న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన మహిళకు అవమానం
సాక్ష్యం ఉంటేనే కేసు పెడతామన్న సీఐ
ఒంగోలు తాలూకా పోలీసుస్టేషన్‌లో ఘటన
కేసు పెట్టిందన్న కక్షతో బాధితురాలిపై మరింతగా వేధింపులు
టీడీపీ నాయకుల నుంచి కూడా బెదిరింపులు
ఒంగోలు టౌన్: ‘ఏంటి.. లైంగికంగా వేధించారా.. సాక్ష్యం ఏమైనా ఉందా’.. న్యాయం కోసం పోలీస్‌స్టేషన్ గడప తొక్కిన బాధిత మహిళకు బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్న సీఐ నుంచి ఎదురైన ప్రశ్న ఇది. సాక్ష్యం ఉంటేనే కేసు పెడతామని పోలీసు అధికారి చెప్పడంతో ఆమె బిత్తరపోయింది. పోలీసులు, అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయిన బాధితురాలు చివరికి మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. బాధితురాలి కథనం ప్రకారం..
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని రాజీవ్ గృహకల్ప సముదాయంలోని ప్రభుత్వ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఓ మహిళ పనిచేస్తోంది. అదే ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న సురేంద్రబాబు, డీఈఓ మహమ్మద్ అన్సారీలు లైంగికంగా వేధిస్తున్నారంటూ సదరు మహిళ అక్టోబరు 18న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ ఏఆర్ దామోదర్‌కు ఫిర్యాదు చేసింది. ఆయన తాలుకా పోలీసుస్టేషన్‌కు రిఫర్ చేశారు. విచారణ కోసం రమ్మంటూ మరుసటి రోజు తాలుకా పోలీసుస్టేషన్ నుంచి పిలుపు రాగా.. ఆమె వెళ్లి సీఐ అజయ్‌కుమార్‌కు తన సమస్య చెప్పుకుంది. వారిరువురూ ద్వంద్వార్ధాలతో కామెంట్ చేస్తున్నారని వాపోయింది. సీఐ స్పందిస్తూ.. ‘నీ మాటలు నమ్మశక్యంగా లేవు, నీ వద్ద వీడియోలు ఉంటే తీసుకురా’.. అని చెప్పారు.
తన దగ్గర ఎలాంటి వీడియోల్లేవని, ఒక మహిళ సిగ్గు విడిచి తనను లైంగికంగా వేధిస్తున్నారని ఊరికే ఎలా చెబుతుందని ప్రశ్నించింది. ఇది జరిగి నెలరోజులైనా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఆమెపై వేధింపులు ఎక్కువయ్యాయి. ఆస్పత్రిలో పనిచేసే మహిళలతో డీఎంహెచ్‌ఓకు ఫిర్యాదు చేయించారు. అలాగే, స్థానిక టీడీపీ నేతలు చంద్రశేఖర్, భాస్కర్ బెదిరిస్తున్నారు. దీంతో బాధిత మహిళ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌కు కలిసి తన గోడు చెప్పుకుంది. అయినా ప్రయోజనం లేకపోయేసరికి ఎస్పీని కలిసేందుకు జిల్లా పోలీసు కార్యాలయానికి వెళితే అక్కడ సిబ్బంది ఆమెను ఎస్పీ వద్దకు వెళ్లనీయలేదు.
ఇక దిక్కుతోచని స్థితిలో మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్, డీజీపీలకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపింది. పైనుంచి వచ్చిన కేసులు విచారించి నివేదిక పైకి పంపిస్తామని, బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు తప్పని తేలిందని సీఐ అజయ్‌కుమార్ చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment