూరు తహశీల్దార్ వెంకటేశ్వర్లు, అనుమసముద్రం తహశీల్దార్ రామాంజనేయులు, తడ తహశీల్దార్ మునిలక్ష్మి, వింజమూరు తహశీల్దార్ కృష్ణారావు, కావలి ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్న రత్నశేఖర్, అల్లూరు తహశీల్దార్ ఉమాదేవి, దగదర్తి తహశీల్దార్ జయప్రకాష్, గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఎస్.వరకుమార్, కోట తహశీల్దార్ చిన్నయ్య, వాకాడు తహశీల్దార్ బి.వెంకట శ్రీనివాసులు, సైదాపురం తహశీల్దార్ కె.భాస్కర్, చిట్టమూరు తహశీల్దార్ శ్రీనివాసులు, కలెక్టరేట్లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న జి.వెంకటేశ్వర్లు, డక్కిలి తహశీల్దార్ ఎం. చెంచుకృష్ణమ్మ, నాయుడుపేట తహశీల్దార్ పి. జనార్దన్‌రావు ఉన్నారు. అలాగే ప్రకాశం జిల్లాకు బదిలీ అయిన వారిలో తోటపల్లి గూడూరు తహశీల్దార్ ఎస్. రేవతి, ముత్తుకూరు తహశీల్దార్ సుశీల, కోవూరు తహశీల్దార్ సాంబశివరావు, కొడవలూరు తహశీల్దార్ ఎ.శ్రీశిల్ప, చేజర్ల తహశీల్దార్ బి.లీలారాణి, సంగం తహశీల్దార్ ఎస్.శ్రీకాంత్, బాలాయపల్లి తహశీల్దార్ ఎం.పూర్ణచంద్రరావు, సూళ్లూరుపేట తహశీల్దార్ ఎం.రోజ్‌మాండ్, కలెక్టరేట్ ఏఓగా పనిచేస్తున్న మధుసూదన శర్మ ఉన్నారు. -
మానవత్వమా.. ఎక్కడ?
మానవత్వాన్ని మరచిన కొందరు ఒక వ్యక్తి మృతదేహాన్ని తమ గ్రామంలోకి తీసుకురావద్దంటూ అడ్డుకున్నారు. దీంతో సుమారు 8 గంటల సేపు నెల్లూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దులోని రాళ్లపాడు రిజర్వాయరుపై మృతదేహాన్ని అంబులెన్స్‌లోనే ఉంచాల్సిన పరిస్థితి మంగళవారం దాపురించింది. కొండాపురం, న్యూస్‌లైన్ : కొండాపురం మండలం సాయిపేట పంచాయతీ వెల్లటూరిపాళెంలో నివాసం ఉం టున్న కోటా బాబుది స్వస్థలం ప్రకాశం జిల్లా లింగసముద్రం. బాబు తన భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెతో ఏడేళ్లు వెల్లటూరివారిపాళెంలోనే ఆర్ఎంపీగా వైద్యం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. వచ్చే సంపాదన కుటుంబ పోషణకు చాలకపోవడంతో గతేడాది ఫిబ్రవరి 13న సౌదీలోని అల్ హసన్ అనే పట్టణానికి పొట్టకూటికి వెళ్లాడు. అక్కడ పని చేస్తున్న సమయంలో ప్రమాదానికి గురై అదే సంవత్సరం జూలై 31వ తేదీన మరణించాడు. అప్పటి నుంచి బాబు భార్య ధనమ్మ, బంధువులు అతడి మృదేహాన్ని మనదేశం తీసుకొచ్చేందుకు నానాకష్టాలు పడ్డారు. ఈ నెల మూడో తేదీ మధ్యాహ్నం బాబు మృతదేహం చెన్నైకి చేరుకుంది. అక్కడికి మృతుడి భార్య, కుమారులు, కుమార్తెతో పాటు, స్నేహితులు, బంధువులు కలసి 14 మం ది వరకు వెళ్లారు. చెన్నై ఎయిర్‌పోర్టులో ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న అనంతరం అంబులెన్స్‌లో అతడి మృతదేహాన్ని లింగసముద్రం తరలిం చారు. అందులోనే భార్యా బిడ్డలు, బంధువులు, స్నేహితులు కూడా ఎక్కారు. అంబులెన్స్ మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు కావలి సమీపంలోని కోవూరుపల్లి వద్ద ఒకలారీని ఢీకొంది. ఈ ఘ టనలో అంబులెన్స్‌లో ముందు వైపు కూర్చున్న మృతుని బంధువులు చిన సత్యం, మాధవరావుకు గాయాలయ్యాయి. అంబులెన్స్ కూడా బాగా దెబ్బతింది. వేరే అంబులెన్స్‌లో మృతదేహాన్ని తరలించారు. క్షతగాత్రులను కావలిలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. మృతదేహాన్ని తీసుకొస్తున్న అంబులెన్స్ ఉదయం ఆరు గంటలకు రాళ్లపాడు రిజర్వాయరుపైకి చేరుకునే సరికి లింగసముద్రానికి చెందిన కొందరు బాబు మృతదేహాన్ని ఊళ్లోకి తీసుకు రావడం మంచిది కాదని అడ్డుకున్నారు. మృతదేహాన్ని చెన్నై నుంచి తీసుకొచ్చే సమయంలో అంబులెన్స్ ప్రమాదానికి గురికావడం, అందులోని వారు గాయపడడం అరిష్టమని, ఊళ్లోకి తీసుకురావడం మంచిది కాదని రిజర్వాయర్‌పైనే మధ్యాహ్నం రెండు గంటల వరకు నిలిపేశారు. అప్పటికే అక్కడకు విలేకరులు చేరుకోవడంతో పాటు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. లింగసముద్రం సర్పంచ్ ఉమ్మడిశెట్టి నాగేశ్వరరావు మధ్యాహ్నం 2 గంటల సమయంలో మృతదేహం వద్దకు చేరుకుని గ్రామస్తులకు సర్ది చెప్పారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లకుండా నేరుగా శ్మశానవాటికకు తీసుకెళ్లేవిధంగా ఒప్పించారు. దీంతో బాబు మృతదేహాన్ని శ్మశానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహం రిజర్వాయరుపై ఉన్నంత సేపు అటుగా వెళ్తున్న ప్రయాణికులు విషయం తెలుసుకుని ఇదేమి దారుణం అంటూ నిట్టూరుస్తూ వెళ్లారు. మానవత్వం మంటగలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు.