kondapuram
-
ఖమ్మం అమ్మాయి.. నెల్లూరు అబ్బాయి.. పారిపోయి వచ్చి..
సాక్షి, నెల్లూరు(కొండాపురం): ప్రేమించి వివాహం చేసుకున్న ఓ ప్రేమజంట పెద్దల నుంచి రక్షణ కల్పించాలని కొండాపురం పోలీసులను గురువారం ఆశ్రయించింది. వివరాలు.. పామూరు మండలం కుంటపల్లికి చెందిన గురవయ్య, వరలక్ష్మి దంపతులు. వారు కుమారుడు గురుబ్రహ్మంతో కలిసి తెలంగాణం రాష్ట్రం ఖమ్మంలో నివాసం ఉంటున్నారు. అక్కడ పీ సంధ్య అనే యువతితో గురుబ్రహ్మానికి పరిచయం ఏర్పడింది. ఇరువురు ఏడాది పాటు ప్రేమించుకున్నారు. కులాంతర వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో పారిపోయి ఐదు రోజుల క్రితం వివాహం చేసుకున్నారు. కొండాపురంలోని యువకుడి బంధువుల వద్దకు చేరుకుని పోలీసులను ఆశ్రయించారు. ఇరువురు మేజర్లు కావడంతో యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలియజేశామని ఎస్సై ఖాజావళి తెలిపారు. చదవండి: (Hyderabad: స్వప్నతో పరిచయం.. భార్యను పట్టించుకోకుండా..) -
ప్రేమ వివాహం వద్దన్నందుకు యువకుడి ఆత్మహత్య
కొండాపురం : మండల పరిధిలోని కె.సుగుమంచిపల్లె గ్రామానికిచెందిన యలమకురు చరణ్‌కుమార్ (20) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ జె.రవికుమార్ కథనం మేరకు తాళ్లప్రొద్దుటూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని కె. సుగుమంచిపల్లె గ్రామానికి చెందిన యలమకురు యల్లప్ప కుమారుడు ఎస్సీ కులం అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమవివాహం చేసుకోవద్దని తండ్రి మందలించాడు. దీంతో ఇంటిలో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
భారీ రైలు ప్రమాదం.. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు!!
గుంతకల్లు: ‘అనంతపురం జిల్లాలో భారీ రైలు ప్రమాదం! ఉదయం 10 గంటలకు గుంతకల్లు డివిజన్ పరిధిలోని కొండాపురం రైల్వే స్టేషన్లో దుర్ఘటన!! కంట్రోల్ రూమ్‌కు మెసేజ్.. అప్రమత్తమైన రైల్వే శాఖ.. ఏడీఆర్ఎం సూర్యనారాయణ, 10వ బెటాలియన్ ఎన్డీఎఫ్ఆర్ జవాన్లు హుటాహుటిన కొండాపురం రైల్వేస్టేషన్ చేరుకొని ప్రయాణికులను రక్షించి యుద్ధప్రాతిపదికన ఆస్పత్రికి తరలించారు..’ ఈ వార్త నిజమనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఈ ప్రమాదం జరగలేదు. ఒకవేళ ఈ తరహా ఊహించని ఘటనలు జరిగితే అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉన్నారో లేదో తెలుసుకొనేందుకు కొండాపురం రైల్వేస్టేషన్లో మంగళవారం మాక్‌డ్రిల్ నిర్వహించారు. అందులో భాగంగా నిజంగా ప్రమాదం సంభవిస్తే జరిగే ఆస్తి నష్టం, ప్రాణనష్టం నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కళ్లకు కట్టినట్లు చూపించారు. రెండు బోగీలు ఒకదానిపై ఒకటి ఎక్కిన ఘటనలో ప్రయాణికులను ఎలా రక్షించాలి? సత్వర వైద్యసేవలకు తరలించే సన్నివేశాలను ప్రదర్శనల ద్వారా చూపించారు. ఈ సందర్భంగా ఏడీఆర్ఎం సూర్యనారాయణ మాట్లాడుతూ రైలు ప్రమాదాలు జరిగినప్పుడు యుద్ధప్రాతిపదికన ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై ప్రతి మూడు నెలలకోసారి మాక్‌డ్రిల్ నిర్వహిస్తామన్నారు. -
చంపేస్తామంటూ.. విత్‌డ్రా చేయిస్తున్న టీడీపీ నేతలు
కళ్యాణదుర్గం రూరల్/మదనపల్లె: తెలుగుదేశం నాయకులు బరితెగించారు. నామినేషన్లు ఉపసంహరించుకోవాలని, లేకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారు. బలవంతంగా విత్‌డ్రా చేయిస్తున్నారు. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఈ విధంగా వ్యవహరించిన వైనంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కొండాపురంలో సర్పంచ్ అభ్యర్థి లక్ష్మీదేవి నామినేషన్‌ను ఉపసంహరించుకోకపోతే చంపేస్తామని బెదిరించారు. ఆమెతో ఆదివారం బలవంతంగా నామినేషన్‌ను ఉపసంహరింపజేశారు. దీనిపై లక్ష్మీదేవి ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ అభ్యర్థిగా లక్ష్మీదేవి ఈనెల 4వ తేదీన నామినేషన్ దాఖలు చేశారు. ఆమెకు ప్రత్యర్థిగా టీడీపీ మద్దతుతో త్రివేణి నామినేషన్ వేశారు. ఆరోజు నుంచి లక్ష్మీదేవితో విత్ డ్రా చేయించాలని ఆమె భర్త నరసింహులును టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారు. ఆదివారం ఆమెతో విత్‌డ్రా చేయించారు. లక్ష్మీదేవి దంపతులు ఈ విషయాన్ని ఆదివారం రాత్రి ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్‌కు తెలిపారు. అనంతరం తమ కుటుంబానికి టీడీపీ వర్గీయుల నుంచి ప్రాణహాని ఉందంటూ లక్ష్మీదేవి రూరల్ సీఐ శివశంకర్‌నాయక్, ఎస్ఐ సుధాకర్లకు ఫిర్యాదు చేశారు. తాము బరిలో ఉంటామని, రక్షణ కల్పించాలని కోరారు. ఈ విషయమై ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ మాట్లాడుతూ టీడీపీ నాయకులు అభ్యర్థిని బెదిరించడం సరికాదని చెప్పారు. ఇప్పటికైనా వారు మారకపోతే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం వేంపల్లె పంచాయతీలో టీడీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతూ వార్డు మెంబర్లుగా నామినేషన్ వేసినవారితో బలవంతంగా విత్‌డ్రా చేయిస్తున్నారని సర్పంచ్ అభ్యర్థి సంతోషి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 11వ వార్డుకు నగిరి వెంకటేశమ్మతో నామినేషన్ వేయిస్తే.. మధు, అప్పళ్ల, తిరుపతప్ప, కదిరప్ప, సతీష్ తదితరులు ఆమెతో బలవంతంగా విత్‌డ్రా చేయించారని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులపై విరుచుకుపడ్డ కోట్ల సుజాతమ్మ చిప్పగిరి/ఆలూరు: కర్నూలు జిల్లాలో టీడీపీ నేతల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పనిచేసేందుకు అంగీకరించని అధికారులపై బెదిరింపులకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ చిప్పగిరి మండల అధికారులను బెదిరించారు. దౌల్తాపురం, రామదుర్గం పంచాయతీలకు చెందిన టీడీపీ నాయకులు వాట్సాప్‌లో వివరాలు పెట్టి నోడ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వాలని పంచాయతీల కార్యదర్శులు నరేష్‌యాదవ్, సిసింద్రీలను ఫోన్లో అడిగారు. నేరుగా రావాలని వారు సూచించారు. దీంతో సోమవారం సుజాతమ్మ చిప్పగిరి మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని ఎంపీడీవో అక్బర్‌సాహెబ్ సమక్షంలోనే ఈవోపీఆర్ వరలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు నరేష్‌యాదవ్, సిసింద్రీలపై విరుచుకుపడ్డారు. చిప్పగిరి ఎంపీడీవో అక్బర్‌సాహెబ్ మాట్లాడుతూ తమ వద్దకు రాకుండా ఫోన్లో అడిగితే ఎలా ఇస్తామని ప్రశ్నించారు. -
తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోల్‌తో అలజడి
కొండాపురం: తెలంగాణలోని అబ్దుల్లాపూర్ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే వైఎస్సార్ జిల్లా కొండాపురం తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం అలాంటి ఘటన చోటుచేసుకుంది. అధికారులు, సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని దత్తాపురం గ్రామానికి చెందిన బుడిగ ఆదినారాయణ మంగళవారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి పెట్రోలు పోసుకోవడంతో వెంటనే చుట్టూ ఉన్న వారు అతని చర్యలను అడ్డుకున్నారు. బయటకు తీసుకెళ్లి అతనిపై నీళ్లు పోసి ప్రమాదం తప్పించారు. ఆదినారాయణ తన తల్లి పేరు మీద ఉన్న డీకేటీ భూమిని తన పేరిట మార్చి నష్ట పరిహారం చెల్లించాలని వీఆర్వో, తహసీల్దార్‌ను గతంలో కోరాడు. అదే భూమి ఎరికల గారి నరసింహులు ఆక్రమించాడని 2009లో హైకోర్టులో ఆదినారాయణ పిటిషన్ వేయగా ఆ కేసు నడుస్తోంది. అయినా ఆ పొలాన్ని తన పేరిట మార్చాలని తహసీల్దార్‌కు ఇటీవల వినతిపత్రం ఇచ్చాడు. వారు స్పందించకపోవడంతో అధికారులపై పెట్రోలు పోసి నిప్పంటించి.. తానూ ఆత్మహత్య చేసుకోవాలని ఈ చర్యకు పాల్పడినట్లు ఆదినారాయణ చెప్పాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హజీవలీ తెలిపారు. సరైన పత్రాలు లేవు బుక్కపట్నం రెవెన్యూ పొలంలో ఖాతా నంబర్ 789, సర్వే నంబర్ 122లో 3.61 ఎకరాల భూమికి ఆదినారాయణ నకిలీ పాసు పుస్తకం తయారు చేసుకున్నాడని తహసీల్దార్ తెలిపారు. ఆ పొలంపై ఆదినారాయణకు ఎలాంటి హక్కులు లేకున్నా అధికారులను బెదిరిస్తున్నాడని తెలిపారు. -
కాపాడబోయి మృత్యువు ఒడిలోకి
సాక్షి, కొండాపురం(కడప) : నీరు చూడగానే వారిలో ఉత్సాహం పెల్లుబికింది. సరాదాగా ఈత కొడదామని దిగారు. అందులో ఓ వ్యక్తి మునిగిపోతుండటాన్ని చూసి మరొక వ్యక్తి రక్షించాడు. కాస్సేపటికే మరొకరిని కాపాడే యత్నంలో తానూ ప్రాణాలు కోల్పోయాడో వ్యక్తి. చిత్రావతిలో ఈతకు దిగిన ఇద్దరు మరణించిన సంఘటన కుటుంబ సభ్యులకు శోకాన్ని మిగిల్చింది. వివరాలివి. మండలంలోని యనమలచింతల గ్రామంలో పీర్లపండుగ జరుగుతోంది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కట్టుబడి హాజివలి ఇంటికి మంగళవారం బం ధువులు వచ్చారు. వీరు అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలోని చాగల్లు గ్రామానికి చెందినవారు. వీరిలో అన్వర్‌వలి(14), షేక్. బాబావలి(26) ఉన్నారు. బాబావలి తాడిపత్రిలోని ఎస్‌జెకే స్టీల్ ప్లాంట్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతనికి భార్యతో పాటు మూడు నెలల పాప ఉంది. అన్వర్ వలి తాడిపత్రిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. చిత్రావతిలో నీరు చేరిందనే సంగతి తెలుసుకుని మధ్యాహ్నం 12 గంటల సమయంలో వీరిద్దరూ మరో ముగ్గురితో కలిసి సరదాగా ఈతకు వెళ్లారు. ఆలయం దగ్గర నదిలోకి దిగారు. ఇందులో దస్తగిరి అనే వ్యక్తి నీటిలో మునిగిపోతుండగా షేక్ బాబాలివలి గుర్తిం చాడు. వెంటనే స్పందించి కాపాడి బయటకు తీసుకువచ్చాడు. ఇంతలోనే అన్వర్‌వలి అనే బాలుడు కూడా మునిగిపోతూ కేకలు వేశాడు. అతడ్ని కూడా రక్షించాలని బాబావలి వెంటనే నీటిలో దూకాడు. అన్వర్‌వలిని నీటి నుంచి రక్షించి తీసుకువస్తూ పూడికలో చిక్కుకున్నాడు. దీంతో ముందుకు కదలలేకపోయాడు. అన్వర్‌వలి..బాబావలి నీటిలో మునిగిపోయారు. వెంటనే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు అందించిన సమాచారం మేరకు కొందరు చేరుకుని రక్షించడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అతిథులుగా వచ్చి విగతజీవులైన వీరిద్దరి మృతదేహాలను చూసి స్థానికులు చలించిపోయారు. గ్రామంలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ రాజారెడ్డి చేరుకున్నారు. ప్రమాద వివరాలను సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డి విషయం తెలుసుకుని వెంటనే హాజివలి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతదేహాలకు నివాళులర్పించారు. -
యాదాద్రిలో కలకలం: జింక మాంసంతో విందు
సాక్షి, యాదాద్రి: జింకను వేటాడటమే కాక దాన్ని వండుకుని తిన్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మోత్కూర్ మండలంలోని కొండాపురం గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు.. జింకను వేటాడి, వండుకుని తిన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. దీనిపై అధికారులు గురువారం దర్యాప్తు చేపట్టగా జింక మాంసాన్ని ఆరగించిన విందులో రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని అటవీశాఖ అధికారులు తెలిపారు. -
మిషన్ భగీరథ నీళ్లొచ్చాయ్..
