పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న లక్ష్మీదేవి
కళ్యాణదుర్గం రూరల్/మదనపల్లె: తెలుగుదేశం నాయకులు బరితెగించారు. నామినేషన్లు ఉపసంహరించుకోవాలని, లేకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారు. బలవంతంగా విత్‌డ్రా చేయిస్తున్నారు. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఈ విధంగా వ్యవహరించిన వైనంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కొండాపురంలో సర్పంచ్ అభ్యర్థి లక్ష్మీదేవి నామినేషన్‌ను ఉపసంహరించుకోకపోతే చంపేస్తామని బెదిరించారు. ఆమెతో ఆదివారం బలవంతంగా నామినేషన్‌ను ఉపసంహరింపజేశారు. దీనిపై లక్ష్మీదేవి ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ అభ్యర్థిగా లక్ష్మీదేవి ఈనెల 4వ తేదీన నామినేషన్ దాఖలు చేశారు. ఆమెకు ప్రత్యర్థిగా టీడీపీ మద్దతుతో త్రివేణి నామినేషన్ వేశారు. ఆరోజు నుంచి లక్ష్మీదేవితో విత్ డ్రా చేయించాలని ఆమె భర్త నరసింహులును టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారు. ఆదివారం ఆమెతో విత్‌డ్రా చేయించారు.
లక్ష్మీదేవి దంపతులు ఈ విషయాన్ని ఆదివారం రాత్రి ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్‌కు తెలిపారు. అనంతరం తమ కుటుంబానికి టీడీపీ వర్గీయుల నుంచి ప్రాణహాని ఉందంటూ లక్ష్మీదేవి రూరల్ సీఐ శివశంకర్‌నాయక్, ఎస్‌ఐ సుధాకర్‌లకు ఫిర్యాదు చేశారు. తాము బరిలో ఉంటామని, రక్షణ కల్పించాలని కోరారు. ఈ విషయమై ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ మాట్లాడుతూ టీడీపీ నాయకులు అభ్యర్థిని బెదిరించడం సరికాదని చెప్పారు. ఇప్పటికైనా వారు మారకపోతే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం వేంపల్లె పంచాయతీలో టీడీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతూ వార్డు మెంబర్లుగా నామినేషన్ వేసినవారితో బలవంతంగా విత్‌డ్రా చేయిస్తున్నారని సర్పంచ్ అభ్యర్థి సంతోషి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 11వ వార్డుకు నగిరి వెంకటేశమ్మతో నామినేషన్ వేయిస్తే.. మధు, అప్పళ్ల, తిరుపతప్ప, కదిరప్ప, సతీష్ తదితరులు ఆమెతో బలవంతంగా విత్‌డ్రా చేయించారని తెలిపారు.
పంచాయతీ కార్యదర్శులపై విరుచుకుపడ్డ కోట్ల సుజాతమ్మ
చిప్పగిరి/ఆలూరు: కర్నూలు జిల్లాలో టీడీపీ నేతల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పనిచేసేందుకు అంగీకరించని అధికారులపై బెదిరింపులకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ చిప్పగిరి మండల అధికారులను బెదిరించారు. దౌల్తాపురం, రామదుర్గం పంచాయతీలకు చెందిన టీడీపీ నాయకులు వాట్సాప్‌లో వివరాలు పెట్టి నోడ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వాలని పంచాయతీల కార్యదర్శులు నరేష్‌యాదవ్, సిసింద్రీలను ఫోన్‌లో అడిగారు. నేరుగా రావాలని వారు సూచించారు. దీంతో సోమవారం సుజాతమ్మ చిప్పగిరి మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని ఎంపీడీవో అక్బర్‌సాహెబ్ సమక్షంలోనే ఈవోపీఆర్ వరలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు నరేష్‌యాదవ్, సిసింద్రీలపై విరుచుకుపడ్డారు. చిప్పగిరి ఎంపీడీవో అక్బర్‌సాహెబ్ మాట్లాడుతూ తమ వద్దకు రాకుండా ఫోన్‌లో అడిగితే ఎలా ఇస్తామని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment