మానవత్వాన్ని మరచిన కొందరు ఒక వ్యక్తి మృతదేహాన్ని తమ గ్రామంలోకి తీసుకురావద్దంటూ అడ్డుకున్నారు. దీంతో సుమారు 8 గంటల సేపు నెల్లూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దులోని రాళ్లపాడు రిజర్వాయరుపై మృతదేహాన్ని అంబులెన్స్‌లోనే ఉంచాల్సిన పరిస్థితి
మంగళవారం దాపురించింది.
కొండాపురం, న్యూస్‌లైన్ : కొండాపురం మండలం సాయిపేట పంచాయతీ వెల్లటూరిపాళెంలో నివాసం ఉం టున్న కోటా బాబుది స్వస్థలం ప్రకాశం జిల్లా లింగసముద్రం. బాబు తన భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెతో ఏడేళ్లు వెల్లటూరివారిపాళెంలోనే ఆర్‌ఎంపీగా వైద్యం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. వచ్చే సంపాదన కుటుంబ పోషణకు చాలకపోవడంతో గతేడాది ఫిబ్రవరి 13న సౌదీలోని అల్ హసన్ అనే పట్టణానికి పొట్టకూటికి వెళ్లాడు. అక్కడ పని చేస్తున్న సమయంలో ప్రమాదానికి గురై అదే సంవత్సరం జూలై 31వ తేదీన మరణించాడు. అప్పటి నుంచి బాబు భార్య ధనమ్మ, బంధువులు అతడి మృదేహాన్ని మనదేశం తీసుకొచ్చేందుకు నానాకష్టాలు పడ్డారు. ఈ నెల మూడో తేదీ మధ్యాహ్నం బాబు మృతదేహం చెన్నైకి చేరుకుంది. అక్కడికి మృతుడి భార్య, కుమారులు, కుమార్తెతో పాటు, స్నేహితులు, బంధువులు కలసి 14 మం ది వరకు వెళ్లారు. చెన్నై ఎయిర్‌పోర్టులో ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న అనంతరం అంబులెన్స్‌లో అతడి మృతదేహాన్ని లింగసముద్రం తరలిం చారు. అందులోనే భార్యా బిడ్డలు, బంధువులు, స్నేహితులు కూడా ఎక్కారు. అంబులెన్స్ మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు కావలి సమీపంలోని కోవూరుపల్లి వద్ద ఒకలారీని ఢీకొంది. ఈ ఘ టనలో అంబులెన్స్‌లో ముందు వైపు కూర్చున్న మృతుని బంధువులు చిన సత్యం, మాధవరావుకు గాయాలయ్యాయి. అంబులెన్స్ కూడా బాగా దెబ్బతింది. వేరే అంబులెన్స్‌లో మృతదేహాన్ని తరలించారు. క్షతగాత్రులను కావలిలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.
మృతదేహాన్ని తీసుకొస్తున్న అంబులెన్స్ ఉదయం ఆరు గంటలకు రాళ్లపాడు రిజర్వాయరుపైకి చేరుకునే సరికి లింగసముద్రానికి చెందిన కొందరు బాబు మృతదేహాన్ని ఊళ్లోకి తీసుకు రావడం మంచిది కాదని అడ్డుకున్నారు. మృతదేహాన్ని చెన్నై నుంచి తీసుకొచ్చే సమయంలో అంబులెన్స్ ప్రమాదానికి గురికావడం, అందులోని వారు గాయపడడం అరిష్టమని, ఊళ్లోకి తీసుకురావడం మంచిది కాదని రిజర్వాయర్‌పైనే మధ్యాహ్నం రెండు గంటల వరకు నిలిపేశారు. అప్పటికే అక్కడకు విలేకరులు చేరుకోవడంతో పాటు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. లింగసముద్రం సర్పంచ్ ఉమ్మడిశెట్టి నాగేశ్వరరావు మధ్యాహ్నం 2 గంటల సమయంలో మృతదేహం వద్దకు చేరుకుని గ్రామస్తులకు సర్ది చెప్పారు.
మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లకుండా నేరుగా శ్మశానవాటికకు తీసుకెళ్లేవిధంగా ఒప్పించారు. దీంతో బాబు మృతదేహాన్ని శ్మశానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహం రిజర్వాయరుపై ఉన్నంత సేపు అటుగా వెళ్తున్న ప్రయాణికులు విషయం తెలుసుకుని ఇదేమి దారుణం అంటూ నిట్టూరుస్తూ వెళ్లారు. మానవత్వం మంటగలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మానవత్వమా.. ఎక్కడ?
Published Wed, Feb 5 2014 3:18 AM | Last Updated on Sat, Aug 18 2018 2:15 PM
Advertisement
Advertisement