సాక్షి, కేటీదొడ్డి: ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు అందించాలనే సంకల్పంతో చేపట్టిన మిషన్ భగీరథ నీళ్లు వచ్చేశాయ్.ప్రధాన పైపులైన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.నల్లా కనెక్షన్ల ద్వారా మండలంలోని కొండాపురం, వెంకటాపురం, గువ్వలదిన్నె తదితర గ్రామాల్లో తాగునీరు చేరింది.అలాగే కేటీదొడ్డి మండలంలోని తండాల్లో పనులు పూర్తికావడంతో తండావాసులు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్లతో తాగునీరు ఇచ్చి తీరుతానని ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే. వేసవికాలం వస్తే చాలు ప్రతి సంవత్సరం ప్రజలు గ్రామశివారులోని పొలాల నుంచి తాగునీరు తెచ్చుకునేవారు. మిషన్ భగీరథ నీరు రావడంతో నీటికోసం పొలాల్లో బోరుబావులను ఆశ్రయించాల్సిన పనితప్పింది. పలు గ్రామాల్లో తాగునీరు మండలంలోని కొండాపురం, వెంకటాపురం, గు వ్వలదిన్నె తదితర గ్రామాల్లో ఇప్పటికే పనులు పూర్తయి నల్లాల ద్వారా తాగునీరు కూడా వస్తుంది. నూతనంగా గ్రామపంచాయతీలుగా ఏర్పడిన పైజారితాండా, తూర్పుతండా గ్రామాల్లో మిషన్ భగీరథ పనులు అంతా పూర్తయ్యాయి. ఇంటింటికీ నల్లాలు కూడా బిగించారు. తండాలో గతంలో కిలో మీటర్ దూరం నుంచి తాగునీరు తెచ్చుకునే వారు. ఇప్పుడు నల్లా కనెక్షన్ల ద్వారా ఆ సమస్య తీరనుందని గ్రామస్తులు, తండవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గువ్వలదిన్నెలో దాదాపు నల్లా కనెక్షన్ పూర్తియ్యాయి. దీంతో మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు వేసవికా లంలో కూడా పుష్కలంగా మిషన్ భగీరథ నీటిని తాగుతున్నామని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామానికి ఇబ్బంది లేదు గత సంవత్సరం నుంచి మా గ్రామానికి తాగునీటికి ఎలాంటి సమస్య లేదు. 6 నెలల నుంచి మిషన్ బగీరథ ద్వారా తాగునీరు వస్తుంది. దీంతో తాగునీటి ఇబ్బందులు తీరాయి. ఎండాకాలంలో కూడా నల్లా ద్వారా తాగునీరు అందిస్తున్నారు. – అంజనమ్మ, కొండాపురం -
వేర్వేరు ప్రాంతాల్లో చెట్లు దగ్ధం
కొండాపురం: గుర్తుతెలియని ఆకతాయిలు చేసిన పనికి మండలంలోని సత్యవోలు పంచాయతీ లింగనపాలెం గ్రామానికి వెళ్లే రోడ్డు వెంబడి ఉన్న జామయిల్, టేకు, మామిడి, తాటి చెట్లు దగ్ధమయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. ఆకతాయిలు నిప్పు వేయండంలో రోడ్డుకు ఇరువైపుల ఉన్న కర్రతుమ్మ, తాటి చెట్లు సుమారు 1.50 కిలోమీటర్ వరకు పూర్తిగా బూడిదయ్యాయి. అలాగే జామయిల్, మామిడి, టేకు చెట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. గ్రామస్తులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండాపోయింది. వింజమూరు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందజేశారు. నిమ్మతోట వింజమూరు: స్థానిక బీసీకాలనీకి చెందిన లక్కు రమణయ్య అనే వ్యక్తి నిమ్మతోట ఆదివారం అగ్నికి ఆహుతైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించిందని బాధితుడు తెలిపారు. తోటలోని డ్రిప్‌పైపులు, స్టార్టరు, 20 నిమ్మ చెట్లు కాలిపోయాయి. చుట్టుపక్కల పొలాల్లోని కూలీలు గుర్తించి మంటలను అదుపు చేశారు. సుమారు రూ.50,000 ఆస్తి నష్టం వాటినిట్లు బాధితుడు తెలిపాడు. మామిడి తోట సీతారామపురం: మండలంలోని నాగరాజుపల్లిలో 15 ఎకరాల మామిడి తోట దగ్ధమైంది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఎస్.రమాదేవి. పి.పిచ్చమ్మ, కె.సుబ్బమ్మ, ఎన్.రత్తమ్మ, ఎం.రత్తమ్మ, పి.పెదవెంగమ్మకు 2.50 ఎకరాల చొప్పున భూమిని ఏడు సంత్సరాల క్రితం ప్రభుత్వం మంజూరు చేసింది. హార్టికల్చర్ కింద వారు మామిడి మొక్కలు నాటారు. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు వేయడంతో మామిడితోట దగ్ధమైంది. రూ.20 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. ప్రభుత్వం నష్టపరిహారం అందజేయాలని కోరుతున్నారు. జామాయిల్ తోట అనుమసముద్రంపేట(ఆత్మకూరు): ఆత్మకూరు మున్సిపాలిటీలోని నెల్లూరుపాళెం విజయా డెయిరీ సమీపంలో ఆదివారం జామాయిల్ తోట దగ్ధమైంది. వివరాలిలా ఉన్నాయి. డెయిరీకి సమీపంలో ఆత్మకూరుకు చెందిన మన్నెం సుబ్బారెడ్డి, డాక్టర్ వసుందరమ్మలు సుమారు 75 ఎకరాల్లో జామాయిల్ వేశారు. ఆదివారం ప్రమాదవశాత్తు మంటలు చేలరేగాయి. స్థానికులు గుర్తించి అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే సుమారు 15 ఎకరాల్లో జామాయిల్ దగ్ధమైంది. ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అగ్నిమాపక అధికారులు పి.సుధాకరయ్య, కె.పెంచలయ్య, ఖాజామొహిద్దీన్ తదితరులు పాల్గొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. -
