భార్యాభర్తలిద్దరూ ఉపాధ్యాయులే. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన భర్త అదనపు కట్నం కోసం భార్యను మానసికంగా, శారీరకంగా హింసించినందుకు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.
బ్రహ్మసముద్రం :
భార్యాభర్తలిద్దరూ ఉపాధ్యాయులే. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన భర్త అదనపు కట్నం కోసం భార్యను మానసికంగా, శారీరకంగా హింసించినందుకు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఎస్‌ఐ నరేంద్ర భూపతి కథనం ప్రకారం..
అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లికి చెందిన నాగభూషణం కుమార్తె భువనేశ్వరి వివాహం వైఎస్సార్ జిల్లా రైల్వే కొండాపురానికి చెందిన చల్లా రాజేంద్ర ప్రసాద్‌తో 2008 మార్చి 19న అయింది. వారిద్దరూ 2007–08 డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ప్రస్తుతం అతను యల్లనూరు మండలం చిలమకూరులో ఉపాధ్యాయుడిగా పని చేస్తుండగా, భవనేశ్వరి కళ్యాణదుర్గం మండలం గూబనపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. పెళ్లి సమయంలో రూ.2 లక్షల నగదు, 15 తులాల బంగారాన్ని కట్నంగా ఇచ్చారు. కొంతకాలం వీరి సంసారం సాఫీగా సాగింది. వారికి ఐదేళ్ల బాబు ఉన్నాడు.
నిత్యం వేధింపులే...
అయితే అదనపు కట్నం కోసం భర్త రాజేంద్ర ప్రసాద్ తరచూ భార్యను వేధించేవాడు. శారీరకంగా, మానసికంగా హింసించాడు. దీనిపై పలుమార్లు పెద్ద మనుషులు పంచాయితీ చేసి సర్దిచెప్పారు. అయినా అతనిలో మార్పు రాలేదు. చేసేది లేక 2012లో ఆమె బ్రహ్మసముద్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజేంద్ర ప్రసాద్ సహా అతని తండ్రి రంగయ్య, తల్లి రమణమ్మ, అక్క సులోచన, ఆమె భర్త రవీంద్ర తదితరులపై కేసు నమోదు చేశారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం నేరం రుజువు కావడంతో భువనేశ్వరి భర్త చల్లా రాజేంద్రప్రసాద్‌కు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.15 వేలు జరిమానా విధిస్తూ కళ్యాణదుర్గం ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ నాగరాజ బుధవారం తీర్పు వెలువరించినట్లు ఎస్‌ఐ తెలిపారు. ప్రాసిక్యూషన్ తరుపున ఏపీపీ వసంతలక్ష్మి వాదించారు.