తాళ్లపొద్దుటూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
-
మంత్రి ఆది అనుచరుల హంగామా
వైఎస్సార్ జిల్లా : మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరులు వీరంగం సృష్టించడంతో కొండాపురం మండలం తాళ్లపొద్దుటూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ స్టేషన్ వద్ద అదనపు బలగాలు మోహరించాయి. వివరాల్లోకి వెళితే.. ఓ వివాదం విషయమై స్థానికంగా ఉన్న ఓ బెల్టుషాప్ యజమానిని తాళ్లపొద్దుటూరు ఎస్ఐ అదుపులోకి తీసుకున్నారు. అయితే మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరుడు పవన్ కుమార్ ...నిన్న రాత్రి ఎస్ఐని అడ్డుకున్నాడు. దీంతో విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో పవన్ కుమార్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని నానా హంగామా చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. అయితే ఈ వివాదానికి సంబంధించి మంత్రి ఆదినారాయణరెడ్డి ఇంకా స్పందించలేదు -
గ్రామస్థులకు శాపంగా మారిన ఓపెన్ క్రాష్ గనులు
-
వైఎస్సార్ జిల్లాలో దారుణం
కొండాపురం: వైఎస్సార్ కడప జిల్లాలో దారుణం వెలుగుచూసింది. జిల్లాలోని కొండాపురం మండలంలోని వెంకయ్యకాల్వ గ్రామంలో నిద్రిస్తున్న ఓ వ్యక్తిపై గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో తీవ్ర గాయాలైన అతను అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది -
ట్రాక్టర్ ఢీ కొని యువకుడు దుర్మరణం
కొండాపురం: ట్రాక్టర్ ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఎస్ఐ పెనుగొండ రవికుమార్ కథనం మేరకు... మండలంలోని చిన్నపల్లె గ్రామసమీపంలో ఎస్.తిమ్మాపురం చెరువు కట్టపనులను మెగా కంపెనీ చేపడుతోంది. చెరువు కట్ట పై నుంచి ట్రాక్టర్ దిగుతుండగా అదుపు తప్పి కంపెనీలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న ఇ. రామనాథ (30) పై ఎక్కడంతో అతను అక్కడక్కడే మృతి చెందాడు. మండలంలోని పొట్టిపాడు గ్రామానికి చెందిన ఇ.రామనాథ కొన్ని నెలలుగా మెగాకంపెనీలో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవి తెలిపారు. -
వరకట్నం వేధింపుల కేసులో ఉపాధ్యాయుడికి జైలు శిక్ష
బ్రహ్మసముద్రం : భార్యాభర్తలిద్దరూ ఉపాధ్యాయులే. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన భర్త అదనపు కట్నం కోసం భార్యను మానసికంగా, శారీరకంగా హింసించినందుకు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఎస్ఐ నరేంద్ర భూపతి కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లికి చెందిన నాగభూషణం కుమార్తె భువనేశ్వరి వివాహం వైఎస్సార్ జిల్లా రైల్వే కొండాపురానికి చెందిన చల్లా రాజేంద్ర ప్రసాద్‌తో 2008 మార్చి 19న అయింది. వారిద్దరూ 2007–08 డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ప్రస్తుతం అతను యల్లనూరు మండలం చిలమకూరులో ఉపాధ్యాయుడిగా పని చేస్తుండగా, భవనేశ్వరి కళ్యాణదుర్గం మండలం గూబనపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. పెళ్లి సమయంలో రూ.2 లక్షల నగదు, 15 తులాల బంగారాన్ని కట్నంగా ఇచ్చారు. కొంతకాలం వీరి సంసారం సాఫీగా సాగింది. వారికి ఐదేళ్ల బాబు ఉన్నాడు. నిత్యం వేధింపులే... అయితే అదనపు కట్నం కోసం భర్త రాజేంద్ర ప్రసాద్ తరచూ భార్యను వేధించేవాడు. శారీరకంగా, మానసికంగా హింసించాడు. దీనిపై పలుమార్లు పెద్ద మనుషులు పంచాయితీ చేసి సర్దిచెప్పారు. అయినా అతనిలో మార్పు రాలేదు. చేసేది లేక 2012లో ఆమె బ్రహ్మసముద్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజేంద్ర ప్రసాద్ సహా అతని తండ్రి రంగయ్య, తల్లి రమణమ్మ, అక్క సులోచన, ఆమె భర్త రవీంద్ర తదితరులపై కేసు నమోదు చేశారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం నేరం రుజువు కావడంతో భువనేశ్వరి భర్త చల్లా రాజేంద్రప్రసాద్‌కు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.15 వేలు జరిమానా విధిస్తూ కళ్యాణదుర్గం ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ నాగరాజ బుధవారం తీర్పు వెలువరించినట్లు ఎస్ఐ తెలిపారు. ప్రాసిక్యూషన్ తరుపున ఏపీపీ వసంతలక్ష్మి వాదించారు. -
చాక్లెట్ గొంతులో ఇరుక్కుని బాలుడి మృతి
సి.బెలగల్ (కర్నూలు) : చాక్లెట్ గొంతులో ఇరుక్కుని బాలుడు మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లా సి.బెలగల్ మండలం కొండాపురంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చంద్రయ్య శెట్టి కుమారుడు వేణు(8) ఆదివారం చాక్లెట్ తింటున్న క్రమంలో అది గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో విషయం తల్లిదండ్రులకు తెలిపాడు. వారు చాక్లెట్ తీయడానికి తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. ముక్కులో నుంచి రక్తం వస్తుండటంతో కర్నూలు ఆస్పత్రికి తరలించేందుకు యత్నిస్తుండగా.. మార్గమధ్యంలో మృతిచెందాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
కొండాపురం వాసుల రాస్తారోకో
ఆత్మకూరు (ఎం) : ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న మోటకొండూరు మండలంలో తమ గ్రామాన్ని కలుపొద్దని మండలంలోని కొండాపురం గ్రామస్తులు మంగళవారం రాయగిరి–మోత్కూరు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా 3 గంటలపాటు రోడ్డుపైనే బైఠాయించి, అక్కడే వంటా–వార్పు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ఆత్మకూరు (ఎం) మండలం 4 కి.మీ. మాత్రమే ఉంటుందని, మోటకొండూరు మాత్రం 18 కి.మీ. వస్తుందన్నారు. భువనగిరి ఆర్డీఓ, తహసీల్దార్ వచ్చి సమాధానం చెప్పాలని భీష్మించారు. విషయం తెలుసుకున్న ఆత్మకూరు (ఎం) ఎస్ఐ పి.శివనాగప్రసాద్ సంఘటనాస్థలానికి చేరుకొని గ్రామస్తులకు ఎంత నచ్చచెప్పినా వారు ఆందోళన విరమించలేదు. అనంతరం గుండాల, మోత్కూరు ఎస్ఐలు మధుసూదన్‌రెడ్డి, రవికుమార్‌లు సంఘటనా స్థలానికి వచ్చి ఆందోళన విరమించమని కోరినా వారు వినకపోవడంతో ఓ దశలో గ్రామస్తులకు, పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమయంలోనే గ్రామానికి చెందిన గుడ్డేటి విష్ణు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడంతో గమనించిన పోలీసులు అతడిని అడ్డుకున్నారు. అనంతరం భువనగిరి సీఐ ఎ.అర్జునయ్య, తహసీల్దార్ లక్క అలివేలు రాస్తారోకో వద్దకు చేరుకొని అక్కడే గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. కొండాపురంను 18 కిలోమీటర్ల దూరంగా ఉన్న మోటకొండూరులో కలపడం వల్ల గ్రామస్తులు ఇబ్బందులు పడుతారని, ఆత్మకూరు(ఎం) మండలంలోనే కొనసాగించాలని జెడ్పీటీసీ గంగపురం మల్లేశం, ఎంపీటీసీ పి.హేమలత, మాజీ జెడ్పీటీసీ పి.పూర్ణచందర్రాజులు కోరారు. దీంతో తహసీల్దార్ అలివేలు మాట్లాడుతూ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. రాస్తారోకో వల్ల సుమారు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో సర్పంచ్ గుండు పెంటయ్య గౌడ్, ఉప సర్పంచ్ కొప్పుల వెంకట్‌రెడ్డి, మాజీ సర్పంచ్ పంజాల పెంటయ్య గౌడ్, కొప్పుల మల్లారెడ్డి, పీసరి నర్సిరెడ్డి, కొండా మురళి, గుడ్డెటి భిక్షపతి, బాశెట్టి సత్యనారాయణ, కొండా పంచాక్షరి, గుండు శ్రీశైలం, కొప్పుల రాంరెడ్డి, కొప్పుల సువర్ణ, అనూష, మమత, సుశీల పాల్గొన్నారు. మెడకు ఉరితో నిరసన దిలావర్పూర్ (ఆలేరు) : మండలంలోని దిలావర్పూర్ను నూతనంగా ఏర్పాటయ్యే మోటకొండూర్ మండలంలో కలుపొద్దని కోరుతూ మంగళవారం ఆ గ్రామస్తులు మెడకు తాడు బిగించుకుని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. దిలావర్పూర్ గ్రామాన్ని యథావిధిగా ఆలేరు మండలంలోనే కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సీస బాలరాజ్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ పల్లా జోగిరెడ్డి, చెక్క వెంకటేశ్, చాపల మల్లేశం, మచ్చ సత్యనారాయణ, అంజయ్య, సిద్ధులు, నరేందర్, శంకర్, కుల్లయ్య, విజయసింహారెడ్డి పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో ఎమ్మెల్యే ఆది అనుచరులు?
సింహాద్రిపురం : సింహాద్రిపురం పోలీసుల అదుపులో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు ఉన్నట్లు తెలిసింది. ఈ నెల 17న కొండాపురం మండలం తాళ్లప్రొద్దుటూరు పోలీస్‌స్టేషన్‌పై ఎమ్మెల్యే అనుచరులు చేసిన రాళ్ల దాడి ఘటనలో.. వారిని ఇక్కడి స్టేషన్‌కు రెండు రోజుల క్రితం తీసుకొచ్చినట్లు సమాచారం. కొండాపురం మండలం సంకేపల్లె వద్ద చేపడుతున్న నీరు– చెట్టు పనులు రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీశాయి. ఎమ్మెల్యే అనుచరుల్లో జగదేకర్‌రెడ్డితోపాటు మరో 30 మంది ఉన్నట్లు తెలిసింది. నిందితులను డీఎస్పీ సర్కార్ గురువారం విచారణ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. సీఐ రవిబాబుతోపాటు కొండాపురం, తాళ్ల ప్రొద్దుటూరు, ముద్దనూరు ఎస్ఐలు ఇక్కడే మకాం వేశారు. వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. -
చెరువులో పడి బాలుడి మృతి
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా(కొండాపురం) : కొండాపురం మండలం కొమ్మి గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ ఊరి చివరన ఉన్న చెరువులో పడి ఎస్కే బాదీ(8) అనే బాలుడు మృత్యువాతపడ్డాడు. బాలుడి మృతదేహాన్ని గ్రామస్తులు వెలికి తీశారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
ఏసీబీ వలలో సర్వేయర్
కొండాపురం : మండల సర్వేయర్ బాలసుబ్బరాయుడు ఏసీబీ వలలో చిక్కాడు. ఓ రైతు నుంచి రూ. 5 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. బి. కొట్టాలపల్లెకు చెందిన కంచిమిరెడ్డి రామసుబ్బారెడ్డి అనే రైతు బెడుదూరు రెవెన్యూ పొలంలోని సర్వేనెంబర్ 305,308లో కొలతల కోసం 2013 అక్టోబర్ 22 తేదీన మీసేవా ద్వారా చలనా చెల్లించి దరఖాస్తు చేసుకున్నాడు. దాదాపు 8 నెలలు కావస్తున్నా సర్వేయర్ కొలతలు వేయలేదు. రైతు ఎంత బతిమాలినా ఫలితం లేకపోయింది. లంచం ఇవ్వనిదే కొలతలు వేయనని సర్వేయర్ తేల్చిచెప్పాడు. దీంతో రైతు రామసుబ్బారెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గురువారం ఉదయం స్థానిక రెవెన్యూకార్యాలయంలో బాలసుబ్బరాయుడు ఉండగా రైతు రామసుబ్బారెడ్డి ఏసీబీ వారు ఇచ్చిన రూ. 5 వేలను అందజేశాడు. రూ. 13 వేలు ఇస్తే గాని కొలతలకు రానని సర్వేయర్ అనడంతో ప్రస్తుతం రూ. 5 వేలు ఇస్తున్నానని మిగిలినది కొలతలు వేసేటప్పుడు ఇస్తానని చెప్పడంతో ఆ డబ్బులను సర్వేయర్ తీసుకున్నాడు. వెంటనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి సర్వేయర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న రూ. 5 వేలను స్వాధీనం చేసుకున్నారు. సర్వేయర్‌పై కేసు నమోదు చేసి కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు తెలిపారు. దాడులలో ఏసీబీ డీఎస్పీ శంకరరెడ్డి, సీఐలు పార్థసారధిరెడ్డి, సుధాకరరెడ్డి, రాంకిశోర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణదాతల కోసం ఎదురు చూపు
ఆటలు, పాటలు, చదువే ప్రపంచంగా జీవిస్తున్న అబ్దుల్‌గఫార్ (12) ఏడాదిగా రక్తహీనతతో బాధపడుతున్నాడు. ఆ బాలుడి వైద్యానికి రూ.30 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. మండలంలోని గరిమెనపెంట గ్రామానికి చెందిన తల్లిదండ్రులు కూలిపనులు చేస్తే తప్ప పూటగడవని దయనీయ స్థితి. సహృదయులు స్పందించి తమ బిడ్డకు పునర్జన్మ ప్రసాదించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. కొండాపురం, న్యూస్‌లైన్: ఆడుతూపాడుతూ చదువుకోవాల్సిన వయస్సులో ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న బాలుడి దీనగాధ ఇది. మండలంలోని గరిమెనపెంట గ్రామానికి చెందిన ఎస్కే జిలానీబాష, షరీఫ్‌ఉన్నీసా దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. కుమారుడు అబ్దుల్గఫార్కు 12 ఏళ్లు. ఏడాది కిందట వరకు ఆడుతూ, పాడుతూ చదువుకునేవాడు. ఆ తర్వాత ఆరోగ్యం బాగా లేకపోవడంతో నెల్లూరు నగరంలోని చిన్నపిల్లల వైద్యశాలకు తీసుకెళ్లారు. రక్తం చాలా తక్కువగా ఉందని, తెల్లరక్త కణాలు మూడు ప్యాకెట్లు, ఒక బాటిల్ రక్తం కావాలని వైద్యులు చెప్పారు. ఇంట్లోని వస్తువులను కుదువ పెట్టి వాటిని కొనుగోలు చేసినట్టు బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. వాటిని ఎక్కించుకున్న తర్వాత చెన్నై వెళ్లి ఎముకల పరీక్షలు చేయించుకురావాలని వైద్యులు సూచించడంతో అబ్దుల్‌ను చెన్నైకి తీసుకెళ్లారు. రక్తం చాలా తక్కువగా ఉందని, మళ్లీ చెన్నైలో రెండు ప్యాకెట్లు ఎక్కించినట్టు తల్లిదండ్రులు చెప్పారు. రూ.30 లక్షలు అవసరం చెన్నైలో వైద్యులు ఎముకలను పరీక్షించాలంటే సుమారు రూ.లక్ష అవుతుందని చెప్పారు. దీంతో చేసేదేమీలేక వారు వెనుదిరిగారు. గ్రామస్తులు హైదరాబాద్‌లోని రెయిన్బో హాస్పిటల్లో మహానేత వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కింద వ్యాధి నయం చేస్తారని చెప్పడంతో అబ్దుల్‌ను అక్కడికి తీసుకెళ్లారు. బాలుడిని వైద్యులు పరీక్షించి వైద్యానికి రూ.30 లక్షలు ఖర్చు అవుతుందని, ఆరోగ్యశ్రీ వర్తించదని తేల్చి చెప్పారు. కూలిపనులు చేసుకుని కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తమకు అంతసొమ్ము తెచ్చుకునే స్తోమత లేదని బాలు డి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దమనసున్న మహరాజుల చల్లని మాట కోసం వారు ఎదురు చూస్తున్నారు. సాయం చేయాలనుకుంటే.. దాతలు ఎవరైనా స్పందించి తమ కుమారునికి ప్రాణదాణం చేయాలని వారు కోరుతున్నారు. సాయం అందించాలనుకునే వారు ఎస్బీఐ ఖాతా నెంబర్ 32034202717 లో నగదు జమ చేయవచ్చని పేర్కొన్నారు. వివరాలకు 9676853871 లో సంప్రదించవచ్చు. -
మునిగానంటూ ముంచాడు
కొండాపురం, న్యూస్‌లైన్: అతనెన్నో అక్రమాలు చేశాడు. అందినకాడికి దోచుకున్నాడు. అయినా దర్జాగా తిరుగుతున్నాడు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినా మిన్నకుం డిపోవడంతో ఆ నాయకుని ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. వివరాల్లోకి వెళితే.. కొండాపురం మండలంలోని బుక్కపట్నం సర్పంచ్ చెక్కా పెద్దఓబుళరాజు (అలియాస్ పెద్దిరాజు) గండికోట డ్యాం ముంపు పరిహారంలో చేతి వాటం ప్రదర్శించాడు. మొత్తం 28ఎకరాల ఒక్కసెంటు విస్తీర్ణంలో గల ప్రభుత్వ భూమిని చెక్కా పెద్దఓబుళరాజుతోపాటు, అతని భార్య చెక్కా ఓబుళమ్మ , చెల్లెలు సి.రత్నమ్మ భర్త గోపాల్, తల్లి చెక్కా ఓబుళమ్మ భర్త పెద్ద ఓబన్న, చెల్లెలు సి.కాంతమ్మ భర్త రామచంద్రుడు, మరోచెల్లెలు దాసరి లక్ష్మిదేవి భర్త క్రిష్ణయ్య, కుమార్తె చెక్కాజయలక్ష్మి పేర్లతో నకిలీ పట్టాదార్ పాస్‌పుస్తకాలను తయారు చేయించాడు. ఈ భూముల్లో ఉన్నవి లేనివి తోటలు, వృక్షాలు కూడా సృష్టించాడు. ఆ విధంగా ఆ భూములు, చె ట్లు గండికోట డ్యాం ముంపునకు గురైనట్లుగా చూపించాడు. ఇలా అక్రమంగా సుమారు రూ.2,77,8391 పరిహారాన్ని స్వాహా చేశాడు. ఈ విషయంలో కడపకు చెందిన భూసేకరణ విభాగం స్పెషల్ కలెక్టర్ హెచ్.గోపీనాథ్, ముద్దనూరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుధాకర్‌రెడ్డి, మునిరాజులు, ఎస్డీటీ కె.వి.కోమల, వీరితోపాటు అప్పటి ఉద్యానవనశాఖ సహాయ సంచాలకుడు వి.ఎస్.ధర్మజ, డివిజినల్ అటవీశాఖ అధికారి ఎ.ప్రభాకర్ రావు ప్రమేయమున్నట్లు లోకాయుక్త ఎదుట తేలింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి 2014 ఫిబ్రవరి 12వ తేదీన తీర్పును వెలువరించారు. వెంటనే సదరు వ్యక్తులపై క్రిమినల్ చర్య తీసుకోవడమేకాకుండా, పరిహా రంగా కాజేసిన మొత్తం సొమ్మును రికవరీ చేయాలని జిల్లా అధికార్లను ఆదేశించారు. గతంలో కొండాపురం ఎమ్మార్వోగా పనిచేసిన ఎస్.నరసింహారెడ్డి జమ్మలమడుగు ఆర్డీఓ సంతకాలను ఫోర్జరీ చేసినట్లు కూడా రుజువైంది. కలెక్టర్ కోన శశిధరే స్వయంగా లోకాయుక్తకు 2014 ఫిబ్రవరి 11వ తేదీన ధ్రువీకరిస్తూ నివేదించారు. దాదాపు నెలన్నర కావస్తున్నా పెద్దిరాజునుంచి ఒక్కపైసా కూడా వసూలు చేయలేదు. అంతేగాక ఏడాది కిందట గ్రామంలో కల్తీపాలు తయారుచేసి డైరీ పాలలో కలుపుతున్న కేసులో కూడా చట్టంలోని లొసుగులతో, కొందరు స్వార్థపరుల సహకారంతో తప్పించుకొన్నట్లు సమాచారం. చెక్కా పెద్దఓబుళరాజుకు ముగ్గురు సంతానం(1995 తర్వాత) ఉన్నా ఎన్నికల నియమావళిని ధిక్కరించి 8 నెలలుగా బుక్కపట్నం సర్పంచుగా కొనసాగుతున్నారు. అదీచాలదన్నట్లుగా ప్రస్తుతం తన భార్య చెక్కాబుళమ్మను తెలుగుదేశంపార్టీ తరపున కొండాపురం జెడ్పీటీసీకి పోటీలో నిలిపారు. -
మానవత్వమా.. ఎక్కడ?
మానవత్వాన్ని మరచిన కొందరు ఒక వ్యక్తి మృతదేహాన్ని తమ గ్రామంలోకి తీసుకురావద్దంటూ అడ్డుకున్నారు. దీంతో సుమారు 8 గంటల సేపు నెల్లూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దులోని రాళ్లపాడు రిజర్వాయరుపై మృతదేహాన్ని అంబులెన్స్‌లోనే ఉంచాల్సిన పరిస్థితి మంగళవారం దాపురించింది. కొండాపురం, న్యూస్‌లైన్ : కొండాపురం మండలం సాయిపేట పంచాయతీ వెల్లటూరిపాళెంలో నివాసం ఉం టున్న కోటా బాబుది స్వస్థలం ప్రకాశం జిల్లా లింగసముద్రం. బాబు తన భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెతో ఏడేళ్లు వెల్లటూరివారిపాళెంలోనే ఆర్ఎంపీగా వైద్యం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. వచ్చే సంపాదన కుటుంబ పోషణకు చాలకపోవడంతో గతేడాది ఫిబ్రవరి 13న సౌదీలోని అల్ హసన్ అనే పట్టణానికి పొట్టకూటికి వెళ్లాడు. అక్కడ పని చేస్తున్న సమయంలో ప్రమాదానికి గురై అదే సంవత్సరం జూలై 31వ తేదీన మరణించాడు. అప్పటి నుంచి బాబు భార్య ధనమ్మ, బంధువులు అతడి మృదేహాన్ని మనదేశం తీసుకొచ్చేందుకు నానాకష్టాలు పడ్డారు. ఈ నెల మూడో తేదీ మధ్యాహ్నం బాబు మృతదేహం చెన్నైకి చేరుకుంది. అక్కడికి మృతుడి భార్య, కుమారులు, కుమార్తెతో పాటు, స్నేహితులు, బంధువులు కలసి 14 మం ది వరకు వెళ్లారు. చెన్నై ఎయిర్‌పోర్టులో ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న అనంతరం అంబులెన్స్‌లో అతడి మృతదేహాన్ని లింగసముద్రం తరలిం చారు. అందులోనే భార్యా బిడ్డలు, బంధువులు, స్నేహితులు కూడా ఎక్కారు. అంబులెన్స్ మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు కావలి సమీపంలోని కోవూరుపల్లి వద్ద ఒకలారీని ఢీకొంది. ఈ ఘ టనలో అంబులెన్స్‌లో ముందు వైపు కూర్చున్న మృతుని బంధువులు చిన సత్యం, మాధవరావుకు గాయాలయ్యాయి. అంబులెన్స్ కూడా బాగా దెబ్బతింది. వేరే అంబులెన్స్‌లో మృతదేహాన్ని తరలించారు. క్షతగాత్రులను కావలిలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. మృతదేహాన్ని తీసుకొస్తున్న అంబులెన్స్ ఉదయం ఆరు గంటలకు రాళ్లపాడు రిజర్వాయరుపైకి చేరుకునే సరికి లింగసముద్రానికి చెందిన కొందరు బాబు మృతదేహాన్ని ఊళ్లోకి తీసుకు రావడం మంచిది కాదని అడ్డుకున్నారు. మృతదేహాన్ని చెన్నై నుంచి తీసుకొచ్చే సమయంలో అంబులెన్స్ ప్రమాదానికి గురికావడం, అందులోని వారు గాయపడడం అరిష్టమని, ఊళ్లోకి తీసుకురావడం మంచిది కాదని రిజర్వాయర్‌పైనే మధ్యాహ్నం రెండు గంటల వరకు నిలిపేశారు. అప్పటికే అక్కడకు విలేకరులు చేరుకోవడంతో పాటు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. లింగసముద్రం సర్పంచ్ ఉమ్మడిశెట్టి నాగేశ్వరరావు మధ్యాహ్నం 2 గంటల సమయంలో మృతదేహం వద్దకు చేరుకుని గ్రామస్తులకు సర్ది చెప్పారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లకుండా నేరుగా శ్మశానవాటికకు తీసుకెళ్లేవిధంగా ఒప్పించారు. దీంతో బాబు మృతదేహాన్ని శ్మశానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహం రిజర్వాయరుపై ఉన్నంత సేపు అటుగా వెళ్తున్న ప్రయాణికులు విషయం తెలుసుకుని ఇదేమి దారుణం అంటూ నిట్టూరుస్తూ వెళ్లారు. మానవత్వం మంటగలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు
కొండాపురం, న్యూస్‌లైన్ : తమ కుమార్తెను పెళ్లి చేసుకుంటానని చెప్పి, ముందుగా రూ. 50 వేలు తీసుకుని ఓ యువకుడు మోసం చేశాడంటూ మండలంలోని వెలిగండ్ల గ్రామానికి చెందిన మహిళ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బుధవారం అతనిపై కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు... వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డిపాళేనికి చెందిన యువకుడితో వెలిగండ్ల యువత్జిట వివాహం చేసేందుకు గత జూలై 28వ తేదీన పెద్దల సమక్షంలో అంగీకారం కుదిరింది. ఆ మేరకు ఆగస్టు 18న నిశ్చితార్థం చేసుకునేందుకు నిర్ణయించారు. ఇదే సమయంలో కట్నకానుకల కింద ఇచ్చే నగదులో రూ. 50 వేలు ముందుగా ఇవ్వాలని చెప్పి వారి నుంచి ఆ యువకుడు తీసుకున్నాడు. తర్వాత 18వ తేదీన నిశ్చితార్థం చేసుకునేందుకు కుదరడంలేదని, 25న ఏర్పాటు చేసుకుందామని చెప్పాడు. దానికి యువతి తల్లిదండ్రులు అంగీకరించారు. మధ్యలో 20వ తేదీన యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ‘మీ అమ్మాయి నాకు నచ్చలేదు. నేను పెళ్లి చేసుకోను’ అని చెప్పాడు. దీంతో వారు ఆ గ్రామ పెద్దలను ఆశ్రయించారు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆ యువకుడిని, వారి కుటుంబసభ్యులను విచారించగా పెళ్లికి నిరాకరించారు. దీంతో ఎస్సై నాగేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
విద్యుత్ షాక్‌తో.. తండ్రీ కొడుకుల దుర్మరణం
రేగోడ్, న్యూస్‌లైన్: విద్యుత్ షాక్‌తో తండ్రీకొడుకులు మరణించారు. ఈ సంఘటన రేగోడ్ మండలం ఆర్.ఇటిక్యాల గ్రామ శివారు లో బుధవారం ఉదయం వెలుగు చూసింది. అడవి పందుల బారినుంచి పత్తి పంటను కాపాడుకునేందుకు ఓ రైతు తన పొలంలో అమర్చిన విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు వీరికి తగలడం తో విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం ప్రకా రం.. కొండాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని రంజానాయక్ తండాకు చెం దిన వాల్యానాయక్కు భార్య ఉమ్లీబాయి, ముగ్గురు కుమారులు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. వీరికి మూడెకరాల భూమి ఉంది. సొంత పొలాన్ని సాగు చేస్తూనే ఖాళీ సమయంలో కూలి పనులు చేస్తుంటారు. వాల్యానాయక్ ఏజెంటుగా వ్యవహరిస్తూ చెరకు సీజన్ లో ఫ్యాక్టరీలకు కూలీలను పంపిస్తుం టాడు. వాల్యానాయక్ తన పెద్ద కుమారుడు రవినాయక్‌తో కలిసి ఎద్దుల కొనుగోలు కోసం మంగళవారం రాత్రి 9 గంటల తరువాత అడ్డదారిలో అల్లాదుర్గం మండలం చేవెళ్ల గ్రామానికి వెళ్లారు. బుధవారం ఉదయం కూడా తండ్రీ కొడుకులు ఇంటికి చేరుకోలేదు. ఇంతలో వాల్యానాయక్(65), రవినాయక్(30) లు కరెంటు షాక్‌కు గురై చనిపోయారంటూ వాల్యానాయక్ బావమరిది పూల్యానాయక్కు సమాచారం అందిం ది. పూల్యానాయక్ వెళ్లి చూడగా ఓ రైతు పత్తి చేల్లో ఇద్దరి మృతదేహాలు కన్పించా యి. రంజానాయక్ తండా నుంచి ఆర్.ఇటిక్యాల గ్రామం సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఓ రైతు తమ పొలానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడంతో ప్రమాదవశాత్తు ఆ తీగలు తాకడంతో ఈ ప్రమాదం జరిగింది. వాల్యా కూతుళ్లకు పెళ్లిళ్లు కాగా మరో ఇద్దరు కుమారులకు పెళ్లిళ్లు కాలేదు. మృతుడు రవి నాయక్‌కు భార్య రుక్మీబాయితోపాటు ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉంది. తండ్రీకొడుకుల మృతితో రంజానాయక్ తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న నారాయణఖేడ్ సీఐ నందీశ్వర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వాల్యా బావమరిది పూల్యానాయక్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు రేగోడ్ ఏఎస్ఐ అఫ్జల్ తెలిపారు.